
కోల్‌కతా: కంటిచూపు మందగించడం, మరోవైపు తండ్రి మందలింపుతో మనస్తాపం చెందిన ఓ యువకుడు(20) సిమెంట్ మింగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన జార్ఖండ్‌లో జరిగింది. పాకుర్ జిల్లాకు చెందిన బిమల్ పాల్ సోషల్‌మీడియాలో ఎక్కువ సమయం గడిపేవాడు. కంటిచూపు సమస్యతో బాధపడుతున్న బిమల్‌ను అతని స్నేహితులు వెక్కిరించేవారు. తనకు విగ్రహాల తయారీలో సాయం చేయకుండా సోషల్‌మీడియాలో సమయం వృథా చేయడంపై బిమల్‌ను బుధవారం తండ్రి బిరేన్ మందలించాడు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బిమల్ తండ్రి పనికోసం వాడుతున్న 2 కేజీల సిమెంట్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను మింగేసి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో బాధితుడ్ని పశ్చిమబెంగాల్‌లోని బుర్ద్వాన్ వైద్య కళాశాలలో చేర్చారు. వైద్యుల బృందం ఆపరేషన్ చేసి బిమల్ కడుపులోని సిమెంట్, ప్లాస్టర్‌ను వెలికితీశారు.