ప్రకాశం, చినగంజాం: పసి వయస్సు నుంచి గుడ్డును చిన్నారులకు అందించడం ద్వారా వారికి పౌష్టికాహారం నేరుగా ఇవ్వవచ్చన్న ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్‌వాడీలకు, బడి పిల్లలు, గర్భిణులకు గుడ్లు పంపిణీ చేస్తోంది. అధికారులు నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల కక్కుర్తితో ఈ పథకం నీరుగారుతోంది. పథకం అమలులో తలెత్తుతున్న లోపాలను సవరించిన ప్రభుత్వం ఇటీవల కొత్త నిబంధనలను అమలు చేసింది. ఆ మేరకు దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్న అమృత హస్తం అని పేరుపెట్టి ఒక్కో గుడ్డు ధర రూ.4.68లుగా నిర్ణయించి రాష్ట్ర వ్యాప్తంగా గుడ్డు పంపిణీని ముగ్గురు కాంట్రాక్టర్లకు అప్పగించారు. సంబంధిత కాంట్రాక్టర్ అంగన్‌వాడీలకు, పాఠశాలలకు నేరుగా గుడ్డు పంపిణీ చేయాలి.
మార్కెట్ ధరల్లో తరచుగా వచ్చే హెచ్చుతగ్గులతో ఎటువంటి సంబంధం లేకుండా గుడ్లను విద్యార్థులకు అందించాల్సి ఉంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో సోమ, శనివారం మినహా అన్ని రోజుల్లో గుడ్డు పంపిణీ చేయాల్సి ఉండగా, పాఠశాలల్లో సోమ, బుధ, శుక్రవారం గుడ్డు పంపిణీ చేయాలి. గర్భిణులకు ఒక్క రోజు మినహా మిగిలిన అన్ని రోజులు గుడ్డు ఇవ్వాలి. ఒక్కో రోజుకు ఒక్కో రంగు చొప్పున నిర్ణయించి ఆ రంగును గుడ్డుపై ముద్రించి నాణ్యమైన గుడ్డు 52 గ్రాముల బరువు ఉండేలా చూసి పంపిణీ చేయాలనే నిబంధనలతో కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే కొద్ది రోజులుగా గుడ్డు ధర కొండెక్కి కూస్తుండటంతో కాంట్రాక్టర్లు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇటీవల చినగంజాం మండలంలో ఎంపీపీ ఆసోది భాగ్యలక్ష్మి పలు పాఠశాలలను సందర్శించగా గుడ్ల పంపిణీ సక్రమంగా జరగడం లేదని గుర్తించారు. నెలలో నాలుగు వారాలకు గుడ్లు విద్యార్థులకు అందజేయాల్సి ఉండగా ఒక వారం మాత్రమే ఇచ్చినట్లు గుర్తించారు.
జిల్లాలో వారానికి ఒక్కసారే గుడ్ల పంపిణీ: జిల్లాలో గుడ్ల పంపిణీలో కాంట్రాక్టర్లు భారీగా కోత విధిస్తున్నారు. వారానికి మూడు గుడ్ల చొప్పున నెలకు 12 గుడ్లు వెరసి నెలలో నాలుగు సార్లు గుడ్డు పంపిణీ చేయాల్సి ఉండగా డిసెంబర్ నెలలో మూడు పర్యాయాలు, జనవరి నెలలో కేవలం ఒక్క సారి మాత్రమే గుడ్డు పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 4244 అంగన్‌వాడీ కేంద్రాలు, 2857 ప్రాథమిక పాఠశాలలు, 630 ప్రాథమికోన్నత పాఠశాలలు, 800 ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్డు పంపిణీ చేయాల్సి ఉంది.
గర్భిణులకు సక్రమంగా అందని కోడి గుడ్డు: గర్భిణులు, బాలింతలకు నెలకు 25 గుడ్ల చొప్పున పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఆ మేరకు పంపిణీ జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మూడేళ్లలోపు చిన్నారులకు 16 గుడ్లు, మూడేళ్లు నిండిన పిల్లలకు నెలకు 8 గుడ్ల చొప్పున పంపిణీ జరగాల్సి ఉంది.
పాఠశాలల్లో అడ్రస్ లేని కోడిగుడ్ల పంపిణీ: గుడ్ల పంపిణీలో కొద్దికాలంగా తీవ్ర కొరత ఏర్పడుతోంది. నెలలో కొద్ది రోజులు మాత్రమే గుడ్డు పంపిణీ చేసి మిగిలిన వాటిని పంపిణీ చేయకుండానే ఆ నెల కోటాను కాంట్రాక్టర్లు ముగించేస్తున్నారు. ఆ విధంగా చినగంజాం మండలంలో అక్టోబర్ నెలలో రెండు సార్లు, నవంబర్‌లో మూడు సార్లు, డిసెంబర్‌లో మూడు, జనవరి నెలలో ఒకసారి మాత్రమే గుడ్డు సరఫరా అయినట్లు ఆయా కుకింగ్ ఏజన్సీల నిర్వాహకులు తెలిపారు.
అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయ లోపం: అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయ లోపం కారణంగా గుడ్ల పంపిణీలో లోపం తలెత్తుతోంది. గుడ్లు నెలకు ఎన్ని పంపిణీ అవుతున్నాయనే విషయాన్ని పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు వారిష్టమొచ్చిన రీతిలో పంపిణీ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు గుడ్డు ధరను నిర్ణయించడం..
ఆ తరువాత గుడ్డు ధరలో వస్తున్న హెచ్చు తగ్గులు పంపిణీకి ఆటంకాలుగా మారుతున్నాయని పంపిణీ చేసే వారు చెబుతున్నారు.
ఈ విషయమై సాక్షి చినగంజాం ఎంఈవోను వివరణ కోరగా కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో గుడ్డు పంపిణీ చేయక పోవడంతో విద్యార్థులకు పూర్తి స్థాయిలో మధ్యాహ్న భోజనంలో గుడ్డు పంపిణీ చేయలేక పోతున్నామని, గుడ్ల సరఫరా చేసినంత వరకు మాత్రమే వారికి బిల్లులు చెల్లిస్తున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment