ప్రియుడు రాలేదని..
అక్క ఎదుటే ఆత్మహత్యకు పాల్పడ్డ యువతి
పెనుమూరు : వస్తానన్న ప్రియుడు రాలేదనే మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పెనుమూరు మండలంలోని పులిగుండు వద్ద సోమవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వెదురుకుప్పం మండలం నచ్చుకూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ బి.మునిక్రిష్ణయ్యకు ముగ్గురు కుమార్తెలు. వీరు ప్రస్తుతం ఇదే మండలం జక్కదొనలో 10 ఏళ్లుగా ఉంటున్నారు. ఈయన చివరి కుమార్తె సుభాషిణి (18) పెనుమూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలకు చెందిన ఓ అబ్బాయితో ప్రేమలో పడింది. ప్రస్తుతం ఆమె రెండు నెలల గర్భిణి. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరింది. అతను ఒప్పుకోలేదు. ఈ క్రమంలో సోమవారం ఆమె తన అక్క రమ్యను తీసుకుని ప్రియుడిని కలిసేందుకు బయలుదేరింది. పెనుమూరు మండలంలో ఉన్న పర్యాటక కేంద్రమైన పులిగుండు వద్దకు వచ్చారు.
తన అక్కతో మాట్లా డేందుకు రావాలని ప్రియుడికి ఫోన్ చేసింది. గంట తర్వాత వస్తానని చెప్పిన ఆ యువకుడు ఎంతకూ రాలే దు. మనస్తాపం చెందిన సుభాషిణి పులిగుండుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. రమ్య ఇంటికి వెళ్లి విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు పులిగుండు వద్దకు చేరుకున్నారు. మృతదేహం పులిగుండు మధ్య భాగంలో రెండు బండల మధ్య ఇరుక్కోవడంతో సాయంత్రం 2 గంటల వరకు గుర్తించలేక పోయారు. చివరకు పెనుమూరు ఎస్‌ఐ శ్రీనివాసరావు, పాకాల సీఐ చల్లనిదొర అక్కడికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. రాత్రి 7.30 గంటల వరకు మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఎంతకూ వీలుకాకపోవడంతో మంగళవారం ఉదయం వెలికి తీయనున్నట్టు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు.