house Place
-
ఇంటి స్థలం కోసం పట్టు
సాక్షి, పాలకొల్లు అర్బన్: నిరుపేదలకు ఇంటి స్థలాలిస్తామన్నారు. దీని కోసం గ్రామంలో భూమి సేకరించారు. రెండు సెంట్లు వంతున పట్టాలిచ్చారు. అయితే భూమి కేటాయించే సమయంలో అనర్హులను కూడా లబ్ధిదారుల జాబితాలో చేర్చి అందరికీ సెంటు భూమి వంతున కేటాయించారు. దీంతో లబ్ధిదారులు తమకు సెంటు భూమి పట్టా వద్దంటూ ఆదివారం ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. పాలకొల్లు మండలం సగం చెరువులో దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి నిరుపేదలకు ఇంటిస్థలాలివ్వాలనే లక్ష్యంతో ఆర్ఎస్ నెం.121/4డీ, 4ఎఫ్, 5బీ సర్వే నంబర్లలో 0.67 ఎకరాల భూమిసేకరించారు. అప్పట్లో 18మంది లబ్ధిదారులను గుర్తించి ఒక్కొక్కరికి 2 సెంట్లు చొప్పున పట్టాలిచ్చారు. 2007లో లబ్ధిదారులకు ఇంటి స్థలం పట్టాలిచ్చినా స్థలం కేటాయించ లేదు. అప్పటి నుంచి లబ్ధిదారులు తమకు ఇంటి స్థలాలు కేటాయించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోయింది. సగంచెరువులో సేకరించిన 67 సెంట్ల భూమి గతేడాది ఆగస్టులో అనర్హులను కొంత మందిని చేర్చి 42 మందికి ఒక సెంటు చొప్పున స్థలం కేటాయిస్తూ పట్టాలిచ్చారు. సెంటు స్థలం ఎటూ సరిపోదని, సెంటున్నర కేటాయించాలని లబ్ధిదారులు ఇటీవల సగంచెరువులో వైఎస్సార్ సీపీ కన్వీనర్ గుణ్ణం నాగబాబుకి లబ్ధిదారులంతా ఫిర్యాదు చేశారు. లబ్ధిదారుల ఫిర్యాదు మేరకు కన్వీనర్ గుణ్ణం నాగబాబు తహసీల్దార్‌కి ఫోన్లో మాట్లాడి దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భూమి సేకరించామని, అర్హులందరికీ న్యాయం చేయాలని కోరడంతో అప్పటి తహసీల్దార్ దాసి రాజు వీఆర్వోతో గ్రామంలో సర్వే చేసి గ్రామంలో 14 మంది అనర్హులను గుర్తించారు. ఈ 14 మంది పట్టాలు రద్దు చేసి వారికి కేటాయించిన స్థలాన్ని పాత లబ్ధిదారులకు అర సెంటు చొప్పున పెంచి సెంటున్నర పట్టా కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. స్థలాల వద్ద ఆందోళన ఇందిరమ్మ పట్టాలు ఇచ్చిన స్థలాల్లో ఆదివారం లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. స్థలాల్లో ఆందో ళన శిబిరం ఏర్పాటు చేశారు. 14 మంది అనర్హుల్లో ఎవరైనా వచ్చి ఇళ్లు కట్టే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే అనర్హుల జాబితా పంచాయతీవద్ద ప్రదర్శించి నిజౖ మెన లబ్ధిదారులకు న్యాయంచేయాలని కోరుతున్నారు. -
మా గోడు తీర్చేదెవరు?
కంభం రూరల్: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం బంగారం పండే భూములను త్యాగం చేసిన మాకు గృహాలు నిర్మించుకునేందుకు స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వం, అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎదుట పలువురు ముంపు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కాకర్ల డ్యాం నిర్మాణ పనులు పరిశీలించేందుకు ఆదివారం సాయంత్రం వచ్చిన ఎంపీని ముంపు గ్రామాలైన లక్ష్మీపురం, ముట్టుగుంది, సాయిరాంనగర్, కృష్ణానగర్ ప్రజలు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. డ్యాం నిర్మాణానికి తాము 3,600 ఎకరాల భూములు ఇచ్చామన్నారు. తమకు పునరావాసం కోసం 20 ఎకరాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చిన అధికారులు నేటికీ పట్టించుకోవడం లేదన్నారు. 3 వేల ఎకరాలకే నష్టపరిహారం ఇచ్చారని, మిగిలిన 600 ఎకరాలకు నేటికీ పరిహారం అందలేదన్నారు. అదే వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే తమకు ఈ అన్యాయం జరిగేది కాదన్నారు. దేవరాజుగట్టు వద్ద ఉన్న వంద ఎకరాల్లో నివేశన స్థలం ఇప్పించాలని పెద్దారవీడు మండలం గుండంచర్ల వాసులు ఎంపీకి విన్నవించారు. దీనిపై స్పందించిన ఎంపీ ప్రాజెక్టు అధికారులు సుధాకర్, రమేష్‌బాబులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులతో మాట్లాడుతూ వచ్చేనెల 11, 12 తేదీల్లో ఒంగోలులో అందుబాటులో ఉంటానని, మీ ప్రాంత శాసనసభ్యులతో కలిసి వస్తే సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. అర్థవీడు మండల కన్వీనర్ రంగారెడ్డి మాట్లాడుతూ కాకర్లలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మించాలని, సంగీత కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎంపీ సంగీత విద్వాంసుడు త్యాగరాజు జన్మస్థలమైన కాకర్లలో సంగీత కళాశాల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ వెంట గిద్దలూరు, యర్రగొండపాలెం, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, డేవిడ్ రాజు, ఆదిమూలపు సురేష్, వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు యేలం వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సూర స్వామిరంగారెడ్డి, అర్థవీడు ఎంపీపీ రవికుమార్ యాదవ్, జెడ్పీటీసీ కొడావత్ లక్ష్మీదేవి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు క్రాంతికుమార్, మాజీ ఎంపీపీ గొటిక రాజేశ్వరరెడ్డి, కంభం, అర్థవీడు మండలాల కన్వీనర్లు సయ్యద్ మాబు, ఏరువ రంగారెడ్డి, కంభం మండల వైఎస్సార్ సీపీ నాయకులు చేగిరెడ్డి ఓబులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.