రూ.7 దాటిన కోడిగుడ్డు చిల్లర ధర
రూ.20 వరకు చేరిన ‘ప్రత్యేక’ గుడ్డు ధర
కారణాలు ఏంటంటే..
సాక్షి, హైదరాబాద్: నిజంగానే కొడిగుడ్డుకు రెక్కలొచ్చాయి. ఒక్క గుడ్డు చిల్లర ధర ఏకంగా రూ.7 దాటింది. కార్తీకమాసం ముగిసిన వెంటనే గుడ్డు ధర అమాంతం పెరిగింది. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ(ఎన్‌ఈసీసీ) ఒక గుడ్డు ధరను రూ.6.20గా నిర్ణయించింది. 30 గుడ్ల ట్రే ధర రూ.186. వెన్‌కాబ్ వంటి కొన్ని చికెన్ విక్రయ సంస్థలు 12 గుడ్లను రూ.85కు విక్రయిస్తున్నాయి. అంటే ఒక్క గుడ్డు ధర రూ.7.08.
హైపర్ మార్కెట్లు, ఆన్‌లైన్ మార్కెట్లలో ప్రొటీన్ గుడ్లు, నౌరిష్ గుడ్లు, విటమిన్ –డి, విట్రిచ్, హై ప్రొటీన్, బ్రౌన్ ఎగ్స్‌గా ప్యాక్ చేసి విక్రయించే ఒక్కో గుడ్డు ధర రూ.10 నుంచి రూ.20 వరకు ఉంది. హెర్బల్ గుడ్ల పేరిట ఓ కంపెనీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంపై 6 గుడ్లను ఏకంగా రూ.112కు విక్రయిస్తోంది.
సామాన్యులు ఇళ్ల దగ్గరి దుకాణాల్లో రిటైల్‌గా కొనుగోలు చేసే గుడ్లను మాత్రం రూ.7.. అంతకంటే కొంచెం పెంచి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిన డిమాండ్‌తోనే గుడ్డు ధర భారీగా పెరిగిందని తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కోళ్లకు ప్రధాన దానా అయిన మొక్కజొన్న ధర పెరగటం కూడా గుడ్డు ధర పెరగటానికి కారణమని చెబుతున్నారు.
తెలంగాణ, ఏపీల్లోనే అధిక ఉత్పత్తి
దేశంలో పౌల్ట్రీ పరిశ్రమ దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడులోనే ప్రధానంగా కేంద్రీకృతమైంది. దేశంలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రతిరోజు 32 కోట్ల వరకు గుడ్లు ఉత్పత్తి అయితే, ఈ మూడు రాష్ట్రాల్లోనే 15 కోట్ల వరకు ఉత్పత్తి అవుతాయి. రోజూ 5 కోట్లకు పైగా గుడ్ల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
పౌల్ట్రీ పరిశ్రమకు చలికాలం మాత్రమే మంచిరోజులని, డిమాండ్ పెరిగి పౌల్ట్రీ వ్యాపా రులకు లాభాలు వస్తాయని ఈ పరిశ్రమకు చెందిన ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. చలికాలంలో కోడిగుడ్ల వినియోగం ఎక్కువ గానే ఉంటుందని వెంకటేశ్వర హ్యాచరీస్ జనరల్ మేనేజర్ కె.జి. ఆనంద్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment