భలే గిరాకీ | Upon arrival at the fish market in the city of tsubaki shrugged Carta | Sakshi
Sakshi News home page

భలే గిరాకీ

Published Sun, Jun 8 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM

భలే గిరాకీ

భలే గిరాకీ

  • చేపల ధర కేజీ రూ.30 నుంచి రూ.150 వరకు పెరుగుదల
  • సాక్షి, సిటీబ్యూరో: మృగశిర కార్తె రాకతో నగరంలో చేపల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ‘మృగశిర’ అడుగిడిన తొలి రోజే చేపలు తినడమనేది నగర ప్రజల్లో అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఆదివారం ఉదయం 11.36 గం.లకు మృగశిర కార్తె ప్రవేశిస్తోంది. అయితే... ఆదివారం ధరలు పెరుగుతాయన్న ఉద్దేశంతో అనేక మంది శనివారం నాడే చేపలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు.

    దీంతో శనివారం మార్కెట్లో చేపలు మరింత ప్రియమైపోయాయి. సాధారణ రోజుల్లో అమ్మకాల కంటే రెట్టింపు ధర  పలికాయి. నగరంలో అనేక చోట్ల రోడ్డుపక్క టెంట్లు వేసి చేపల విక్రయాలు కొనసాగాయి. గిరాకీని బట్టి వ్యాపారులు రేట్లు నిర్ణయించడంతో ఒక్కోచోట ఒక్కో ధర పలికాయి.
     
    పెరిగిన దిగుమతులు...

    రామ్‌నగర్‌లోని దయార హోల్‌సేల్ చేపల మార్కెట్‌కు రోజుకు 20 నుంచి 25 లారీల్లో చేపలు దిగుమతవుతుంటాయి. అయితే... మృగశిర కార్తె డిమాండ్ దృష్ట్యా  శనివారం 45 నుంచి 50 లారీల్లో సరుకు దిగుమతైనట్లు టీ జీఆర్ కంపెనీ అధినేత గోవిందరాజ్  తెలిపారు. ఆదివారం నాడు ఇంకా ఎక్కువ గిరాకీ ఉండే అవకాశం ఉన్నందున 100-120 లారీల వరకు సరుకు దిగుమతయ్యే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు.

    మహబూబ్‌నగర్, జడ్చర్ల, వరంగల్, కరీంనగర్, సిద్ధిపేట, సూర్యాపేట, కోదాడ నుంచే  కాకుండా ఏలూరు, భీమవరం, ఆకివీడు, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున చేపలు దిగుమతైనట్లు గంగపుత్ర సంఘం ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు. ‘మాకు ఐస్ సమస్య అధికంగా ఉంది. కరెంట్ కోతల వల్ల ఈ దుస్థితి ఎదురైంది. ఒక్క బ్లాక్ ఐస్‌కు రూ.450-500లు వసూలు చేస్తున్నారు. ఆ ప్రభావమే చేపల ధరలపై పడింది. అందుకే రేట్లు అమాంతం పెరిగాయి’ అని ఆయన వివరించారు.
     
    మార్కెట్ల కళకళ...
     
    ధరల సంగతెలా ఉన్నా... సెంటిమెంట్ ప్రభావం చేపల మార్కెట్లో స్పష్టంగా కనిపించింది. నగరంలోని చిన్నా, పెద్దా అన్ని మార్కెట్లు వినియోగదారులతో కళకళలాడాయి. ఆనవాయితీ కారణంగా మాంసాహారులైన ప్రతి ఒక్కరూ ఎంతో కొంత పరిమాణంలో చేపలు కొనుగోలు చేయడం కనిపించింది. దీంతో అన్ని మార్కెట్లలో చేపల వ్యాపారం జోరుగా సాగింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement