సీఎం ఆఫీసు ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
విధుల నుంచి తొలగించారని విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగి మనస్తాపం
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని సీఎం కార్యాలయం (సమతాబ్లాక్) ఎదుట శుక్రవారం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విధుల నుంచి తొలగించారనే మనస్తాపంతో చండూరి చంద్రశేఖర్ అనే విద్యుత్ కాంట్రాక్టు కార్మికుడు తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని సమీపంలోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్ వెంట వచ్చిన అతని మిత్రుడు సతీష్ తెలిపిన వివరాల ప్రకారం..
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలోని సబ్‌స్టేషన్‌లో చంద్రశేఖర్, సతీష్‌లు 2012 నుంచి 2014 డిసెంబర్ వరకు ఔట్‌సోర్సింగ్ కింద షిప్ట్ ఆపరేటర్లుగా పనిచేశారు. తర్వాత ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టర్ స్థానంలో కొత్త కాంట్రాక్టర్ ను నియమించగా అతను వీళ్ల స్థానంలోకి వేరే వారిని నియమించాడు. ఈ విషయమై స్థానిక డీఈని కలవగా తనకు సంబంధం లేదని, కాంట్రాక్టర్‌ను కలవాలని సూచించాడు.
ఇదే విషయాన్ని సీఎంకు చెప్పుకోవడానికి సచివాలయానికి వచ్చామని, చంద్రశేఖర్ పురుగుల మందు తెచ్చుకున్న సంగతి తనకు తెలియదని సతీష్ చెప్పాడు. కాగా, ఇది పెద్ద డ్రామా అని, చంద్రశేఖర్ ముందుగానే బాటిల్‌లో మందుకు బదులు నీళ్లు కలుపుకొని వచ్చాడని, అది తాగకుండా మీద పోసుకున్నాడని పోలీసులు చెప్పారు.