విక్రయానికి సిద్ధంగా ఉన్న గుడ్లు, అందాల పోటీలకు సిద్ధమైన కోళ్లతో కృష్ణమాచారి
పందేనికి ఓ పుంజు కావాలి.. అయితే చలో కంభం! కంభంలో కోళ్లు అంత బాగుంటాయా? ఒకసారి చూస్తే కదా తెలిసేది!! అవును కంభంలో కోళ్లు ఫేమస్సే!! కోళ్లే కాదు.. పావురాలు, జాతి శునకాలు కూడా. ఇక్కడ లభించే కోడి గుడ్లు, కోడి పిల్లల కోసం ఇతర రాష్ట్రాల నుంచే కాదు విదేశాల నుంచి క్యూ కడుతున్నారు మరి. ఇంతకీ కంభంలో కోళ్లు పెంచుతోంది ఎవరు? గుడ్డు రేటెంత? పిల్లలైతే ఎంత ధర? ఆ వివరాలు తెలుసుకుందాం కథనంలోకి పదండి..
ప్రకాశం, కంభం: కంభం పట్టణానికి చెందిన చిలకచర్ల కృష్ణామాచారి ఐటీఐ చదివి ఇంటి వద్ద ఖాళీగా ఉండేవాడు. 1989లో ఇంట్లో సరదాగా రెండు కోళ్లను పెంచుకునేవాడు. అది కాస్తా అతనికి వ్యాపకంగా మారి.. చిరు వ్యాపారంగా రూపాంతరం చెందింది. అదే వృత్తిగా మలుచుకున్న కృష్ణమాచారి 1994లో తన ఇంటి వద్ద షెడ్లు వేసి కోళ్లను పెంచడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఎన్నో రకాల కోళ్లను పెంచడమే కాకుండా, పలు రాష్ట్రాల్లో నిర్వహించే కోళ్ల అందాల పోటీల్లో పాల్గొంటూ బహుమతులు, పతకాలు సాధించి కంభం పేరును దేశ వ్యాప్తంగా తెలిసేలా చేశారు.
కోళ్ల కోసం ప్రత్యేక దాణా..
పెట్టలకు సజ్జలు, మొక్కజొన్న, రాగులు, సోయా చిక్కుడు, శనగలు, పొద్దుతిరుగుడు, తవుడు, నూక మిశ్రమాలను ఆహారంగా అందిస్తారు. పుంజులకు ఉదయం బాదం పప్పు, ద్రాక్ష, ఖర్జూరాలు, శనగపప్పు, సాయంత్ర 5–6 గంటల సమయంలో సజ్జలు, రాగులు 4 గంటలు నానబెట్టి పెడతారు. వెటర్నరీ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ కోళ్లను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
కోళ్లకు ఆహారం తినిపిస్తూ..
గుడ్డు రూ.1,000
ఒక పెట్ట ఏడాదికి నాలుగుసార్లు గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లను ఆ కోడి ద్వారానే పొదిగించి పిల్లలను విక్రయిస్తారు. పుంజులు 4 నుంచి 6.5 కిలోల బరువు, పెట్టలు 3 నుంచి 5 కేజీల బరువు పెరుగుతాయి. గుడ్డు ఒకటి రూ.1,000 కాగా, 40 రోజుల పిల్లల జత రూ.10 వేలు పలుకుతోంది. దుబాయ్, శ్రీలంకతోపాటు, మన దేశంలో ఒడిశా, తమిళనాడు నుంచి కొనుగోలుదారులు కంభం వచ్చి కోళ్లను కొనుగోలు చేస్తుంటారని కృష్ణమాచారి తెలిపారు.
ఏటా పెరుగుతున్న ఆదాయం
తొలుత నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఆదాయం వచ్చేది. 2000 సంవత్సరంలో రూ.7 వేల వరకు వచ్చాయి. ఆ తర్వాత అందాల పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టినప్పటి నుంచి కోళ్లు, గుడ్ల విక్రయం, అందాల పోటీల్లో నగదు బహుమతులు అన్నీ కలిపి 2015 నుంచి ఏడాదికి రూ.3 లక్షలు ఆదాయం వచ్చింది. 2017 నుంచి ఏడాదికి రూ.5 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు.
అరుదైన ఆశీల్..
భారతదేశంలోనే అరుదైన ఆశీల్ జాతి కోళ్లను కృష్ణమాచారి పెంచుతున్నారు. అందమైన చిలుకలాంటి ముక్కు, నెమలి లాంటి తోకలు, గద్దను తలపించే దేహాదారుఢ్యం.. చూడ చక్కని ఆకృతి అస్లీ జాతి కోళ్ల ప్రత్యేకత. ప్రస్తుతం చారి వద్ద 20 పెట్టలు, 3 పుంజులు ఉన్నాయి. ఇవి నూరు శాతం నాణ్యమైనవి. వీటి జీవిత కాలం గతంలో తొమ్మిదేళ్లు కాగా ప్రస్తుతం 6 నుంచి 7 సంవత్సరాలు బతుకుతున్నాయి. వీటికి ఎటువంటి జబ్బులు సోకవు. భారతదేశంలోనే అత్యంత అరుదుగా దొరికే ఆశీల్ జాతి కోళ్లను అందాల పోటీల కోసం, ఇంట్లో సరదాగా పెంచుకోవడం కోసం కొనుగోలు చేస్తారు.
పావురాలు, కుక్కలు కూడా..
కృష్ణమాచారి కోళ్లతోపాటు అమెరికన్ విత్ ఇంగ్లిష్ క్యారియర్, జర్మన్ బాటిన్, రోమన్, బడంగ్ రేసర్ వంటి అరుదైన జాతి పావురాలను పెంచుతున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు కర్నూలు, కడప, హైదరాబాద్, ఒంగోలు నుంచి వస్తుంటారు. వీటితోపాటు రెండు డాబర్‌మెన్ కుక్కలు కూడా చారి వద్ద ఉన్నాయి. ‘అరుదైన జాతులను అభివృద్ధి చేసి రాష్ట్ర, దేశ స్థాయిలో కంభం పట్టణానికి గుర్తింపు తీసుకురావలన్నదే నా ఆశయం. ప్రస్తుతానికి కోళ్ల కోసం దుబాయ్, శ్రీలంకతోపాటు ఇతర దేశాల వారు కూడా సంప్రదిస్తున్నార’ని కృష్ణమాచారి చెబుతున్నారు.
అందాల పోటీల్లో కోళ్లు సాధించిన బహుమతులు, దిండిగల్‌లో జరిగిన అందాల పోటీల్లో8 గ్రాముల బంగారు చైన్ గెలుపొందిన పుంజు
అందాల పోటీల్లో బహుమతుల పంట
కృష్ణమాచారి తన కోళ్లను తీసుకుని పోటీలకు వెళ్లాడంటే బహుమతి సాధించే తిరిగొస్తారు.! 2015లో దిండిగల్‌లో నిర్వహించిన అందాల పోటీల్లో ఒక సారి ప్రథమ, మరోసారి తృతీయ బహుమతి సాధించారు. ఈ ఏడాది ఆలిండాయా ఆశీల్ క్లబ్, ఇండియా ఆశీల్ క్లబ్, ఓఏటీ క్లబ్‌ల ఆధ్వర్యంలో జనవరి 5, మార్చి 3, జూన్ 10వ తేదీన పోటీలు నిర్వహించగా మూడింటిలో బంగారు పతకాలు పొంది హ్యాట్రిక్ సాధించారు. వీటితోపాటు మండల, జిల్లా స్థాయి పోటీల్లో బహుమతులు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment