offended
-
డబుల్ బెడ్రూం ఇల్లు రాలేదని యువకుడి ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): డబుల్బెడ్రూం ఇంటిని తనకు కేటాయించలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన చిలువేరి గౌతమ్(32) హైదరాబాద్‌లో ప్రైవేట్ కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. స్థానికంగా నిర్మించిన డబుల్బెడ్రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా అర్హుల జాబితాలో గౌతమ్ పేరు వచ్చింది. అయితే చివరి కేటాయింపు లిస్టులో తన పేరును అధికారులు తొలగించడంతో గౌతమ్ పదిరోజుల క్రితం ఇక్కడికి వచ్చి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగాడు. తండ్రి పేరిట సొంతిల్లు ఉన్నందున డబుల్ బెడ్రూం ఇల్లు రాదని అధికారులు తేల్చి చెప్పడంతో గురువారం వేకువజామున భార్య, పిల్లలు నిద్రలో ఉండగా దూలానికి ఉరేసుకున్నాడు. అతడికి భార్య ప్రవళిక, కుమారుడు గణేశ్(4), కూతురు లాస్య(2) ఉన్నారు. కాగా, గౌతమ్ తండ్రి గంగప్రసాద్‌కు సొంతిల్లు, ఆ పక్కనే రెండు గుంటల ఖాళీస్థలం ఉండటంతో అతడి దరఖాస్తును తిరస్కరించినట్లు తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు. -
తండ్రి తిట్టాడని 2 కేజీల సిమెంట్ మింగాడు!
కోల్‌కతా: కంటిచూపు మందగించడం, మరోవైపు తండ్రి మందలింపుతో మనస్తాపం చెందిన ఓ యువకుడు(20) సిమెంట్ మింగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన జార్ఖండ్‌లో జరిగింది. పాకుర్ జిల్లాకు చెందిన బిమల్ పాల్ సోషల్‌మీడియాలో ఎక్కువ సమయం గడిపేవాడు. కంటిచూపు సమస్యతో బాధపడుతున్న బిమల్ను అతని స్నేహితులు వెక్కిరించేవారు. తనకు విగ్రహాల తయారీలో సాయం చేయకుండా సోషల్‌మీడియాలో సమయం వృథా చేయడంపై బిమల్ను బుధవారం తండ్రి బిరేన్ మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బిమల్ తండ్రి పనికోసం వాడుతున్న 2 కేజీల సిమెంట్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను మింగేసి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో బాధితుడ్ని పశ్చిమబెంగాల్లోని బుర్ద్వాన్ వైద్య కళాశాలలో చేర్చారు. వైద్యుల బృందం ఆపరేషన్ చేసి బిమల్ కడుపులోని సిమెంట్, ప్లాస్టర్‌ను వెలికితీశారు. -
ఆ మృతులు... పాలమూరు బిడ్డలు
♦ ఆ ఇద్దరూ స్నేహితులే ♦ మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న శిరీష, మంజుల ♦ ‘సాక్షి’ కథనం చదివి తరలివచ్చిన వారి తల్లులు ♦ గజ్వేల్ మార్చురీలో మృతదేహాల గుర్తింపు ♦ కలిచివేసిన బాధితుల రోదన గజ్వేల్: జగదేవ్‌పూర్ మండలం కొండపోచమ్మ ఆలయ గుట్టల్లో సోమవారం వెలుగు చూసిన ఇద్దరు బాలికల మృతదేహాల కేసు మిస్టరీ ‘సాక్షి’ కథనంతో వీడింది. ప్రధాన సంచికలో ప్రచురితమైన ఈ కథనం చూసి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మృతుల తల్లులు, బంధువులు గజ్వేల్‌కు చేరుకున్నారు. పోస్టుమార్టం గదిలో శవాలు చూసి తమ పిల్లలేనని గుర్తించి కన్నీరుమున్నీరయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం సూరారం గ్రామానికి చెందిన పూజరి నర్సమ్మ-చెన్నయ్య దంపతుల కూతురు శిరీష(15), యాదమ్మ-బాల్‌రాజు దంపతుల కూతురు మంజుల ఇద్దరు స్నేహితులు. పదోతరగతి పరీక్షలు మరో మూడు మిగిలి ఉండగానే ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శవాలు కుళ్లిపోయి ఉండడంతో దాదాపు ఏప్రిల్ 3న లేదా 4వ తేదీల్లో ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు ఇలా... మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం సూరారం గ్రామానికి చెందిన పూజరి నర్సమ్మ-చెన్నయ్య దంపతుల కూతురు శిరీష(15). గత కొన్నేళ్ల క్రితం తండ్రి చెన్నయ్య మరణించాడు. వీరిది రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. నర్సమ్మ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే రెండేళ్ల నుంచి శిరీష అయ్యవారుపల్లిలోని మేనత్త యాదమ్మ ఇంట్లో ఉంటోంది. 10 కిలోమీటర్ల దూరంలోని ఫారూక్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ జెడ్పీహెచ్ఎస్లో పదోతరగతి చదివింది. యాదమ్మ-బాల్‌రాజు దంపతుల కూతురు మంజుల మొగిలిగిద్ద జెడ్పీహెచ్‌ఎస్‌లోనే చదివింది. ఈ క్రమంలో శిరీష, మంజుల క్లాస్మేట్స్ కావడంతో స్నేహితులుగా మారారు. మంజుల తండ్రి బాల్‌రాజు సైతం కొన్నేళ్ల క్రితమే మరణించాడు. ఈమె తల్లి యాదమ్మ కూడా కూలి పనులు చేస్తూ శిరీషను సాకుతోంది. వీరిది కూడా పేద కుటుంబం. శిరీష, మంజుల ఇద్దరూ గత మార్చిలో పదోతరగతి పరీక్షలు రాశారు. ఏప్రిల్ ఒకటి నాటికి మరో మూడు పరీక్షలు రాయాల్సి ఉంది. ఈ క్రమంలో మంజుల ప్రేమిస్తున్న యువకుడు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆ బాలిక తీవ్ర మనోవేదనకు గురైంది. ప్రియుడి కోసం చనిపోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని శిరీషకు వివరించింది. శిరీషకు సైతం కుటుంబీకులు ఇష్టంలేని పెళ్లిని కుదిర్చారు. దీంతో ఆ బాలిక కూడా మనస్తాపంతో ఉంది. ఇద్దరు కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ ఒకటి నుంచి ఇళ్లల్లో చెప్పకుండా వెళ్లిపోయారు. మిగతా పరీక్షలకు కూడా హాజరు కాలేదు. ఏప్రిల్ 3న మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం కొండపోచమ్మ ఆలయం వద్దకు వచ్చారు. అక్కడి నుంచి శిరీష తన తల్లి నర్సమ్మకు ఫోన్ చేసింది. ఎక్కడున్నావని తల్లి ప్రశ్నిస్తే... అప్పరెడ్డిగూడెం వద్ద ఉన్నామని చెప్పింది. మంజుల కూడా తనతో ఉందని తెలిపింది. ‘మీకోసమే రోజూ వెతుకుతూ ఇప్పుడే షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చాం’ అని నర్సమ్మ తెలిపింది. దీంతో శిరీష ఫోన్ కట్‌చేసింది. అప్పటి నుంచి బాలికలకు, వారి కుటుంబీకులకు ఎలాంటి సమాచారం లేదు. ఈ క్రమంలో సోమవారం కొండపోచమ్మ ఆలయ ప్రాంగణంలోని గుట్టల్లో గుర్తు తెలియని శవాలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ కథనం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితం కావడంతో.. మృతుల కుటుంబీకులు ఆ శవాలు తమ పిల్లలవేనంటూ మంగళవారం గజ్వేల్‌కు చేరుకున్నారు. ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనం చూసి తామిక్కడికి చేరుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికల శవాలను గుర్తుపట్టారు. మృతదేహాలు చూసి బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. గజ్వేల్ సీఐ సతీష్, జగదేవ్‌పూర్ ఎస్ఐ వీరన్నలు వారి నుంచి వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్న సమాచారంతో మృతదేహాలు వారివేనని దాదాపుగా నిర్ధారించారు. దీంతో కేసు మిస్టరీ వీడింది. -
ప్రేమ విఫలం.. ప్రియుడు ఆత్మహత్య
రెండు రోజుల కిందటే యువతి బలవన్మరణం నంగునూరు: ప్రేమించిన యువతి రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపంతో ప్రియుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మంగళవారం పాలమాకులలో జరిగింది. ఎస్ఐ గోపాల్‌రావు, బంధువుల కథనం మేరకు.. చిన్నకోడూర్ మండలం సికింద్లాపూర్ గ్రామానికి చెందిన పరమాండ్ల బాలకిషన్(22), అదే గ్రామానికి చెందిన గీత.. సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. కొన్నేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే, విషయం తెలుసుకున్న గీత తల్లిదండ్రులు ఆమెను కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని బంధువుల ఇంట్లో ఉంచారు. దీంతో తీవ్ర వేదనకు గురైన ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది. ఆమె మృతికి బాలకిషన్ కారణమని ఆరోపిస్తూ మెట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో మృతురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. గీత మృతిచెందడంతో పాటు తనపై కేసు నమోదైన నేపథ్యంలో బాలకిషన్ పాలమాకులలో ఉంటున్న తన అక్క బాల్‌లక్ష్మి ఇంటికి వచ్చాడు. మంగళవారం తెల్లవారుజామున ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతుడి అన్న రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పోలీసులు బెదిరించారని...వ్యక్తి ఆత్మహత్య
బొబ్బిలి: చోరీ సొత్తు రికవరీలో పోలీసులు బెదిరించారని మనస్తాపం చెంది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గున్నతోటవలస గ్రామానికి చెందిన సువ్వాడ రామకృష్ణ (42) అనే వ్యక్తి శనివారం రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గత ఏడాది బొబ్బిలిలో జరిగిన రెండు దొంగతనాల్లో నిందితుడుగా బొబ్బిలి పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన పిరిడి రాజేష్ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 8 తులాల బంగారం, 5 గ్యాస్ సిలిండర్లను దొంగతనం చేసి సువ్వాడ రామకృష్ణకు విక్రయించినట్లు రాజేష్ పోలీసులకు చెప్పడంతో శుక్రవారం సాయంత్రం రామకృష్ణను స్టేషనుకు తీసుకువచ్చారు. ఐడీ పోలీసులు విచారణ చేసిన తరువాత రాత్రి పది గంటల సమయంలో విడిచిపెట్టారు. తాను ఏ నేరం చేయలేదని చెబుతున్నా బలవంత పెట్టడంతో పాటు బెదిరించారని ఇంటికి వచ్చిన తరువాత రామకృష్ణ గ్రామస్తులు, కుటుంబీకుల వద్ద మొరపెట్టుకున్నాడు. రామకృష్ణ బొబ్బిలి గ్రోత్‌సెంటరులోని వర్క్‌షాపులో నైట్‌వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి నేరానికి సంబంధించిన వస్తువులు తనకు అమ్మారని చెప్పిన వారింటికి వెళ్తానని చెప్పి బయటకు వచ్చేశాడు. భార్య గోపమ్మ వద్దని వారిస్తున్నా వినకుండా ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయాడు. తెల్లవారుజామున అయిదు గంటల ప్రాంతంలో రామకృష్ణ రైలు పట్టాలపై శవమై ఉన్నాడని సమాచారం రావడంతో కుటుబ సభ్యులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. తానేమీ తప్పు చేయలేదని, అయ్యప్ప సాక్షిగా చెబుతున్నానని, బొబ్బిలి ఐడీ పోలీసులు భయ పెట్టారని లేఖ రాసి రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య గోపమ్మ బంధువులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భర్త ఆత్మహత్యకు కారణమైన ఐడీ పోలీసులు వెంకటరావు, శ్యాంలపై చర్యలు తీసుకొని కుటుంబాన్ని ఆదుకోవాలని డీఎస్పీ బీవి రమణమూర్తికి వినతిపత్రాన్ని అందజేసింది. దీనిపై డీఎస్పీ బీవీ రమణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ప్రియుడు రాలేదని..
అక్క ఎదుటే ఆత్మహత్యకు పాల్పడ్డ యువతి పెనుమూరు : వస్తానన్న ప్రియుడు రాలేదనే మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పెనుమూరు మండలంలోని పులిగుండు వద్ద సోమవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వెదురుకుప్పం మండలం నచ్చుకూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ బి.మునిక్రిష్ణయ్యకు ముగ్గురు కుమార్తెలు. వీరు ప్రస్తుతం ఇదే మండలం జక్కదొనలో 10 ఏళ్లుగా ఉంటున్నారు. ఈయన చివరి కుమార్తె సుభాషిణి (18) పెనుమూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలకు చెందిన ఓ అబ్బాయితో ప్రేమలో పడింది. ప్రస్తుతం ఆమె రెండు నెలల గర్భిణి. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరింది. అతను ఒప్పుకోలేదు. ఈ క్రమంలో సోమవారం ఆమె తన అక్క రమ్యను తీసుకుని ప్రియుడిని కలిసేందుకు బయలుదేరింది. పెనుమూరు మండలంలో ఉన్న పర్యాటక కేంద్రమైన పులిగుండు వద్దకు వచ్చారు. తన అక్కతో మాట్లా డేందుకు రావాలని ప్రియుడికి ఫోన్ చేసింది. గంట తర్వాత వస్తానని చెప్పిన ఆ యువకుడు ఎంతకూ రాలే దు. మనస్తాపం చెందిన సుభాషిణి పులిగుండుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. రమ్య ఇంటికి వెళ్లి విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు పులిగుండు వద్దకు చేరుకున్నారు. మృతదేహం పులిగుండు మధ్య భాగంలో రెండు బండల మధ్య ఇరుక్కోవడంతో సాయంత్రం 2 గంటల వరకు గుర్తించలేక పోయారు. చివరకు పెనుమూరు ఎస్ఐ శ్రీనివాసరావు, పాకాల సీఐ చల్లనిదొర అక్కడికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. రాత్రి 7.30 గంటల వరకు మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఎంతకూ వీలుకాకపోవడంతో మంగళవారం ఉదయం వెలికి తీయనున్నట్టు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. -
సీఎం ఆఫీసు ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
విధుల నుంచి తొలగించారని విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగి మనస్తాపం సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని సీఎం కార్యాలయం (సమతాబ్లాక్) ఎదుట శుక్రవారం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విధుల నుంచి తొలగించారనే మనస్తాపంతో చండూరి చంద్రశేఖర్ అనే విద్యుత్ కాంట్రాక్టు కార్మికుడు తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని సమీపంలోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్ వెంట వచ్చిన అతని మిత్రుడు సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలోని సబ్‌స్టేషన్‌లో చంద్రశేఖర్, సతీష్‌లు 2012 నుంచి 2014 డిసెంబర్ వరకు ఔట్సోర్సింగ్ కింద షిప్ట్ ఆపరేటర్లుగా పనిచేశారు. తర్వాత ఔట్సోర్సింగ్ కాంట్రాక్టర్ స్థానంలో కొత్త కాంట్రాక్టర్ ను నియమించగా అతను వీళ్ల స్థానంలోకి వేరే వారిని నియమించాడు. ఈ విషయమై స్థానిక డీఈని కలవగా తనకు సంబంధం లేదని, కాంట్రాక్టర్‌ను కలవాలని సూచించాడు. ఇదే విషయాన్ని సీఎంకు చెప్పుకోవడానికి సచివాలయానికి వచ్చామని, చంద్రశేఖర్ పురుగుల మందు తెచ్చుకున్న సంగతి తనకు తెలియదని సతీష్ చెప్పాడు. కాగా, ఇది పెద్ద డ్రామా అని, చంద్రశేఖర్ ముందుగానే బాటిల్లో మందుకు బదులు నీళ్లు కలుపుకొని వచ్చాడని, అది తాగకుండా మీద పోసుకున్నాడని పోలీసులు చెప్పారు. -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
ఆదిలాబాద్: భార్య పోలీసు స్టేషన్లో తన మీద ఫిర్యాదు చేసిందని మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అదిలాబాద్ మండలం మావాల గ్రామపంచాయతి పరిధిలోని న్యూహౌసింగ్ బోర్డు కాలనీలో జరిగింది. కాలనీకి చెందిన పత్రి రమేష్(35) శనివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదనపు కట్నం కోరుతున్నాడని భార్య తనపై కేసు నమోదు చేయడంతో మన స్తాపానికి గురైన రమేష్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. -
ఒత్తిడి భరించలేకే చేయి నరుక్కున్నా
‘తెలిసీ తెలియని వయస్సులో చెడు సావాసాలు పట్టి చోరీలకు అలవాటుపడ్డా. అది గతం. ఇప్పుడు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. దొంగతనాలు మానేద్దామనుకుంటే పోలీసులు ఒప్పుకోవడం లేదు. నక్సలైట్లు మారిపోతే ఇల్లు, పొలం ఇస్తున్నారు. నేను చోరీలు మానేస్తానంటే ఎందుకు ఒప్పుకోవడం లేదు. పోలీసుల బలవంతంతో చోరీలు కొనసాగించడం ఇష్టం లేక చేయి నరుక్కున్నా.’ పాత నేరస్తుడు భూక్యా నాగరాజు కథనమిది.. విజయవాడ క్రైం : ఎ.కొండూరు మైత్రీనగర్‌కు చెందిన భూక్యా నాగరాజు పాత నేరస్తుడు. ఇతడిపై వేర్వేరు పోలీస్స్టేషన్లలో 135 దొంగతనాల కేసులు ఉన్నాయి. పలు కేసుల్లో శిక్ష అనుభవించాడు. ఇంకా కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కొద్ది రోజుల కిందట రాజమండ్రి పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అక్కడ ఉండగానే హైదరాబాద్ పోలీసులు పీటీ వారెంట్‌పై అరెస్టు చేశారు. గత మంగళవారం బెయిల్ విడుదలయ్యాడు. రికవరీ కోసం హైదరాబాద్ పోలీసులు ఒత్తిడి చేస్తుండటంతో భరించలేక కుటుంబ సభ్యుల తో కలిసి పురుగుల మందు తాగి చనిపోవాల నుకున్నాడు. ఈ ప్రయత్నాన్ని ఇరుగు పొరుగు వారు అడ్డుకున్నారు. నాగరాజు గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొంతసేపటికి ఎవరో పోలీసులు వచ్చారంటూ కు టుంబ సభ్యులు ఫోన్‌చేసి చెప్పారు. దీంతో మనస్తాపం చెందాడు. ఊరికి దూరంగా ఉన్న పొలాల్లోకి వెళ్లి కుడి చేయి మణికట్టుపై కత్తితో నరుక్కున్నాడు. మైలవరం సమీపంలోని నాగులూరులో ఉంటున్న సోదరుడు చిట్టిబాబుకు ఫోన్లో విషయం చెప్పాడు. చిట్టిబాబు వచ్చి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యుల సూచన మేరకు విజయవాడలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించాడు. ఇక్కడి వైద్యులు శస్త్ర చికిత్స చేసి నాగరాజు కుడిచేయి ని మణికట్టు వరకు తొలగించారు. ప్రస్తుతం ఇ తడి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెపుతున్నారు. ఈ సందర్భంగా నాగరాజు ‘సాక్షి’తో పలు విషయాలు చెప్పాడు. రికవరీ కోసం ఒత్తిడి ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తే పోలీసులు రికవరీ కోసం తనను వేధింపులకు గురి చేస్తారని నాగరాజు తెలిపారు. నేరం చేయకపోయి నా రికవరీ ఇవ్వాల్సిందేంటున్నారని, లేదంటే నేరాలు చేయమని ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొన్నాడు. లేదంటే చేయని నేరాలపై జైలుకు పం పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. షాపుల యజమానుల ఉసురు తగులుతుందేమో.. అమ్మని నగలు కూడా అమ్మినట్టు చెప్పాలం టూ పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని నాగరాజు తెలిపాడు. ఏయే షాపుల్లో ఏ నగలు విక్రయిం చిందీ చెప్పాలనేది ముందుగానే తనకు చెప్పి దుకాణాలు చూపిస్తారన్నాడు. ఆ తర్వాత షాపుల వద్దకు తీసుకెళ్లి డ్రామా నడుపుతారని, అనేకమంది బంగారు షాపుల యజమానులు చేయని నేరానికి రికవరీ ఇవ్వాల్సి వచ్చేదన్నా డు. ఇలా చేయడం వల్ల తనకూ, తన కుటుం బానికి ఉసురు తగులుతుందనే బెంగ పట్టుకుందని చెప్పాడు. ఎన్కౌంటర్ పేరిట బెదిరింపు దొంగతనాలు మానేసినా.. రికవరీ ఇవ్వకున్నా గజదొంగ అడపా వెంకన్న మాదిరిగానే ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నట్టు నాగరాజు పేర్కొన్నాడు. తనతో దొంగతనాలు చేయించి పోలీసు అధికారులు బాగుపడుతున్నట్టు తెలిపాడు. చేతులు లేకపోతే దొంగతనాలు చేయాలని అడగలేరని, అందుకే చేయి నరుక్కున్నానని చెప్పాడు. నోరు విప్పితే పలువురు కటకటాల వెనక్కే తాను నోరు విప్పితే పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు, సిబ్బంది జైలుపాలవుతారని నాగరాజు తెలిపాడు. అన్ని జిల్లాల పోలీసులు తనను నేరాలు చేయమని ప్రోత్సహించి సొమ్ములు వెనుకేసుకున్న వారేనని పేర్కొన్నాడు. తన గతి వాళ్లకు పట్టడం ఇష్టం లేకే నోరు మెదపడం లేదని అన్నాడు. దొంగతనాలు మానేయాలనుకుంటున్నానని, తనను వదిలేయాలని నాగరాజు కోరుతున్నాడు. వేధింపులు కొనసాగితే ఈసారి తల నరుక్కుంటానని అతడు పేర్కొన్నాడు. వేధింపులు ఇలాగే కొనసాగితే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని నాగరాజు భార్య ఝాన్సీ తనను కలిసిన విలేకరులతో విలపిస్తూ చెప్పింది. -
చెరువులో దూకి.. తనువు చాలించి..
కంభం రూరల్, న్యూస్‌లైన్: క్షణికావేశం ఓ విద్యార్థి నిండు జీవితాన్ని బలి తీసుకుంది. పరీక్షలో చూసి రాస్తుండగా ఆగ్రహించిన ఉపాధ్యాయుడు సదరు విద్యార్థి నుంచి పేపరు తీసుకోవడంతో మనస్తాపం చెంది మంగళవారం కంభం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోగా బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. వెలిగొండ ప్రాజెక్టు జూనియర్ అసిస్టెంట్ పఠాన్ హుస్సేన్‌ఖాన్ స్థానిక అర్బన్ కాలనీలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన కుమారుడు పఠాన్ ముజిమిల్ ఖాన్ (15) స్థానిక ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం యూనిట్ పరీక్షలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం తన ఇద్దరు మిత్రులతో కలిసి గ్రూపుగా ఏర్పడి ముజిమిల్ ఖాన్ పరీక్ష రాస్తుండగా ఓ ఉపాధ్యాయుడు గమనించి వారి పేపర్లు తీసుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లిన ముజిమిల్ ఖాన్.. తిరిగి మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లలేదు. మధ్యాహ్నం నుంచి విద్యార్థి పాఠశాలకు రాకపోవడంతో యాజమాన్యం తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించింది. అప్రమత్తమైన తల్లిదండ్రులు, బంధువులు వివిధ ప్రాంతాల్లో గాలిస్తూ కంభం చెరువుకు వెళ్లారు. పెద్ద కంభం తూము వద్ద సైకిల్, చెప్పులు, కళ్లజోడు, వాచీ కనిపించాయి. దీంతో ముజిమిల్ ఖాన్ చెరువులోకి దూకాడన్న అనుమానంతో తండ్రి బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై హజరతయ్య, విద్యార్థి బంధువులు కలిసి యర్రబాలేనికి చెందిన గజ ఈతగాళ్లను పిలిపించి చెరువులో గాలించగా విద్యార్థి మృతదేహం బయట పడింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు భోరున విలపించారు. క్షణికావేశానికి నిండు ప్రాణం బలి విద్యార్థులు క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని తమ బంగారు భవిష్యత్తును కాలరాసుకోవడమేకాకుండా తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిలిస్తున్నారు. గతేడాది నవంబర్‌లో కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదివే ఓ విద్యార్థిని కూడా ఇలాగే ఆత్మహత్యకు పాల్పడింది. ముజిమిల్ ఖాన్‌కు అటు తల్లిదండ్రుల నుంచి ఇటు ఉపాధ్యాయుల నుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేవు. పరీక్ష చూసి రాయడంతో ఉపాధ్యాయుడు పేపర్ తీసుకున్నాడని మనస్తాపం చెందిన విద్యార్థి.. చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడటంపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల సంతాపం ముజిమిల్ ఖాన్ ఆత్మహత్య చేసుకున్నాడన్న స మాచారం మేరకు పాఠశాల కరస్పాండెంటు.. ఉపాధ్యాయులతో కలిసి చెరువుకట్టకు వెళ్లారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి విద్యార్థిమృతికి సంతాపం తెలిపారు. -
తెలుగుదేశం నేతల దీక్ష భగ్నం
సాక్షి, గుంటూరు: సమైక్యాంధ్ర ఆందోళనలో భాగంగా టీడీపీ నేతలు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను శుక్రవారం అర్ధరాత్రి పోలీసు లు భగ్నం చేశారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ గడచిన ఐదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్షచేపడుతున్న విషయం విది తమే. వారి ఆరోగ్యం క్షీణించడం వల్ల చికిత్స అనివార్యమై దీక్షవిరమించాలని వారిని కోరా రు. అంగీకరించని నేతలను బలవంతంగా పోలీసు సిబ్బంది అక్కడినుంచి తొలగించి జీజీ హెచ్‌కు తరలించాచు. సమాచారం 30 నిమిషాల ముందే తెలుసుకున్న టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, జె.ఆర్.పుష్పరాజ్, మన్నం సుబ్బారావు తదితరులు దీక్షాశిబిరానికి చేరుకుని కాసేపు నిలువరించడానికి యత్నించారు. అయినా పోలీసులు ఆస్పత్రికి బలవంతంగా తరలించారు. జీజీహెచ్‌కు తరలించిన టీడీపీ నేతలు శనివారం తమ దీక్షలను విరమించారు. పార్టీ నేతలు వారిని పరామర్శించారు. -
విజయమ్మ దీక్ష భగ్నంపై ఆగ్రహ జ్వాలలు
రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయూలని, అలా కాకుంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని డిమాండ్‌చేస్తూ వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి భగ్నం చేయడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యను నిరసిస్తూ శనివారం నిర్వహించిన జిల్లా బంద్ విజయవంతమైంది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పలుచోట్ల రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు. అన్నివర్గాల ప్రజలు ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు. జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించేందుకు పూనుకున్నాయని, ఈ రెండు పార్టీలకు పుట్టగతులుండవని, ప్రజల ఆగ్రహానికి అవి భూ స్థాపితం కావడం ఖాయమని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆమరణదీక్ష భగ్నం, అరెస్టుకు నిరసనగా శనివారం రాష్ట్ర ప్రధాన రహదారిపై బాలారాజు ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. బాలరాజు మాట్లాడుతూ వైఎస్ విజయమ్మ సమన్యాయం కోసం అందరికి మేలు జరిగేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే అర్ధ రాత్రి పోలీసులు దీక్షను భగ్నం చేసి అరె స్ట్ చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. కనీసం అంబులెన్స్‌ను ఏర్పాటు చేయకుండా పోలీస్ వాహనంలో తరలించడాన్ని విమర్శించారు. పోలీసులు నిరంకుశంగా వ్యవహరించారని, ఇలాంటి ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిందన్నారు. రాష్ట్రం తగులబడుతుంటే ఢిల్లీలో సోనియాగాంధీ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఖబడ్దార్ సోనియా అంటూ హెచ్చరించారు. చంద్రబాబు బస్సుయాత్రను ప్రజలు అడ్డుకునేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా కన్వీనర్ పాశం రామకృష్ణ, కనమతరెడ్డి శ్రీనివాసరెడ్డి, రావూరి కృష్ణ, మండల కన్వీనర్ నులకాని వీరాస్వామి నాయుడు, రాఘవరాజు ఆదివిష్ణు, మార్ని ప్రసాద్, కాసర సురేష్‌రెడ్డి, గూడపాటి రాధాకృష్ణ, నౌడు అశోక్ , కొయ్యే లీలాధర్‌రెడ్డి, కాసర సోమిరెడ్డి, పి.సుదర్శన్, పితాని రాజేశ్వరి పాల్గొన్నారు. సోనియా దిష్టిబొమ్మ దహనం పాలకొల్లు టౌన్ : విజయమ్మ దీక్షను భగ్నం చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని వైఎస్సార్ సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు. దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ స్థానిక గాందీబొమ్మల సెంటర్లో రోడ్డుపై బైఠారుుంచారు. సోనియా దిష్టిబొమ్మను దహనం చేసి మాట్లాడారు. సీమాంద్రప్రాంతంలో చిన్న పిల్లవాడి దగ్గర నుంచి మేధావుల వరకు సమైక్యాంధ్రను కోరుతూ ఎన్ని ఆందోళనలు చేపట్టినా సోనియాగాంధీ మొండి వైఖరి అవలంభించడం సరికాదన్నారు. తక్షణమే స్పందించి సమైక్య ప్రకటన చేయూలని డిమాండ్‌చేశారు. పార్టీ నాయకులు గుణ్ణం నాగబాబు, ముచ్చర్ల శ్రీరామ్, ఆకెన వీరాస్వామి(అబ్బు), సంగినీడి సూరిబాబు, చీకట్ల వరహాలు, యడ్ల తాతాజీ, మద్దా చంద్రకళ, నడిం పల్లి అన్న పూర్ణ పాల్గొన్నారు. అప్రజాస్వామికం చింతలపూడి, న్యూస్‌లైన్ : మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ నాయకత్వంలో చింతలపూడి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి బోసుబొమ్మ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రాజేష్ మాట్లాడుతూ విజయమ్మ దీక్ష భగ్నం అప్రజాస్వామికమన్నారు. తలా కాస్తా పంచుకోవడానికి రాష్ట్రం కేకు ముక్క కాదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సమైక్య ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ మారిశెట్టి జగదీశ్వరరావు, మండల కన్వీనర్ టి. వెంకట్రామిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు పి. వినోద్‌రెడ్డి, జె. జానకీరెడ్డి, చేపూరి ఖాదర్‌బాబు, టీడబ్ల్యూ జయరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, గోలి చంద్రశేఖర్‌రెడ్డి, జి. రమణయ్య, ఎండీ సాదిక్, నిమ్మగడ్డ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. దీక్ష భగ్నం దారుణం తణుకు, న్యూస్‌లైన్ : వైఎస్ విజయమ్మ దీక్షను పోలీసులు భగ్నం చేయటం దారుణమని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. దీనికి నిరసనగా శనివారం తణుకులో బంద్ చేపట్టారు. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహిం చారు. జై సమైక్యాంధ్రా అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ స్వార్ధప్రయోజనాల కోసం రాష్ట్ర విభజనకు పూనుకొందని, ఈ విషయాన్ని గుర్తించి సీమాంధ్ర ప్రజలందరూ సమైక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ నాయకులు విడివాడ రామచంద్రరావు, కరుటూరి పాండురంగారావు, కారుమంచి మిత్రా, బొబ్బిలి సుధీంద్రబాబు, నాసరి రాజారామ్, గంధం బాబ్జి, కంచుమర్తి విశ్వేశ్వరరావు, గోడి నాగబాబు, నత్తా చంద్రశేఖర్, కొప్పోజు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వేణుగోపాల్ దీక్ష భగ్నం
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : జంగారెడ్డిగూడెంలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తిరివీధి వేణుగోపాల్ దీక్షను శనివారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. ఎస్సై బీఎన్ నాయక్ ఆధ్వర్యంలో రెండు వాహనాల్లో పోలీసులు అంబులెన్స్‌తో దీక్షా శిబిరం వద్దకు వచ్చి వేణుగోపాల్‌ను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. జేఏసీ ప్రతినిధులు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. చివరకు వేణుగోపాల్‌ను పోలీసులు బలవంతంగా అంబులెన్స్‌లో ఎక్కించి స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రి వద్ద కూడా సమైక్యవాదులు జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. ఆసుపత్రిలో వేణుగోపాల్‌కు డాక్టర్ సునీత వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ పల్స్రేట్ తగ్గిందని, షుగర్ లెవల్స్ కూడా పడిపోయాయని, అందువల్ల వైద్యం తప్పదని తెలిపారు. వేణుగోపాల్ మాట్లాడుతూ ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు. వేణుగోపాల్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశామని ఎస్సై నాయక్ తెలిపారు. అంతకుముందు వేణుగోపాల్ దీక్షకు మద్దతుగా రిలే దీక్షల్లో నోముల లీలావతి, జలగం మౌనిక, పట్నాల సాయి, పమిడిపల్లి బ్రహ్మాజీలు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్యులు డాక్టర్ కొడాలి సత్యనారాయణ వేణుగోపాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీక్షా శిబిరాన్ని పలు రాజకీయ పార్టీల నాయకులు, సంస్థలు, సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని సంఘీభావం తెలిపారు.