బ్లాక్ మార్కెట్‌కు రైతుబజార్ ఉల్లి
సాక్షి, సిటీబ్యూరో : రైతుబజార్లకు మార్కెటింగ్ శాఖ సరఫరా చేస్తున్న ఉల్లి నేరుగా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోంది. నెల రోజులుగా ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు పసిగట్టలేకపోయారు. ముఖ్యంగా రైతుబజార్ల సిబ్బందిపై నిఘా లేకపోవడంతో వారు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని జేబులు నింపుకొంటున్నారు. ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగి నగరంలోని మహబూబ్‌మాన్షన్ హోల్‌సేల్ మార్కెట్లో రోజుకు 75-100 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేస్తోంది.
వీటిని ఒక్కో రైతు బజార్‌కు 10-15 క్వింటాళ్ల చొప్పున సరఫరా చేసి ‘నో లాస్... నో ప్రాఫిట్’ ప్రాతిపదికన వినియోగదారులకు అందిస్తున్నారు. అంటే హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లి ధర ఎంత ఉంటే... అంతే మొత్తానికి రైతుబజార్‌లో విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. సరుకు సరఫరా చేసిన అధికారులు వాటి విక్రయాలపై నిఘా పెట్టలేదు. దీంతో రైతుబజార్ సిబ్బంది గుట్టుగా చ క్రం తిప్పి ఆ సరుకును బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ ఉల్లి సరఫరా చేయగానే కేవలం 2గంటల సేపు విక్రయాలు జరిపి ఆ తర్వాత ‘నో స్టాక్’ బోర్డును వేలాడదీస్తున్నారు.
దీంతో సరుకు అయిపోయిందనుకొని వినియోగదారులు వెనుదిరుగుతున్నారు. అవసరమైనవారు కేజీకి రూ.50-60 అధికమొత్తం చెల్లించి రైతుబజార్‌లోని వ్యాపారుల వద్ద ఉల్లి కొనుగోలు చేస్తున్నారు. నిజానికి రైతుబజార్‌కు వచ్చిన సరుకు వచ్చినంత వేగంగానే బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతోంది. కొందరు ఆటోల ద్వారా హోటళ్లు, రిటైల్ షాపులకు సరుకు తరలిస్తుండగా, మరికొందరు సంచార రైతుబజార్ల ద్వారా బయటకు తరలించి వివిధ ప్రాంతాల్లో అమ్మేస్తున్నారు.
ఈ అక్రమ వ్యవహారం ప్రధానంగా ఎర్రగడ్డ, మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సరూర్‌నగర్, వనస్థలిపురం రైతుబజార్లలో జోరుగా సాగుతోంది. మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా వీరివైపు కన్నెత్తి చూడకపోవడంతో వీరు ఇష్టారీతిన కూరగాయల ధరలు నిర్ణయించడం, అలాగే తక్కువ ధరకు విక్రయించాల్సిన ఉల్లిని బయటకు తరలించి రెండు విధాలుగా దండుకొంటున్నారు.
గుట్టుగా స్వాహా
మార్కెటింగ్ శాఖ సరఫరా చేస్తున్న ఉల్లి రైతుబజార్‌లో కేజీ రూ.27.50కి లభిస్తుండగా ఇదే సరుకు రిటైల్ మార్కెట్లో కేజీ రూ.50-60లకు అమ్ముతున్నారు. ఉల్లికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రైతుబజార్ల ఉల్లిని కొనేందుకు హోటళ్లవారు ఎగబడుతున్నారు. నిజానికి రైతుబజార్ కౌంటర్‌లో ఓ బస్తా (50 కేజీలు) ఉల్లిని తూకం వేసి అమ్మేందుకు 30 నిముషాల సమయం పడుతోంది. ఈ ప్రకారం గంటకు 2బస్తాల ఉల్లిని మాత్రమే అమ్మేందుకు అవకాశం ఉంది.
అంటే ఉదయం 2గంటలు సాయంత్రం 2గంటల సేపు విక్రయాలు సాగించినా... రోజుకు ఎనిమిది బస్తాల సరుకు మాత్రమే అమ్మే వీలుంది. అయితే... ఒక్కో రైతుబజార్‌కు రోజుకు 20 బస్తాల ఉల్లిపాయలు సరఫరా అవుతున్నాయి. ఎనిమిది బస్తాల సరుకు అయిపోయినా మిగిలిన పన్నెండు బస్తాల ఉల్లి ఏమౌతుందన్నది సమాధానం లేని ప్రశ్న. స్టాక్ వచ్చిన రెండు గంటల్లోనే నో స్టాక్ బోర్డు వేలాడదీస్తూ వచ్చిన సరుకులో సగానిపైగా బయటకు తరలిస్తున్నారు. అయితే... సరుకు అయిపోయిందంటూ ఎర్రగడ్డ, మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సరూర్‌నగర్, వనస్థలిపురం రైతుబజార్ల నుంచి నిత్యం ఇంటెండ్ ఇస్తుండటం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే ఆయా రైతుబజార్లలో అక్రమాల తీరు ఎలా ఉందో అంచనా వేయవచ్చు.