పందెం కోడిగుడ్డు ధర రూ.400 నుంచి రూ.700
కోస్తా జిల్లాల నుంచి తీసుకొచ్చి మరీ పెంపకం
గుడ్డు పొదిగేందుకు ప్రత్యేక పెట్టలు
కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లో పెంపకం
కోడిగుడ్డు రూ.400 నుంచి రూ.700 ధర పలుకుతోంది. ఏంటీ కోడిగుడ్డుకు ఇంత ధరా. ఏమిటీ దీని స్పెషాలిటీ అనుకుంటున్నారా? ఇవి అలాంటి.. ఇలాంటి గుడ్లు కాదండోయ్. ఈ గుడ్లు వెరీ స్పెషల్. సంక్రాంతి సంబరాల్లో పౌరుషాన్ని చాటి.. పందేలరాయుళ్లకు కాసుల వర్షాన్ని కురిపించే పందెం కోళ్ల జాతికి సంబంధించిన గుడ్లకు భారీ ధర పలుకుతోంది. కోస్తా జిల్లాల నుంచి వీటిని తీసుకొచ్చి ప్రకాశం జిల్లా (Prakasam District) తీరంలోని కొత్తపట్నం, సింగరాయకొండ (Singarayakonda) మండలాల్లో పెంచుతున్నారు. వీటి గుడ్లను జాతి పెట్టలతో పొదిగించి.. పుంజులను ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. –సాక్షి ప్రతినిధి, ఒంగోలు
గుడ్డు రకాన్ని బట్టి ధర
పందెం కోడి కోళ్లలో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా తూర్పు కోడి, పెర్విన్ కోడి, భీమవరం కోడి, ఎర్ర మైల, అబ్రాసు మైల, కాకి నెమలి, తెల్ల నెమలి, నల్లపడ కోడి, కాకి డేగ, ఎర్ర కక్కెర, తెల్లకోడి, కాకి నెమలి, పెట్టమారు వంటి పుంజులు ఈ జాబితాలో ఉన్నాయి. రకాన్ని బట్టి గుడ్డు ధరలు పలుకుతున్నాయి. ఒక్కో గుడ్డు (Egg) రూ.400 నుంచి రూ.700 వరకూ విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి వీటి ధరలు కూడా పెరిగిపోతుంటాయి. తూర్పు కోడి, భీమవరం కోడి, ఎర్ర కక్కెర, తెల్లకోడి పెట్టిన ఒక్కో గుడ్డు ధర సుమారు రూ.400 వరకు ఉంటుంది.
క్రాస్ బ్రీడ్‌లైన అబ్రాసు మైల, తెల్ల కక్కెర, ఎర్ర మైల తదితర రకాల జాతులకు చెందిన గుడ్డు ఒక్కొక్కటీ రూ.500 నుంచి రూ.700 వరకు ఉంటుంది. పందెం కోడి రకం గుడ్ల కోసం ప్రత్యేకంగా పెంచిన నల్ల పెట్ట, డేగ పెట్ట, తెల్ల పెట్ట, బూడిదరంగు పెట్ట, అబ్రాసు పెట్ట, కక్కెర పెట్టలను ఉపయోగిస్తారు. పందెం కోళ్లతో ఈ పెట్టలు కలవటం ద్వారా గుడ్లు పెడతాయి. ఈ కోళ్లు గుడ్లు పెట్టడమే కానీ.. వాటిని పొదగవు. ఈ కోళ్లు మూడు నెలల్లో 10 నుంచి 15 వరకు గుడ్లను పెడతాయి. ఈ గుడ్లను ప్రత్యేక నాటుకోళ్లతో పొదిగిస్తారు. వీటికి బహిరంగ మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంటుంది.
ప్రత్యేక ఆహారం
పందెం కోళ్ల పెంపకంలో ప్రత్యేక ఆహారం పెడతారు. కోడి గుడ్డు పెట్టిన తరువాత మూడు వారాలకు పిల్ల అవుతుంది. అప్పటి నుంచి రెండేళ్లపాటు వాటికి ప్రత్యేక ఆహారం పెడతారు. సుమారు ఏడాదిన్నర పాటు రాగులు, సజ్జలు పెడతారు. తరువాత 6 నెలలు బాదం, ఖర్జూరం, అంజూర్, యాలుక, రసగుల్లా, రంగుల ద్రాక్ష, కిస్మిస్, నాటుకోడి గుడ్డు వంటి బలవర్ధకమైన ఆహారాన్ని పెడతారు. కొన్నింటికి పోతు మాంసం కూడా పెడతారు. దీనిని తినడం ద్వారా పుంజు బలంగా ఉండటమే కాక బరిలో అవతలి పుంజును సమర్థవంతంగా ఎదుర్కొంటుందని పెంపకందారులు చెబుతున్నారు
కుటీర పరిశ్రమగా పందెం కోళ్ల పెంపకం
పందెం కోళ్లను కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లోని తీరప్రాంత గ్రామాల్లో కుటీర పరిశ్రమగా పెంచుతున్నారు. కొంతమంది కోడిగుడ్లను అమ్ము కుంటూ ఆదాయం పొందుతుండగా.. మరికొందరు గుడ్లను పొదిగించి వాటిని అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఇంకొందరు వాటిని బరిలో దిగేలా పెంచి అధిక ధరలకు అమ్ముతున్నారు. కోడి పుంజుల పెంపకం లాభసాటిగా ఉందని.. దూరప్రాంతాల నుంచి వచ్చి పుంజులను కొనుగోలు చేస్తుంటారని పెంపకందారులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment