గుడ్డు.. వెరీబ్యాడ్
=అంగన్వాడీలకు సరఫరా చేసే గుడ్లలో అన్యాయం
=చిన్న గుడ్లతో మాయాజాలం
=భారీ ఎత్తున హస్త లాఘవం?
యలమంచిలి, న్యూస్‌లైన్: అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లను చూసి గుడ్లు తేలేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ కేంద్రాలకు సరఫరా అయ్యే గుడ్లు పక్షి గుడ్ల పరిమాణంలో ఉండడమే ఇందుకు కారణం. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూలు పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు సోమ, మంగళ, బుధ, శుక్రవారాల్లో ఉడికించిన గుడ్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గుడ్లు చాలా చిన్నవిగా ఉంటున్నాయి.
ఈ తెర వెనుక వ్యవహారంలో పెద్దతతంగమే నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గుడ్ల పంపిణీలో కాంట్రాక్టర్లు అవకతవకలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న గుడ్ల పరిమాణాన్ని చూసి వీటిని తీసుకోడానికి కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు నిరాకరిస్తున్నారు. కాంట్రాక్టు నిబంధనల ప్రకారం అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే ఒక గుడ్డు బరువు 50 గ్రాములు ఉండాలి.
కుళ్లిన, పగిలిన గుడ్లను కేంద్రాలకు పంపిణీ చేయకూడదు. అయితే ప్రస్తుతం పంపిణీ చేస్తున్న కొన్ని గుడ్లు 40 గ్రాములు కూడా ఉండడం లేదని పలువురు తల్లిదండ్రులు, బాలింతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మార్కెట్‌లో రిటైల్‌గా కోడిగుడ్లను రూ.4కు, హోల్‌సేల్‌గా రూ. 3.88కు విక్రయిస్తున్నారు. చిన్న గుడ్లను హోల్‌సేల్‌గా రూ.2 నుంచి రూ.2.50పైసలకు అమ్ముతున్నారు.
కోళ్లఫారాలనుంచి సేకరణ : అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు కోళ్ల ఫారాలనుంచి చిన్న గుడ్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫారాల్లో నాణ్యత ఉన్న గుడ్లను మార్కెట్‌లకు తరలించి గ్రేడింగ్‌ద్వారా వేరుచేసిన చిన్న గుడ్లను, పాడైన గుడ్లను కాంట్రాక్టర్లకు అమ్ముతున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. గుడ్ల నాణ్యతపై అంగన్వాడీ కేంద్రాలను ప్రాజెక్టు అధికారులు పరిశీలించకపోవడం, ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
చిన్నగుడ్లు మాకొద్దు... : అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న గుడ్లను పిల్లలు నిరాకరిస్తున్నారు. గుడ్ల పరిమాణంలో బాగా తేడా ఉండడంతో చిన్న గుడ్లు మాకొద్దంటూ పిల్లలు మారాం చేస్తున్నారు. ఇక గుడ్ల విషయమై కాంట్రాక్టర్లను ప్రశ్నిస్తే ధరలు పెరగడంవల్ల చిన్నగుడ్లు సరఫరా చేస్తున్నామని చెబుతున్నారని తల్లిదండ్రులు అంటున్నారు.