ఊరటనిస్తోన్న ఉల్లి
= హోల్‌సేల్‌గా కేజీ రూ.13
= రిటైల్‌గా కిలో రూ.35
= కొత్తపంట రాకతో దిగివ స్తోన్న ధరలు
సాక్షి, సిటీబ్యూరో : ఢిల్లీ సర్కార్ పీఠాన్ని సైతం కదిలించిన ఉల్లి ధరలు ఇప్పుడిప్పుడే కిందకు దిగివస్తున్నాయి. వంటల్లో అతి ప్రధాన వస్తువైన ఉల్లిగడ్డ ధర క్రమేణా తగ్గుతుండటం గృహిణుల్లో కాస్తంత ఊరటనిస్తోంది. కొత్తపంట దిగుబడి ప్రారంభం కావడంతో సామాన్యుడికి ఉల్లి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో నాణ్యమైన గ్రేడ్-1 ఉల్లి కేజీ రూ.13లకు, గ్రేడ్-2 రకం ఉల్లి కేజీ రూ.7లకు లభిస్తోంది. అయితే... రిటైల్ మార్కెట్లో మాత్రం దోపిడీ యథావిధిగా సాగుతోంది. వీరు నాణ్యమైన ఉల్లి కేజీకి రూ.35లు, రెండో రకం రూ.25-30ల ప్రకారం వసూలు చేస్తున్నారు.
రైతుబజార్‌లో కేజీ రూ.24లు ధర నిర్ణయించి విక్రయిస్తున్నారు. స్థానికంగా కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి కొత్తపంట దిగుబడి మొదలైంది. దీనికితోడు మహారాష్ట్ర నుంచి కూడా పెద్దమొత్తంలో సరుకు దిగుమతి అవుతుండటంతో నగర మార్కెట్‌ను ఉల్లి ముంచెత్తుతోంది. నగరంలోని మహబూబ్ మేన్షన్ హోల్‌సేల్ మార్కెట్‌కు శనివారం 80 లారీల్లో మొత్తం 8వేల క్వింటాళ్ల ఉల్లి దిగుమతైంది.
గ్రేడ్-1 రకం ఉల్లి క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.1300లు, రెండో రకం రూ.700లు ధర పలికింది. ఈ ప్రకారం గ్రేడ్-1 ఉల్లి కేజీ రూ.13లు, గ్రేడ్-2 ఉల్లి కేజీ రూ.7ల ధర నిర్ణయమైందన్న మాట. శనివారం హోల్‌సేల్ మార్కెట్‌కు 16వేల ప్యాకెట్స్ ఉల్లి దిగుమతి కాగా, ఇందులో 50 శాతం సరుకు స్థానికంగానే విక్రయించారు. ప్రస్తుతం జంటనగరాల్లో ఎక్కడా కొరత లేదని, ధరలూ స్థిరంగానే ఉన్నాయని మార్కెటింగ్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆగని దోపిడీ
నిన్నమొన్నటి వరకు రెట్టింపు ధరలు వసూలు చేసిన ఉల్లి వ్యాపారులు ఒక్కసారిగా రేట్లు తగ్గించేందుకు ఇష్టపడట్లేదు. ఫలితంగా రిటైల్ మార్కెట్లో గ్రేడ్-2 ఉల్లి కేజీ రూ.25-30లప్రకారం వసూలు చేస్తున్నారు. తోపుడు బండ్ల వారైతే ఇంటివద్దకే సరుకు తెస్తున్నామంటూ కేజీ రూ.30-35లకు అమ్ముతున్నారు. వాస్తవానికి హోల్‌సేల్ మార్కెట్‌లో పలికిన ధరకు రవాణా, హమాలీ, డ్యామేజి, లాభం వంటివి కేజీకి రూ.5-6లు చేర్చి రిటైల్ మార్కెట్లో ధర నిర్ణయించాలి. అంటే... గ్రేడ్-1 ఉల్లి కేజీ రూ.18-19లు, గ్రేడ్-2 ఉల్లి కేజీ రూ.12-13ల ప్రకారం విక్రయించాలి.
అయితే... ఇటీవలి వరకు మంచి లాభాలకు అలవాటుపడ్డ వ్యాపారులు పాత ధరలకే అమ్మి సొమ్ము చేసుకొంటున్నారు. ఉల్లి ధరలు తగ్గాయన్న కారణంగా పదిరోజుల క్రితమే రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లి విక్రయాలు నిలిపి వేశారు. ఆ మేరకు తగ్గిన రేట్లను బోర్డుపై రాయకుండా వ్యాపారులకు సహకరిస్తూ రైతుబజార్ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతుండటం గమనార్హం. ప్రస్తుతం గ్రేడ్-2 రకం ఉల్లి హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.7లు ధర ఉంటే... రైతుబజార్‌లో మాత్రం కేజీ రూ.24ల ప్రకారంబోర్డుపై ధర నిర్ణయించడం అక్రమాలకు అద్దం పడుతోంది.
పెరిగిన విక్రయాలు
రైతుబజార్లలో కాస్త తక్కువ ధరలకే ఉల్లిపాయలు లభిస్తుండటంతో అక్కడే ఉల్లి కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఎర్రగడ్డ వంటి రద్దీ రైతుబజార్‌లో సాధారణ రోజుల్లో 60-70 క్వింటాళ్లు అమ్ముడుపోయే ఉల్లి ఆదివారం 120 క్వింటాళ్ల మేర విక్రయించారు. చిల్లర మార్కెట్‌తో పోలిస్తే ఇక్కడ ధరలు తక్కువగా ఉండటంతో సరుకు హాట్ కేక్‌లా అమ్ముడుపోయిందని రైతుబజార్ వర్గాలు తెలిపాయి. మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సరూర్‌నగర్ ైరె తుబజార్లలో కూడా ఉల్లి విక్రయాలు జోరుగా సాగాయి. ఒక్కో రైతుబజార్‌లో 100 క్వింటాళ్లకు పైగానే అమ్మకాలు జరిగినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు.