kambham
-
అధైర్యపడకండి అండగా ఉంటా..
-
దళారీ వ్యవస్థ లేకుండా ప్రజలకు సంక్షేమ ఫలాలు: విజయరాజు
-
తిరుపతి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
వేకువజామున రెండు గంటలు. అంతా చిమ్మ చీకటి. కంభం రైల్వేస్టేషన్ సమీపంలో ఫ్లైఓవర్‌పై ఒక్క కుదుపు. ముందు వెళ్తున్న లారీ వేగం తగ్గి నెమ్మదించింది. వెనుకనే వస్తున్న కారు అదుపు తప్పి వేగంగా లారీని ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఏమి జరిగిందో తెలిసే లోపు అందరి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. తమ ఇష్టదైవం మొక్కు తీర్చుకునేందుకు వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారిని కబళించింది. కుమారుడు.. కుటుంబ సభ్యులు, బంధువులు కళ్లెదుటే విగతజీవులుగా మారడం ఆయా కుటుంబాలను పెను విషాదంలోకి నెట్టింది. కంభం: ఉన్నత చదువు కోసం యూకే వెళ్లిన తన కుమారుడి మొక్కు తీర్చేందుకు కుటుంబ సభ్యులతో కలసి తిరుపతి వెళ్తున్న ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన అనంతపురం–అమరావతి రోడ్డుపై సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందిన జోలకంటి హనిమిరెడ్డి, జోలకంటి గురవమ్మలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీనివాసరెడ్డి హైదరాబాదులో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటుండగా చిన్న కుమారుడు జోలకంటి నాగిరెడ్డి (23) గుంటూరులో బీటెక్ పూర్తి చేసి పది నెలల క్రితం ఎంఎస్ చదివేందుకు యూకే వెళ్లాడు. పది రోజుల క్రితం ఇంటికి వచ్చిన తన కుమారుడి తిరుపతి మొక్కు తీర్చేందుకు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో రెండు కార్లలో బయలు దేరారు. ఒక కారులో నాగిరెడ్డి డ్రైవింగ్ చేస్తుండగా ఆ కారులో అతని తాత, అమ్మమ్మ, ఇద్దరు చిన్న అమ్మమ్మలు కూర్చున్నారు. మరో కారులో నాగిరెడ్డి తల్లిదండ్రులు, సోదరుడు, మరో 8 మంది అతని బంధువులు ఉన్నారు. కారు కంభం సమీపంలో ఫ్లైవోవర్ వద్ద అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టడంతో కారు మొత్తం నుజ్జునుజ్జయిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న జోలకంటి నాగిరెడ్డి (23), చిలకల పెద్ద హనిమారెడ్డి (70), అతని భార్య ఆదిలక్ష్మమ్మ (60), ఆదిలక్ష్మమ్మ సోదరి పల్లె అనంత రామమ్మ (50), మరో సోదరి భూమిరెడ్డి గురువమ్మ (60)లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు చిలకల పెద్ద హనిమారెడ్డికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. పల్లె అనంతరామమ్మకు భర్త, ఒక కుమార్తె ఉన్నారు. గురువమ్మకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుల కుటుంబాలు వ్యవసాయం చేసుకుని జీవించే వారు. పల్లె అనంతరామమ్మ బొల్లపల్లి మండలం దేమిడిచర్లలో నివాసం ఉంటుండగా, మిగిలిన వారందరూ సిరిగిరిపాడులో నివాసం ఉంటున్నారు. కష్టాలు తీరుస్తాడనుకుంటే కడుపుకోత మిగిల్చాడు వ్యవసాయం, పొలం పనులు చేసుకుంటూ తన చిన్నకుమారుడిని ఉన్నత చదువు కోసం విదేశాలకు పంపించగా త్వరలో వచ్చి కుటుంబ సమస్యలన్నీ తీరుస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులకు నాగిరెడ్డి కడుపుకోత మిగిల్చి వెళ్లిపోయాడు. నాగిరెడ్డి తల్లిదండ్రులు కుమారుడిని బీటెక్ వరకు గుంటూరులో చదివించుకున్నారు. కుమారుడు చదువులో రాణిస్తుండటంతో సుమారు రూ.15 లక్షల వరకు అప్పు చేసి మరీ విదేశాలకు పంపించి చదివిస్తున్నట్లు బంధువులు తెలిపారు. త్వరలో చదువు ముగించుకొని తిరిగి వచ్చి చేసిన అప్పులు తీర్చడంతో పాటు కుటుంబానికి అండగా ఉంటాడని అనుకుంటున్న ఆ కుటుంబానికి విషాదం మిగిలింది. తల్లిదండ్రులతో పాటు కుమారుడు మృతి జోలకంటి నాగిరెడ్డి తల్లి గురవమ్మ ఈ ప్రమాదంలో కుమారుడితో పాటు, ఆమె తల్లిదండ్రులు చిలకల పెద్ద హనిమారెడ్డి, తల్లి ఆదిలక్ష్మమ్మ, చిన్నమ్మలు పల్లె అనంత రామమ్మ, భూమిరెడ్డి గురవమ్మలను కోల్పోయింది. దీంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం తరలింపు: సంఘటనా స్థలం నుంచి మృతదేహాలను హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన సీఐ యం.రాజేష్, ఎస్సై నాగమల్లేశ్వరరావు మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతో వారు స్వగ్రామం తీసుకెళ్లారు. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ముర్రా.. మేడిన్ ఆంధ్రా -
యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన
సాక్షి, కంభం(ప్రకాశం): ఎన్నికల కోడ్ వచ్చి 6 రోజులైనప్పటికీ పలుచోట్ల కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. పట్టణంలోని ఏపీ ఆన్లైన్ సెంటర్లో ఇచ్చే రశీదుల్లో ముఖ్యమంత్రి ఫొటో, రశీదు వెనుక వైపున టీడీపీ ప్రభుత్వం పథకాలు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకాలు కూడా ఎక్కడా కన్పించకూడదు. అందులో భాగంగా అధికారులు గ్రామాల్లోని శిలాఫలకాలు, బ్యానర్లు తొలగించుకుంటూ వచ్చారు. కానీ పట్టణ కేంద్రంలో ఉన్న ఏపీ ఆన్లైన్ సెంటర్లో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరుగుతూనే ఉంది వివిధ రకాల సర్టిఫికెట్లు, పొలాల సమస్యల పరిష్కారాల కోసం, ప్రజలు వస్తుంటారు. వారి దరఖాస్తులు పూర్తిచేసిన అనంతరం రశీదు తీసి ఇచ్చిన దరఖాస్తుకు జతచేసి సంబంధిత కార్యాలయాల్లో అందజేస్తారు. ఆ రశీదుల పైన ముందు భాగం, వెనుక భాగాన ముఖ్యమంత్రి ఫొటోలు, పథకాలు దర్శనమిస్తున్నా సంబంధిత కార్యాలయాల్లోని అధికారులు సైతం పట్టించుకోక పోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని కోడ్ ఉల్లంఘన జరగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. కంభంలో.. కంభం : పట్టణంలోని బీసీ, ఎస్సీ హాస్టళ్లలో గోడల పైన ఉన్న మెనూ చార్ట్‌లో ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పథకాల బ్యానర్లు, ఫొటోలు తొలగించాలని తెలిసినప్పటికి హాస్టల్ వార్డన్లు కానీ, ఇతర అధికారులు కానీ పట్టించుకోక పోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బీసీ, ఎస్సీ –1, ఎస్సీ2 హాస్టల్లలో బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. సంబందింత అధికారులు స్పందించి ఎలక్షన్ కోడ్ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
కోడి గుడ్డు రూ.వెయ్యి.. కోడి పిల్లల జత 10 వేలు
పందేనికి ఓ పుంజు కావాలి.. అయితే చలో కంభం! కంభంలో కోళ్లు అంత బాగుంటాయా? ఒకసారి చూస్తే కదా తెలిసేది!! అవును కంభంలో కోళ్లు ఫేమస్సే!! కోళ్లే కాదు.. పావురాలు, జాతి శునకాలు కూడా. ఇక్కడ లభించే కోడి గుడ్లు, కోడి పిల్లల కోసం ఇతర రాష్ట్రాల నుంచే కాదు విదేశాల నుంచి క్యూ కడుతున్నారు మరి. ఇంతకీ కంభంలో కోళ్లు పెంచుతోంది ఎవరు? గుడ్డు రేటెంత? పిల్లలైతే ఎంత ధర? ఆ వివరాలు తెలుసుకుందాం కథనంలోకి పదండి.. ప్రకాశం, కంభం: కంభం పట్టణానికి చెందిన చిలకచర్ల కృష్ణామాచారి ఐటీఐ చదివి ఇంటి వద్ద ఖాళీగా ఉండేవాడు. 1989లో ఇంట్లో సరదాగా రెండు కోళ్లను పెంచుకునేవాడు. అది కాస్తా అతనికి వ్యాపకంగా మారి.. చిరు వ్యాపారంగా రూపాంతరం చెందింది. అదే వృత్తిగా మలుచుకున్న కృష్ణమాచారి 1994లో తన ఇంటి వద్ద షెడ్లు వేసి కోళ్లను పెంచడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఎన్నో రకాల కోళ్లను పెంచడమే కాకుండా, పలు రాష్ట్రాల్లో నిర్వహించే కోళ్ల అందాల పోటీల్లో పాల్గొంటూ బహుమతులు, పతకాలు సాధించి కంభం పేరును దేశ వ్యాప్తంగా తెలిసేలా చేశారు. కోళ్ల కోసం ప్రత్యేక దాణా.. పెట్టలకు సజ్జలు, మొక్కజొన్న, రాగులు, సోయా చిక్కుడు, శనగలు, పొద్దుతిరుగుడు, తవుడు, నూక మిశ్రమాలను ఆహారంగా అందిస్తారు. పుంజులకు ఉదయం బాదం పప్పు, ద్రాక్ష, ఖర్జూరాలు, శనగపప్పు, సాయంత్ర 5–6 గంటల సమయంలో సజ్జలు, రాగులు 4 గంటలు నానబెట్టి పెడతారు. వెటర్నరీ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ కోళ్లను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కోళ్లకు ఆహారం తినిపిస్తూ.. గుడ్డు రూ.1,000 ఒక పెట్ట ఏడాదికి నాలుగుసార్లు గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లను ఆ కోడి ద్వారానే పొదిగించి పిల్లలను విక్రయిస్తారు. పుంజులు 4 నుంచి 6.5 కిలోల బరువు, పెట్టలు 3 నుంచి 5 కేజీల బరువు పెరుగుతాయి. గుడ్డు ఒకటి రూ.1,000 కాగా, 40 రోజుల పిల్లల జత రూ.10 వేలు పలుకుతోంది. దుబాయ్, శ్రీలంకతోపాటు, మన దేశంలో ఒడిశా, తమిళనాడు నుంచి కొనుగోలుదారులు కంభం వచ్చి కోళ్లను కొనుగోలు చేస్తుంటారని కృష్ణమాచారి తెలిపారు. ఏటా పెరుగుతున్న ఆదాయం తొలుత నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఆదాయం వచ్చేది. 2000 సంవత్సరంలో రూ.7 వేల వరకు వచ్చాయి. ఆ తర్వాత అందాల పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టినప్పటి నుంచి కోళ్లు, గుడ్ల విక్రయం, అందాల పోటీల్లో నగదు బహుమతులు అన్నీ కలిపి 2015 నుంచి ఏడాదికి రూ.3 లక్షలు ఆదాయం వచ్చింది. 2017 నుంచి ఏడాదికి రూ.5 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు. అరుదైన ఆశీల్.. భారతదేశంలోనే అరుదైన ఆశీల్ జాతి కోళ్లను కృష్ణమాచారి పెంచుతున్నారు. అందమైన చిలుకలాంటి ముక్కు, నెమలి లాంటి తోకలు, గద్దను తలపించే దేహాదారుఢ్యం.. చూడ చక్కని ఆకృతి అస్లీ జాతి కోళ్ల ప్రత్యేకత. ప్రస్తుతం చారి వద్ద 20 పెట్టలు, 3 పుంజులు ఉన్నాయి. ఇవి నూరు శాతం నాణ్యమైనవి. వీటి జీవిత కాలం గతంలో తొమ్మిదేళ్లు కాగా ప్రస్తుతం 6 నుంచి 7 సంవత్సరాలు బతుకుతున్నాయి. వీటికి ఎటువంటి జబ్బులు సోకవు. భారతదేశంలోనే అత్యంత అరుదుగా దొరికే ఆశీల్ జాతి కోళ్లను అందాల పోటీల కోసం, ఇంట్లో సరదాగా పెంచుకోవడం కోసం కొనుగోలు చేస్తారు. పావురాలు, కుక్కలు కూడా.. కృష్ణమాచారి కోళ్లతోపాటు అమెరికన్ విత్ ఇంగ్లిష్ క్యారియర్, జర్మన్ బాటిన్, రోమన్, బడంగ్ రేసర్ వంటి అరుదైన జాతి పావురాలను పెంచుతున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు కర్నూలు, కడప, హైదరాబాద్, ఒంగోలు నుంచి వస్తుంటారు. వీటితోపాటు రెండు డాబర్‌మెన్ కుక్కలు కూడా చారి వద్ద ఉన్నాయి. ‘అరుదైన జాతులను అభివృద్ధి చేసి రాష్ట్ర, దేశ స్థాయిలో కంభం పట్టణానికి గుర్తింపు తీసుకురావలన్నదే నా ఆశయం. ప్రస్తుతానికి కోళ్ల కోసం దుబాయ్, శ్రీలంకతోపాటు ఇతర దేశాల వారు కూడా సంప్రదిస్తున్నార’ని కృష్ణమాచారి చెబుతున్నారు. అందాల పోటీల్లో కోళ్లు సాధించిన బహుమతులు, దిండిగల్‌లో జరిగిన అందాల పోటీల్లో8 గ్రాముల బంగారు చైన్ గెలుపొందిన పుంజు అందాల పోటీల్లో బహుమతుల పంట కృష్ణమాచారి తన కోళ్లను తీసుకుని పోటీలకు వెళ్లాడంటే బహుమతి సాధించే తిరిగొస్తారు.! 2015లో దిండిగల్‌లో నిర్వహించిన అందాల పోటీల్లో ఒక సారి ప్రథమ, మరోసారి తృతీయ బహుమతి సాధించారు. ఈ ఏడాది ఆలిండాయా ఆశీల్ క్లబ్, ఇండియా ఆశీల్ క్లబ్, ఓఏటీ క్లబ్‌ల ఆధ్వర్యంలో జనవరి 5, మార్చి 3, జూన్ 10వ తేదీన పోటీలు నిర్వహించగా మూడింటిలో బంగారు పతకాలు పొంది హ్యాట్రిక్ సాధించారు. వీటితోపాటు మండల, జిల్లా స్థాయి పోటీల్లో బహుమతులు అందుకున్నారు. -
అంబేద్కర్ అందరివాడు
కంభం: అంబేద్కర్ అందరివాడని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎస్ఐ రామానాయక్ అన్నారు. స్థానిక కందులాపురం కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు కాటమాల చెన్నకేశవరావు అధ్యక్షతన అంబేడ్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో కందులాపురం కూడలి నుంచి తహశీల్దార కార్యాలయం మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి షాలెంరాజు, బీఎస్పీ జిల్లా కార్యదర్శి పానుగంటి సతీశ్, మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు కల్వకూరి అబ్రహం, అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ చింతల అరుణ్‌దీప్, ఎన్జీఓ ఏలియా, సీఐటీయూ నాయకుడు దాసరిరెడ్డి, పీపుల్స్ యాక్షన్ ఫోరం నాయకుడు పులుగుజ్జు సురేశ్, కంభం, కందులాపురం సర్పంచులు స్టార్బాషా, మెర్సికమల తదితరులు పాల్గొన్నారు. వాసవీ విద్యాసంస్థల వైస్ చైర్మన్ గోళ్ల సుబ్బరత్నం సిబ్బందితో కలిసి కందులాపురం కూడలిలో అంబేద్కర్‌కు నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో: వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి చెన్ను విజయ ఆధ్వర్యంలో కంభం, అర్ధవీడు మండలాల వైఎస్సార్సీపీ నాయకులు ర్యాలీగా వచ్చి కందులాపురం కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కంభం మండల రూరల్ లాయర్ శ్రీనివాసులరెడ్డి, నాయకులు సి.హెచ్. వెంకటేశ్వర్లు, గర్రె వెంకటేశ్వర్లు, పఠాన్ జఫ్రుల్లా ఖాన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
కంభం చెరువు చైర్మన్‌గా శ్రీపతి బాలకోటయ్య
► సమావేశం అని చెప్పి కంభం చెరువు కమిటీ ఎన్నిక ► టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి అన్నా వెంకట రాంబాబు సూచించిన వ్యక్తులకే పదవులు ► విషయం బయటకు వస్తే తలనొప్పులు వస్తాయని గుట్టుగా ఉంచిన వ్యవహారం బేస్తవారిపేట: కంభం చెరువు చైర్మన్‌గా కంభం మండలం హజరత్‌గూడెం నీటి సంఘం అధ్యక్షుడు శ్రీపతి బాలకోటయ్య నియామకం శుక్రవారం జరిగినట్లు సమాచారం అందింది. మార్కాపురం ఇరిగేషన్‌శాఖ కార్యాలయంలో సమావేశం ఉం దని రెండు రోజుల కిందట ఇరిగేషన్‌శాఖ అధికారులు పాపాయిపల్లె, చిన్న కంభం, హజరత్‌గూడెం నీటి సంఘం అధ్యక్షులకు సమాచారం పంపారు. ఆరు నెలల కిందట నియమించాల్సిన చెరువు కమిటీని హడావుడిగా గుట్టుగా జరిపించారు. మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు సూచించిన హజరత్‌గూడెం నీటి సంఘం అధ్యక్షుడిని చైర్మన్‌గా, పాపాయిపల్లె నీటి సంఘం అధ్యక్షుడు బొగ్గు శ్రీహరిని వైస్ చైర్మన్‌గా, చిన్న కంభం నీటి సంఘం అధ్యక్షుడు పాలాబత్తుని కృష్ణయ్యను సభ్యుడిగా ఎన్నిక చేశారు. చీతిరేల కతువ, నక్కల గండి నీటి సంఘానికి ఇంతవరకు ఎన్నికలు జరగకపోవడంతో ఉన్న ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ విషయం బయటకు వస్తే అధికార పార్టీలోకి మారిన ఎమ్మెల్యేతో తలనొప్పులు వస్తాయని కమిటీ ఎన్నిక విషయాన్ని గుట్టుగా ఉంచారు. -
మా గోడు తీర్చేదెవరు?
కంభం రూరల్: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం బంగారం పండే భూములను త్యాగం చేసిన మాకు గృహాలు నిర్మించుకునేందుకు స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వం, అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎదుట పలువురు ముంపు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కాకర్ల డ్యాం నిర్మాణ పనులు పరిశీలించేందుకు ఆదివారం సాయంత్రం వచ్చిన ఎంపీని ముంపు గ్రామాలైన లక్ష్మీపురం, ముట్టుగుంది, సాయిరాంనగర్, కృష్ణానగర్ ప్రజలు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. డ్యాం నిర్మాణానికి తాము 3,600 ఎకరాల భూములు ఇచ్చామన్నారు. తమకు పునరావాసం కోసం 20 ఎకరాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చిన అధికారులు నేటికీ పట్టించుకోవడం లేదన్నారు. 3 వేల ఎకరాలకే నష్టపరిహారం ఇచ్చారని, మిగిలిన 600 ఎకరాలకు నేటికీ పరిహారం అందలేదన్నారు. అదే వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే తమకు ఈ అన్యాయం జరిగేది కాదన్నారు. దేవరాజుగట్టు వద్ద ఉన్న వంద ఎకరాల్లో నివేశన స్థలం ఇప్పించాలని పెద్దారవీడు మండలం గుండంచర్ల వాసులు ఎంపీకి విన్నవించారు. దీనిపై స్పందించిన ఎంపీ ప్రాజెక్టు అధికారులు సుధాకర్, రమేష్‌బాబులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులతో మాట్లాడుతూ వచ్చేనెల 11, 12 తేదీల్లో ఒంగోలులో అందుబాటులో ఉంటానని, మీ ప్రాంత శాసనసభ్యులతో కలిసి వస్తే సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. అర్థవీడు మండల కన్వీనర్ రంగారెడ్డి మాట్లాడుతూ కాకర్లలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మించాలని, సంగీత కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎంపీ సంగీత విద్వాంసుడు త్యాగరాజు జన్మస్థలమైన కాకర్లలో సంగీత కళాశాల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ వెంట గిద్దలూరు, యర్రగొండపాలెం, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, డేవిడ్ రాజు, ఆదిమూలపు సురేష్, వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు యేలం వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సూర స్వామిరంగారెడ్డి, అర్థవీడు ఎంపీపీ రవికుమార్ యాదవ్, జెడ్పీటీసీ కొడావత్ లక్ష్మీదేవి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు క్రాంతికుమార్, మాజీ ఎంపీపీ గొటిక రాజేశ్వరరెడ్డి, కంభం, అర్థవీడు మండలాల కన్వీనర్లు సయ్యద్ మాబు, ఏరువ రంగారెడ్డి, కంభం మండల వైఎస్సార్ సీపీ నాయకులు చేగిరెడ్డి ఓబులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో దూకి.. తనువు చాలించి..
కంభం రూరల్, న్యూస్‌లైన్: క్షణికావేశం ఓ విద్యార్థి నిండు జీవితాన్ని బలి తీసుకుంది. పరీక్షలో చూసి రాస్తుండగా ఆగ్రహించిన ఉపాధ్యాయుడు సదరు విద్యార్థి నుంచి పేపరు తీసుకోవడంతో మనస్తాపం చెంది మంగళవారం కంభం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోగా బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. వెలిగొండ ప్రాజెక్టు జూనియర్ అసిస్టెంట్ పఠాన్ హుస్సేన్‌ఖాన్ స్థానిక అర్బన్ కాలనీలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన కుమారుడు పఠాన్ ముజిమిల్ ఖాన్ (15) స్థానిక ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం యూనిట్ పరీక్షలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం తన ఇద్దరు మిత్రులతో కలిసి గ్రూపుగా ఏర్పడి ముజిమిల్ ఖాన్ పరీక్ష రాస్తుండగా ఓ ఉపాధ్యాయుడు గమనించి వారి పేపర్లు తీసుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లిన ముజిమిల్ ఖాన్.. తిరిగి మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లలేదు. మధ్యాహ్నం నుంచి విద్యార్థి పాఠశాలకు రాకపోవడంతో యాజమాన్యం తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించింది. అప్రమత్తమైన తల్లిదండ్రులు, బంధువులు వివిధ ప్రాంతాల్లో గాలిస్తూ కంభం చెరువుకు వెళ్లారు. పెద్ద కంభం తూము వద్ద సైకిల్, చెప్పులు, కళ్లజోడు, వాచీ కనిపించాయి. దీంతో ముజిమిల్ ఖాన్ చెరువులోకి దూకాడన్న అనుమానంతో తండ్రి బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై హజరతయ్య, విద్యార్థి బంధువులు కలిసి యర్రబాలేనికి చెందిన గజ ఈతగాళ్లను పిలిపించి చెరువులో గాలించగా విద్యార్థి మృతదేహం బయట పడింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు భోరున విలపించారు. క్షణికావేశానికి నిండు ప్రాణం బలి విద్యార్థులు క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని తమ బంగారు భవిష్యత్తును కాలరాసుకోవడమేకాకుండా తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిలిస్తున్నారు. గతేడాది నవంబర్‌లో కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదివే ఓ విద్యార్థిని కూడా ఇలాగే ఆత్మహత్యకు పాల్పడింది. ముజిమిల్ ఖాన్‌కు అటు తల్లిదండ్రుల నుంచి ఇటు ఉపాధ్యాయుల నుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేవు. పరీక్ష చూసి రాయడంతో ఉపాధ్యాయుడు పేపర్ తీసుకున్నాడని మనస్తాపం చెందిన విద్యార్థి.. చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడటంపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల సంతాపం ముజిమిల్ ఖాన్ ఆత్మహత్య చేసుకున్నాడన్న స మాచారం మేరకు పాఠశాల కరస్పాండెంటు.. ఉపాధ్యాయులతో కలిసి చెరువుకట్టకు వెళ్లారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి విద్యార్థిమృతికి సంతాపం తెలిపారు. -
మైత్రి పేరుతో మోసం
కంభం రూరల్, న్యూస్‌లైన్ :మైత్రి సంస్థ పేరుతో ఓ కుటుంబం పేదలకు కోటి రూపాయలకుపైగా కుచ్చుటోపీ పెట్టి రాత్రికి రాత్రే పరారైంది. బాధితులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. కంభంలో మైత్రి ప్లానిటేషన్ అండ్ హార్టీకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రెండేళ్ల క్రితం ఓ సంస్థను ప్రారంభించారు. కంభానికి చెందిన తుమ్మలపల్లి శ్రీహరి, అతని భార్య, కుమారుడు ఏజెంట్లుగా వ్యవహరించారు. తెలిసిన వారి వద్ద రూ. 50 వేలు నుంచి లక్ష రూపాయల మేరకు కంతులు కట్టించుకున్నారు. పదివేలు కడితే ఐదేళ్లకు రూ. 25 వేలు, రూ. 30 వేలు కడితే ఐదేళ్లకు రూ. 60 వేలతో పాటు ఖమ్మం జిల్లాలో ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు ప్రామిసరీ నోట్లు కూడా ఇచ్చి నమ్మించారు. శ్రీహరి మాటలు నమ్మిన పేదలు తినీతినక దాచుకున్న డబ్బును తమ పిల్లల పేరిట కట్టారు. తమాషా ఏమిటంటే ఆరు నెలల క్రితమే హైదరాబాద్‌లో ఉన్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయం మూతబడింది. ఆ తర్వాత కూడా శ్రీహరి కుటుంబం మైత్రి సంఘం తరఫునే డబ్బు కట్టించుకుని నకిలీ పత్రాలు ఇచ్చి లక్షలాది రుపాయలు వసూలు చేసుకుంది. తమ పిల్లల పేరుతో డిపాజిట్లు రూ. 22 వేలు చొప్పున కట్టామని బాధితులు కావేరి, మీనిగ ఆదిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. భూపాని మాధవి రూ. 18 వేలు, మునగపాటి నాగలక్ష్మి రూ. 50 వేలు కట్టినట్లు చెప్పారు. ఒక్క శీలం వీధిలోనే సుమారు వంద కుటుంబాల నుంచి రూ. 20 లక్షల వరకు వసూలు చేసుకున్నట్లు సమాచారం. అర్థవీడు, బేస్తవారిపేట మండలాల్లో వందలాది మంది మైత్రి సంఘంలో లక్షలాది రూపాయలు డిపాజిట్లు కట్టారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని పోలీసులను బాధితులు వేడుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కంభం ఎస్సై రామకోటయ్య తెలిపారు.