కంభం రూరల్: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం బంగారం పండే భూములను త్యాగం చేసిన మాకు గృహాలు నిర్మించుకునేందుకు స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వం, అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎదుట పలువురు ముంపు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కాకర్ల డ్యాం నిర్మాణ పనులు పరిశీలించేందుకు ఆదివారం సాయంత్రం వచ్చిన ఎంపీని ముంపు గ్రామాలైన లక్ష్మీపురం, ముట్టుగుంది, సాయిరాంనగర్, కృష్ణానగర్ ప్రజలు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
డ్యాం నిర్మాణానికి తాము 3,600 ఎకరాల భూములు ఇచ్చామన్నారు. తమకు పునరావాసం కోసం 20 ఎకరాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చిన అధికారులు నేటికీ పట్టించుకోవడం లేదన్నారు. 3 వేల ఎకరాలకే నష్టపరిహారం ఇచ్చారని, మిగిలిన 600 ఎకరాలకు నేటికీ పరిహారం అందలేదన్నారు. అదే వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే తమకు ఈ అన్యాయం జరిగేది కాదన్నారు. దేవరాజుగట్టు వద్ద ఉన్న వంద ఎకరాల్లో నివేశన స్థలం ఇప్పించాలని పెద్దారవీడు మండలం గుండంచర్ల వాసులు ఎంపీకి విన్నవించారు. దీనిపై స్పందించిన ఎంపీ ప్రాజెక్టు అధికారులు సుధాకర్, రమేష్‌బాబులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బాధితులతో మాట్లాడుతూ వచ్చేనెల 11, 12 తేదీల్లో ఒంగోలులో అందుబాటులో ఉంటానని, మీ ప్రాంత శాసనసభ్యులతో కలిసి వస్తే సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. అర్థవీడు మండల కన్వీనర్ రంగారెడ్డి మాట్లాడుతూ కాకర్లలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మించాలని, సంగీత కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎంపీ సంగీత విద్వాంసుడు త్యాగరాజు జన్మస్థలమైన కాకర్లలో సంగీత కళాశాల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎంపీ వెంట గిద్దలూరు, యర్రగొండపాలెం, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, డేవిడ్ రాజు, ఆదిమూలపు సురేష్, వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు యేలం వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సూర స్వామిరంగారెడ్డి, అర్థవీడు ఎంపీపీ రవికుమార్ యాదవ్, జెడ్పీటీసీ కొడావత్ లక్ష్మీదేవి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు క్రాంతికుమార్, మాజీ ఎంపీపీ గొటిక రాజేశ్వరరెడ్డి, కంభం, అర్థవీడు మండలాల కన్వీనర్లు సయ్యద్ మాబు, ఏరువ రంగారెడ్డి, కంభం మండల వైఎస్సార్ సీపీ నాయకులు చేగిరెడ్డి ఓబులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మా గోడు తీర్చేదెవరు?
Published Mon, Sep 22 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM
Advertisement