మూగపిల్ల
అనగనగా ఒక బాలిక. పేరు సుభాషిణి. నామకరణం నాడే బిడ్డ మూగపిల్ల అవుతుందని ఏ తల్లిదండ్రులు ఊహించగలరు పాపం? ఆ బాలికకు ఇద్దరు అక్కలు ఉన్నారు. సుకేశిని, సుహాసిని అని వాళ్ల పేర్లు ముందే పెట్టారు. ఆ పేర్లలోని అనుప్రాసను తప్పనివ్వకుండా తల్లిదండ్రులు కడసారి బిడ్డకు సుభాషిణి అని పేరు పెట్టకున్నారు. క్లుప్తంగా ‘సుభా’ అని పిలవసాగారు.వరులను వెదకడంలోను, కట్నాలు కానుకలు ఇవ్వడంలోను– సర్వసాధారణంగా పెళ్లిళ్లలో పడే పాట్లన్నీ పడి ఎలాగో పెద్దపిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేసేశారు. ఇక కడగొట్టు బిడ్డే మిగిలి ఉంది. తల్లిదండ్రుల గుండెల మీద కనబడని బరువులా ఆ బాలిక ఈడేరి ఇంట్లో కూర్చుని ఉంది. ఆమెకు నోరు లోపించింది కనుక భావానుభూతి కూడా తప్పక లోపిస్తుందనే లోకం తలచినట్లుగా ఉంది. ఆ ధీమాతోనే ఆమె సమక్షంలోనే ఆమె భవిష్యత్తు గురించి చర్చించి ఆందోళన చెందేవాళ్లు. దాంతొ తన స్థితిని చిన్నతనంలోను సుభా అర్థం చేసుకుంది. అందువల్ల నలుగురిలోకీ రావడం మానుకుంది. ఆటల పాటల స్నేహాల ప్రసక్తే మానుకుంది. ఏకాంతంగా వేరుగా ఉండిపోయేది. తననెవరూ తలవకుండా మరచిపోతే చాలు, లోకం తనకు మహోపకారం చేసినట్టు అనుకునేది. కాని బాధను మరవడం ఎవరికి శక్యం? రాత్రింబగళ్లు ఈ బిడ్డను గురించిన ఆందోళనే తల్లిదండ్రుల మనసులను వేధించింది.
తల్లి కళ్లల్లో ఆమె ఒక విరూపిగా ఉంది. కూతురిలోని వెలితి తల్లికి గౌరవహాని అనిపిస్తుంది. అందుకే సుభా అంటే తల్లికి తన శరీరం మీద ఏదో మచ్చలా ఏవగింపు. తండ్రి వాణీకాంతకు తన సంతానంలోకల్లా సుభా అంటేనే అనురాగం ఎక్కువ. సుభాకు మాట లోపించింది గాని, ధనురాకారంలో తీర్చిదిద్దిన పొడవాటి కనుబొమ్మలు అంచులుగా గల చారెడేసి కళ్లకు కొదవలేదు. ఆమె మనసులో మెదిలిన భావాలకు అనుగుణంగా ఆమె పెదవులు చిగురుటాకులా కంపించేవి. భావాలను వ్యక్తం చేసేటప్పుడు అనుగుణమైన భాష అంత సులువుగా పట్టుబడదు. అదొక అనువాద క్రమం. ఆ అనువాదం తరచు సంతృప్తికరంగా ఉండదు. భాషతో నిమిత్తం లేని ఆ నీలాల కళ్లకు అనువాదపు బెడదలుండవు. కళ్లల్లో మనస్సు నీడ సూటిగా ప్రతిఫలిస్తూ ఉంటుంది. భావం మనసులో విప్పారినా, ముడిగినా, మెరిసినా, ఇరులలో మాయమైనా– అస్తమించే పాలిపోయిన చంద్రవంకలా నిస్సత్తువగా కాసేపు నిలిచిపోయినా, ఆకాశం మూలమూలలనూ కనురెప్పపాటులో కాంతివంతం చేసే విద్యుల్లతలా కదిలినా– ఆ నీలాల కన్నుల్లో ఛాయలుగా తోచక విధి లేదు. పెదవులు కదపడం కన్నా వేరే భాష లేని పుట్టుమూగకు నేత్రభాష అలవడుతుంది. ప్రకృతిమాతలో కానవచ్చే ఏకాంత వైభవం మూగవారికి వశమవుతుంది. అందువల్లే పొరుగు పిల్లలు సుభా అంటే భయపడేవారు. ఎడంగా ఉండేవారు. ఆట పాటలకు కూడా కలిసేవారు కాదు. నిర్జనమైన మధ్యాహ్న సమయంలా ఆమె నిశ్శబ్దంగా, ఏకాకిగా చరించేది. ఆమె స్వగ్రామం చండీపూర్. అదొక చిన్న నది ఒడ్డున ఉంది. అసలు బెంగాల్‌లోని నదులన్నీ చిన్నవే. ఇల్లు వెడలని మధ్యతరగతి మర్యాదస్తుల కుటుంబంలో పుట్టి పెరిగిన ఆడబిడ్డలా కరకట్టలను మీరకుండా బిరబిరా ప్రవహిస్తూ తన దారిన తాను పోతుంటుంది. తన తీర పరిసర గ్రామాల్లో ప్రతి ఇంటికీ పనిగత్తెలా తన విధులు తీర్చుకుంటూ విశ్రాంతి ఎరుగని ప్రయాణం చేస్తుంది. ఏటికి ఇరుగట్లా ఇళ్లూ వాకిళ్లూ ఉన్నాయి.హాయిగా నీడనిచ్చే చెట్లు ఉన్నాయి. కొండ కోనలను దిగివచ్చి మైదానంలో పడినది మొదలు ఆ నదీ దేవత ఇంటింటికీ ఉద్యానవన దేవత అయింది. తన్ను తానే మరచిన పారవశ్యంలో పరుగెత్తిపోతూ దయామయంగా ఎంతో పరిచర్య చేస్తోంది.
వాణీకాంత ఇంటిని ఏటిలోంచి చూడవచ్చు. ఆ ఊరిలోని ప్రతి గుడిసె, ప్రతి చావడి ఏటిలో ఓడ నడిపే నావికుల కనుచూపు నుంచి దాక్కోలేవు. సుభా రోజూ పని పూర్తి చేసుకోవడంతోనే బయలుదేరి చడీచప్పుడూ లేకుండా ఏటి తిన్నెకు వెళ్లి కూర్చునేది. ప్రాపంచికమైన జంఝాటంలో పడి ఏ నావికుడైనా ఏటి గట్టున ఈ బాలికను గమనిస్తున్నాడో లేదో చెప్పలేము.కాని ప్రకృతిమాత ఆ బాలికలోని మాట లోపాన్ని భర్తీ చేయడానికి ఆమెకు బదులుగా తానే మాట్లాడేది. సెలయేటి గుసగుసలు, జానపదుల సంభాషణలు, ఓడ సరంగు తీయని పల్లెపదాలు, పక్షుల కిలకిలలు, చెట్ల వీవనలు– అన్నీ కలసి ఆమె హృదయస్పందనతో ఏకీభూతమయ్యాయి. అవన్నీ ఒక అపూర్వ నాద తరంగమై అలసిన ఆమె గుండెలపై నినదిస్తున్నాయి. ప్రకృతిమాతకు చెందిన ఈ మార్మిక చలనమే ఆ మూగ బాలిక భాష. విల్లులాంటి కనుబొమ్మలంచు గట్టిన ఆ నీలనయనాల భాషే ఆమెను అక్కడ ఆవరించిన ప్రపంచంలోని భాష. మిట్టమధ్యాహ్న ఘడియల్లో నావికులు, బెస్తలు భోజనాలకు వెళ్లిపోతారు. గ్రామీణులు మాగన్నుగా పడుకుంటారు. పక్షులు నిశ్శబ్దమవుతాయి. రహదారి పడవలు విశ్రమిస్తాయి. బహు వ్యాపకాలతో వేగే ప్రపంచం ఒక్క క్షణం పని నిలిపి, హఠాత్తుగా ఏకాంతపు కొలువుదీర్చి బ్రహ్మరాక్షసిగా మారిపోతుంది. అప్పుడు విస్ఫార విశాలాకాశం కింద నిశ్శబ్దంగా ఇద్దరు కూర్చుంటారు: ఒకరు ప్రకృతి, మరొకరు మూగ బాలిక. ఒకరు చండభానుని కిందా– మరొకరు చిన్న చెట్టు పరచిన నీడపట్టున ఉంటారు.
అలాగని సుభాకు స్నేహితులసలే లేరనుకోవద్దు. వాళ్ల దొడ్డో సర్భాషి, పంగుళి అనే రెండు గంగిగోవులు ఉన్నాయి. వాటి పేర్లు పెట్టి నోరారా ఆమె వాటిని ఏనాడూ పిలిచి ఎరుగదు. వస్తోందనగా ఆమె అడుగుల చప్పుడును బట్టి అవి ఆమె రాకను తెలుసుకునేవి. ఆమె మాటలు ఉచ్చరించలేకపోయినా మూగగా ముచ్చటగా గొణిగేది. స్ఫుటమైన ఉచ్చారణ కన్నా మృదువైన ఆ గొణుగుడే వాటికి సులభంగా బోధపడేది.ఆమె వాటిని గోముగా బుజ్జగించినా, కోపంతో కసరినా, బతిమాలినా మనుషుల కన్నా అవే చక్కగా అర్థం చేసుకునేవి. సుభా పశువులశాలకు వస్తుంది. వచ్చీ రావడంతోనే సర్భాషి మెడకు తన చేతులు చుట్టేస్తుంది. తన చెక్కిలిని గోవు చెక్కిలికి ఆనించి మెల్లగా పాముతుంది. ఇంతలో పంగుళి నాలుకసాచి ఆమె ముఖాన్ని నాకుతుంది. సుభా రోజుకు కనీసం మూడుసార్లు పశువుల కొట్టంలోకి వచ్చి వెళుతుంది. అది ఆమె నియమం. ఇంకా ఎక్కువసార్లు వచ్చి వెళ్లడం కూడా కద్దు. పరుషోక్తులు పడవలసి వచ్చి, మనసు గాయపడినప్పుడల్లా ఈ మూగ నేస్తాల దగ్గరకు వచ్చేస్తుంటుంది. అలా రావడానికి ఏవేళా అడ్డురాదు. ఆమె నిరాశాపూరితమైన చూపుల మూలంగా గోవులు ఆమె ఆత్మక్షోభను కనిపెట్టినట్లే అగుపిస్తాయి. గోవుమాణిక్యాలే ఆమెకు చేరువగా వచ్చి కొమ్ములతో ఆమె చేతులను రాసుకుంటాయి. మూగగా, ఉద్విగ్నంగా ఆమెను ఓదార్చబూనుకుంటాయి. గోవు నేస్తాలే కాకుండా, మేకపిల్ల, ఒక పిల్లికూన కూడా ఆమె స్నేహబృందంలో ఉన్నాయి. అయితే, అవి ఈమె పట్ల గట్టి బంధం ఏర్పరచుకున్నా, వాటి పట్ల ఆమెకంత ఆత్మీయత లేదు. అందులో ఆ పిల్లికూన రాత్రిగాని, పగలుగాని సమయం దొరికనప్పుడల్లా ఆమె ఒడిలోకి అట్టే దూరి నిద్రపోతుంది. సుభా దాని మెడా వీపూ వేళ్లతో నిమురుతూ నిద్రపుచ్చుతుంటుంది. అందుకు దాని తృప్తి వెల్లడిస్తుంటుంది.
ఈ చతుష్పాద జంతువుల్లోనే కాకుండా, ద్విపాద జంతువుల్లో కూడా సుభాకొక నేస్తుడున్నాడు. అతనితో బంధం ఎలాంటిదో చెప్పడం కష్టం. అతనికి మాట ఉంది. అందువల్ల వారిద్దరికీ అర్థమయ్యే భాష లేకపోయింది. వాడు గోసాయనుల కడసారి కుర్రవాడు. పేరు ప్రతాప్. సోమరి. తల్లిదండ్రులు ప్రయత్నించి ప్రయత్నించి వాడు ఏనాటికైనా జీవనోపాధి చూసుకోగలడనే ఆశను వదులుకున్నారు. వాడొక తిరుగుబోతు. అత్మీయులైన వారు వాణ్ణి ఏవగించుకున్నప్పటికీ మిగిలిన ఊరివారందరితోనూ చనువుగా, మంచిగా ఉంటాడు. పనిపాటలు లేని ఇలాంటి వాళ్లు ఊరుమ్మడి సొత్తుగా పరిగణింపుకెక్కుతారు.షికారు వెళ్లి సేదదీరడానికి పట్నంలో బహిరంగ స్థలం అవసరమైనట్లే గ్రామానికి ఇద్దరు ముగ్గురు సదా తీరుబడి జీవాలు కావాల్సి ఉంటారు. వారి పుణ్యమా అంటూ అందరికీ కాలం వెళ్లమారుతుంది. ఏమీ తోచకపోతే, ఊసులాడుతూ పొద్దుగడిపే స్నేహితుడు కావాలంటే ఇటువంటి వాళ్లు సిద్ధంగా ఎల్లప్పుడూ బాతాఖానీ రాయుళ్ల చేతికి దొరుకుతారు. ప్రతాప్ పెట్టుకున్న వ్యాపకం చేపలను పట్టడం. కాలమంతా ఎక్కువగా ఈ వ్యాపకంతోనే గడిపేస్తాడు. ప్రతి మధ్యాహ్నం అతను ఆ పనిలోనే కనిపిస్తాడు. ఆ వ్యాపకం వల్లనే అతడు ప్రతినిత్యం సుభాను కలుసుకోగలుగుతాడు. అతడేమి తలపెట్టినా అందుకొక సలహాదారు, నేస్తం కావాలి. చేపలకు గాలమేసేటప్పుడు నిశ్శబ్దంగా కూర్చోగల నేస్తమైతే అన్నిటికంటే మంచిది.
ఇంకేం, సుభాలో ఆ నిశ్శబ్ద స్వభావం ఉంది. ప్రతాప్ అందుకే ఆమె ఆ వేళ అక్కడ ఉండాలని కోరుకుంటాడు. ఆమెను అందరూ సుభా అని పిలిస్తే ప్రతాప్ ఆప్యాయత కొద్దీ ‘సూ’ అని పిలిచేవాడు. చింతమాను నీడలో సుభా కూర్చుంటే, ఇంకాస్త దూరంలో ప్రతాప్ కూర్చుని గాలం వేసేవాడు. ప్రతాప్ ఇన్ని ఆకులు తెచ్చేవాడు. వాటితో ‘సూ’ తాంబూలం సిద్ధపరచేది. కూర్చుని చాలాసేపు పరికిస్తూ ప్రతాప్‌కి ఏదో సాయపడాలని ఆందోళనపడుతూ ఉండేదని నా నమ్మకం. అలా సాయపడటం ద్వారా ఆమె భూమికి బరువు చేటు కాదని, నిరర్థకం కాదని నిరూపించుకోవాలనుకునేది. కాని తాను చెయ్యడానికేమీ లేదు.అప్పుడు ఆమె దేవదేవుని ప్రార్థించేది. అపురూప శక్తినేదో ప్రసాదిస్తే ఒక గొప్ప కార్యం ఘనంగా చేసి, ‘అమ్మో! మన ‘సూ’ ఇంత చేస్తుందని కలలో కూడా అనుకోలేదని ప్రతాప్ నోట ఆశ్చర్యార్థకం రాబట్టాలని ఉబలాటపడేది.
సుభా జలదేవతే అయినట్లయితే, రసాతలంలోని నాగరాజు కిరీటంలోని మాణిక్యాన్ని పెకలించి దోసిట పెట్టుకుని జలాల్లోంచి నెమ్మదిగా ఒడ్డుకు చేర్చేది. అంతటితో పాడు చేపల వేట చాలించి ప్రతాప్ నీటిలో దూకి రసాతలంలోకి మునక ఈతలో వెళ్లి ఏడంతస్తుల వెండిమేడలో బంగారుతల్పం మీద ఒక యువతీమణి దర్శనభాగ్యం పొందేవాడు. ఆ యువతీమణి వాణీకాంత కూతురు, ‘సూ’ కన్నా అతనికి మరెవ్వరవుతారు? ధగధగాయమానంగా మెరిసే ఆ మాణిక్యనగరం రాజుగారి కుమార్తె ‘సూ’ను చూసేవాడు. కాని పాపం, ఇదొక్కడే సాధ్యంకాని పనిగాని తక్కినవన్నీ సుసాధ్యాలే. పాటలీపుత్ర రాజప్రాసాదంలో కాకుండా, ఆమె వాణీకాంత ఇంట పుట్టినదాయె! దాంతో గోసాయనుల కుర్రవాణ్ణి చకితుణ్ణి చేసే సాధన విశేషాలు దొరకక హతాశురాలయ్యేది. పెరిగి పెద్దదయింది. క్రమక్రమంగా తనను తాను తెలుసుకోవడం ప్రారంభించింది. పౌర్ణమినాడు సముద్రగర్భగోళం నుంచి ఎగసిపడే కెరటంలా చెప్పనలవికాని నూతన చేతన స్ఫూర్తి ఆమెలో అలముకుంది. తన ప్రశ్నకు తాను అర్థం చేసుకోగల సమాధానం లభించలేదు. ఒక పున్నమిరాత్రి నడిజామున లేచి, తన గది తలుపులు మెల్లగా తెరిచి వెన్నెల్లోకి కూడా పిరికిగా తొంగిచూసింది. రాకా చంద్రికలో సుభా వలెనే ప్రకృతి ఆదమరచి నిద్రిస్తున్న భూదేవిని తిలకిస్తోంది. అప్పుడు సుభాలో బలలీయమైన పడుచుదనం స్పందించింది. మోదఖేదాలు రెండూ ఆమెలో ముప్పిరిగొన్నాయి. పూర్వం చెప్పరానంత ఏకాకిగా భావించుకునేదేగాని ఈ నిమిషంలో అదే భావం తుది శ్రుతులకు చేరి పరాకాష్ఠ చెందింది. ఆమె హృదయం బరువెక్కింది, కాని వెలిబుచ్చలేదు. నిశ్శబ్ద వ్యథార్తమైన ప్రకృతిమాత సన్నిధానంలో లోలోపల కుమిలే ఆ ఆడపడుచు తలవంచింది.
ఆమెకు వివాహం జరిపించడం ఎలాగన్నదే తల్లిదండ్రులను వేపుకు తినసాగింది. పిల్ల ఎదిగింది. ఈడేరిన పిల్ల నట్టింట పడి ఉండటంతో లోకం వారిని చీకొట్టింది. వెలివేస్తామని బెదిరించింది కూడా. వాణీకాంత జరుగుబాటు ఉన్న సంపన్న గృహస్థే. రెండుపూటలా చేపలవేపుడు రుచిచూడగలిగిన కుటుంబమే. కలిమి గలవాని మీద అసూయ కావలసినంత. అది లోకధర్మమే. అందుకే అతనికి విరోధుల కొరత లేదు.ఒకనాడు ఇరుగు పొరుగు అమ్మలక్కలు పిల్ల పెళ్లిని గురించి కలగజేసుకున్నారు. వాణీకాంత చెప్పులరిగేలా తిరిగి ఇంటికొచ్చాడు. ఇక కలకత్తా వెళితే తప్ప వీలులేదన్నాడు. కుటుంబం కుటుంబమంతా ప్రయాణమైంది. మంచెతెర కప్పిన ఉషస్సులాగ సుభా హృదయం అశ్రుపూర్ణాకులమైంది. ఇన్ని రోజుల నుంచి ఆమె బిక్కుబిక్కుమంటోంది. అలా పెనగొన్న భయంతోనే తల్లిదండ్రుల వెనుక మూగజంతువులా బయల్దేరింది. వారి కళ్లలోకి చూసి ఏదో తెలుసుకోవాలనుకుంది. కాని వారు ఆమెకు ఏమాటా విప్పి చెప్పలేదు. ఇలా జరుగుతూ ఉండగా ఒక మధ్యాహ్నం గాలం నడుపుతూ కూర్చున్న ప్రతాప్ ఇలా అన్నాడు: ‘అయితే, సూ.. నీకు మొగుణ్ణి చూశారన్న మాట. నీకు పెళ్లవుతుంది. నన్ను మరచిపోకేం’ అని గాలం ఆడిస్తూ మళ్లీ వేటలో నిమగ్నమయ్యాడు. ‘నీకు నేను చేసిన అపచారం ఏముంది?’ అని ఉచ్చులో చిక్కిన పావురం బోయవాని ముఖం చూసి దీనంగా అడుగుతుంది. అలాగే సుభా ప్రతాప్ వైపు దీనంగా చూసింది. ఇక ఆ రోజుకి చింతమాను కింద కూర్చోలేక తిరిగొచ్చింది. వాణీకాంత ఒక్క కునుకుతీసి లేచి పడకగదిలో హుక్కా పీలుస్తున్నాడు. ఇంతలో సుభా వచ్చి అతని కాళ్ల వద్ద పడి తండ్రి ముఖంలోకి చూస్తూ గావురుమంది. వాణీకాంత ఓదార్చబోయి తానే కంటతడి పెట్టసాగాడు. ఉదయమే కలకత్తా ప్రయాణం నిశ్చయమైపోయింది. పశువుల కొట్టంలోని తన బాల్య స్నేహితులందరి వద్దా సెలవు తీసుకునేందుకు వెళ్లింది. చేతితో వాటికి పచ్చమేత అందించింది. వాటి మెడలు వాటేసుకుంది. కళ్లలోకి చూసింది. ఆమె కళ్లు బాష్పాలు కురిశాయి. బాష్పాలే ఆమె భాష. గోవు మాణిక్యాలు అర్థం చేసుకున్నాయి. నాడు బహుళ దశమి రాత్రి. సుభా గది వెడలి వచ్చింది. ఏటి గట్టున తాను కూర్చునే తావున గరికపట్టు మీద బోర్లా పడుకుంది. భూదేవి ఆమెకు నిశ్శబ్ద, సుబల మాతృమూర్తి. ‘నువ్వు నన్ను ఎడబాయనివ్వొద్దు. తల్లీ, నిన్ను నేను కావులించుకున్నట్లే నువ్వూ నన్ను నీ గాఢ సమాలింగనంలో చిక్కబట్టుకో తల్లీ!’ అని నివేదించుకోవాలని యత్నించింది.
కలకత్తా మహానగరంలో ఒక ఇంట్లో ఒకానొకనాడు సుభాకు తల్లి అలంకరించింది. బిగువుగా జడ అల్లింది. ఇన్ని ఆభరణాలను దిగవేసింది. ఆమె సహజ లావణ్యాన్ని చంపడానికి చేయాల్సినదంతా చేసింది.సుభా నీలలోచనాలు అశ్రుపూరితాలయ్యాయి. ఏడ్చి ఏడ్చి కళ్లు వాచిపోతాయని తల్లి భయపడి కసురుకొని తిట్టింది. కాని కన్నీళ్లు తిట్లకు వెరుస్తాయా?ఒక స్నేహితుణ్ణి వెంటబెట్టుకుని వరుడు పెళ్లిచూపులకు వచ్చాడు. తలుపువార నిలబడి, వరుడి ముందుకు పంపే ముందు కూతురికి తల్లి బిగ్గరగా సూచనలు ఇవ్వసాగింది. దాంతో ఆమె ఇంకా వెక్కివెక్కిఏడవసాగింది. ఆ మహాపురుషుడు ఆమెను ఎగాదిగా పరీక్షగా చూసి ‘అంత నాసికాదు’ అని స్వగతాన్ని పైకి అన్నాడు.ఆమె బాష్పాలు అతని మనసును ఆకర్షించాయి. ఆమెది సుకోమల హృదయమనుకున్నాడు. తల్లిదండ్రులను ఎడబాయడానికి కుములుతున్న ఆమె ఆర్ద్రహృదయం తనకెంతో ఉపకరిస్తుందని అనుకుంటూ,ఏడుపును ఆమె సుగుణంగానే లెక్కగట్టుకున్నాడు.
పురోహితుడు వచ్చాడు. శుభాశుభాలు లెక్కించాడు. ఒక శుభదినాన వివాహం పూర్తయింది. నోరులేని బిడ్డను ఒకరి చేతుల్లోపెట్టి తల్లిదండ్రులు తమ ఇల్లు చేరారు. దేవుని దయవల్ల ఇహంలో వారి కులానికీ, పరంలో వారి భద్రతకు భంగం వాటిల్లకుండా తప్పింది. అల్లుడికి పశ్చిమబెంగాల్లో ఉద్యోగం అయింది. పెళ్లయిన కొద్దిరోజులకే భార్యను కాపురానికి తీసుకుపోయాడు.పట్టుమని పదిరోజులైనా గడవలేదు. పెళ్లికూతురు మూగదని అంతా కనిపెట్టారు. ఇంకా ఎవరైనా కనిపెట్టలేకపోతే, అది ఆవిడ తప్పుకాదు. ఇందులో ఆమె ఎవ్వరినీ మోసగించలేదు. ఆమె గుట్టంతా కళ్లే విప్పి చెప్పేశాయి. కాని ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు. ఎవ్వరూ ఆమెను పలకరించలేదు. పుట్టినది మొదలు తనకు తెలిసిన మొహాలిప్పుడు కరువయ్యాయి. మూగపిల్ల భాషను ఎరిగిన వారంతా దూరమయ్యారు. ఆమె నీరవ హృదయం అంతమేలేని, వినబడని ఏడుపు చప్పుళ్లు నెలకొన్నాయి. అదెవ్వరికి తెలుసు అంతర్ద్రష్టకు తప్ప!
- రవీంద్రనాథ్ టాగోర్