మైత్రి పేరుతో మోసం
Published Mon, Oct 21 2013 2:41 AM | Last Updated on Wed, Apr 3 2019 3:50 PM
కంభం రూరల్, న్యూస్‌లైన్ :మైత్రి సంస్థ పేరుతో ఓ కుటుంబం పేదలకు కోటి రూపాయలకుపైగా కుచ్చుటోపీ పెట్టి రాత్రికి రాత్రే పరారైంది. బాధితులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. కంభంలో మైత్రి ప్లానిటేషన్ అండ్ హార్టీకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రెండేళ్ల క్రితం ఓ సంస్థను ప్రారంభించారు. కంభానికి చెందిన తుమ్మలపల్లి శ్రీహరి, అతని భార్య, కుమారుడు ఏజెంట్లుగా వ్యవహరించారు. తెలిసిన వారి వద్ద రూ. 50 వేలు నుంచి లక్ష రూపాయల మేరకు కంతులు కట్టించుకున్నారు. పదివేలు కడితే ఐదేళ్లకు రూ. 25 వేలు, రూ. 30 వేలు కడితే ఐదేళ్లకు రూ. 60 వేలతో పాటు ఖమ్మం జిల్లాలో ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు ప్రామిసరీ నోట్లు కూడా ఇచ్చి నమ్మించారు. శ్రీహరి మాటలు నమ్మిన పేదలు తినీతినక దాచుకున్న డబ్బును తమ పిల్లల పేరిట కట్టారు.
తమాషా ఏమిటంటే ఆరు నెలల క్రితమే హైదరాబాద్‌లో ఉన్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయం మూతబడింది. ఆ తర్వాత కూడా శ్రీహరి కుటుంబం మైత్రి సంఘం తరఫునే డబ్బు కట్టించుకుని నకిలీ పత్రాలు ఇచ్చి లక్షలాది రుపాయలు వసూలు చేసుకుంది. తమ పిల్లల పేరుతో డిపాజిట్లు రూ. 22 వేలు చొప్పున కట్టామని బాధితులు కావేరి, మీనిగ ఆదిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. భూపాని మాధవి రూ. 18 వేలు, మునగపాటి నాగలక్ష్మి రూ. 50 వేలు కట్టినట్లు చెప్పారు. ఒక్క శీలం వీధిలోనే సుమారు వంద కుటుంబాల నుంచి రూ. 20 లక్షల వరకు వసూలు చేసుకున్నట్లు సమాచారం. అర్థవీడు, బేస్తవారిపేట మండలాల్లో వందలాది మంది మైత్రి సంఘంలో లక్షలాది రూపాయలు డిపాజిట్లు కట్టారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని పోలీసులను బాధితులు వేడుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కంభం ఎస్సై రామకోటయ్య తెలిపారు.
Advertisement
Advertisement