కంభం రూరల్, న్యూస్‌లైన్: క్షణికావేశం ఓ విద్యార్థి నిండు జీవితాన్ని బలి తీసుకుంది. పరీక్షలో చూసి రాస్తుండగా ఆగ్రహించిన ఉపాధ్యాయుడు సదరు విద్యార్థి నుంచి పేపరు తీసుకోవడంతో మనస్తాపం చెంది మంగళవారం కంభం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోగా బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. వెలిగొండ ప్రాజెక్టు జూనియర్ అసిస్టెంట్ పఠాన్ హుస్సేన్‌ఖాన్ స్థానిక అర్బన్ కాలనీలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన కుమారుడు పఠాన్ ముజిమిల్ ఖాన్ (15) స్థానిక ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం యూనిట్ పరీక్షలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం తన ఇద్దరు మిత్రులతో కలిసి గ్రూపుగా ఏర్పడి ముజిమిల్ ఖాన్ పరీక్ష రాస్తుండగా ఓ ఉపాధ్యాయుడు గమనించి వారి పేపర్లు తీసుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లిన ముజిమిల్ ఖాన్.. తిరిగి మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లలేదు. మధ్యాహ్నం నుంచి విద్యార్థి పాఠశాలకు రాకపోవడంతో యాజమాన్యం తల్లిదండ్రులకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందించింది. అప్రమత్తమైన తల్లిదండ్రులు, బంధువులు వివిధ ప్రాంతాల్లో గాలిస్తూ కంభం చెరువుకు వెళ్లారు. పెద్ద కంభం తూము వద్ద సైకిల్, చెప్పులు, కళ్లజోడు, వాచీ కనిపించాయి. దీంతో ముజిమిల్ ఖాన్ చెరువులోకి దూకాడన్న అనుమానంతో తండ్రి బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై హజరతయ్య, విద్యార్థి బంధువులు కలిసి యర్రబాలేనికి చెందిన గజ ఈతగాళ్లను పిలిపించి చెరువులో గాలించగా విద్యార్థి మృతదేహం బయట పడింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు భోరున విలపించారు.
క్షణికావేశానికి నిండు ప్రాణం బలి
విద్యార్థులు క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని తమ బంగారు భవిష్యత్తును కాలరాసుకోవడమేకాకుండా తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిలిస్తున్నారు. గతేడాది నవంబర్‌లో కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదివే ఓ విద్యార్థిని కూడా ఇలాగే ఆత్మహత్యకు పాల్పడింది. ముజిమిల్ ఖాన్‌కు అటు తల్లిదండ్రుల నుంచి ఇటు ఉపాధ్యాయుల నుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేవు. పరీక్ష చూసి రాయడంతో ఉపాధ్యాయుడు పేపర్ తీసుకున్నాడని మనస్తాపం చెందిన విద్యార్థి.. చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడటంపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయుల సంతాపం
ముజిమిల్ ఖాన్ ఆత్మహత్య చేసుకున్నాడన్న స మాచారం మేరకు పాఠశాల కరస్పాండెంటు.. ఉపాధ్యాయులతో కలిసి చెరువుకట్టకు వెళ్లారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి విద్యార్థిమృతికి సంతాపం తెలిపారు.
చెరువులో దూకి.. తనువు చాలించి..
Published Thu, Jan 9 2014 5:03 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement
Advertisement