న్యూఢిల్లీ: ధరల భయాలు డిసెంబర్‌లో తక్కువగా ఉన్నాయని సోమవారం విడుదలైన అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. ఈ నెలలో టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం రెండూ తగ్గుముఖం పట్టాయని లెక్కలు వెల్లడించాయి. దీనితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.50) తగ్గింపునకు ఇది అవకాశమని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. తద్వారా దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడాలని కోరుతున్నాయి. నవంబర్ పారిశ్రామిక ఉత్పత్తి ఏడు నెలల కనిష్ట స్థాయి అరశాతంగా నమోదయిన విషయాన్ని పారిశ్రామిక వర్గాలు ప్రస్తావిస్తూ, ఈ రంగానికి చేయూత నివ్వాల్సిన తక్షణ అవసరాన్ని ఉద్ఘాటిస్తున్నాయి. జనవరి–మార్చికి సంబంధించి డీఅండ్‌బీ వ్యాపార ఆశావహ పరిస్థితి కూడా ఇక్కడ గమనార్హం. కొత్త గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఫిబ్రవరి 7వ తేదీన ద్వైమాసిన ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుదలైన స్థూల ఆర్థిక గణాంకాలను చూస్తే...
వరుసగా రెండవ నెల తగ్గిన టోకు ధరలు
► వరుసగా రెండు నెలల నుంచీ తగ్గిన టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు రేటు కోత అవకాశాలపై పారిశ్రామిక వర్గాల్లో ఆశావహ స్థితిని సృష్టిస్తున్నాయి. అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు 5.54 శాతం ఉంటే, నవంబర్‌లో 4.64 శాతంగా నమోదయ్యింది.
► మొత్తంగా...: 2018 డిసెంబర్‌లో (2017 ఇదే నెల ధరలతో పోల్చి) టోకు వస్తువుల బాస్కెట్ ధర కేవలం 3.80 శాతమే పెరిగింది. అంతక్రితం ఎనిమిది నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో టోకు ధరల నమోదు ఇదే తొలిసారి. ఇంధనం, కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు టోకున తగ్గడం దీనికి ప్రధాన కారణం.
► ప్రైమరీ ఆర్టికల్స్: సూచీలో ఆహార, ఆహారేతర ఉత్పత్తులకు సంబంధించిన ఈ విభాగంలో పెరుగుదల రేటు 2.28 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటు 3.86 శాతం.
ఇక ఇందులో ఒక్క ఆహార విభాగాన్ని చూసుకుంటే పెరుగుదల అసలు లేకపోగా –0.07 శాతం తగ్గుదల నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ విభాగంలో ధరల పెరుగుదల రేటు 4.72 శాతం. కూరగాయల ధరలు వరుసగా ఆరు నెలల నుంచీ తగ్గుతూ వస్తున్నాయి. నవంబర్‌లో పెరుగుదల రేటు 26.98 శాతం ఉంటే, డిసెంబర్‌లో ఈ రేటు 17.55 శాతంగా ఉంది. టమోటా ధరలు నవంబర్‌లో పెరుగుదల రేటు 88 శాతంగా ఉంటే, డిసెంబర్‌లో 49 శాతానికి తగ్గాయి. ఇక పప్పు దినుసుల పెరుగుదల రేటు 2.1 శాతంగా ఉంది. గుడ్లు, మాంసం, చేపల ధరల పెరుగుదల రేటు 4.55 శాతం. ఉల్లిపాయల ధరలు మాత్రం 64 శాతం తగ్గాయి. అయితే నాన్ ఫుడ్ ఆర్టికల్స్ విషయంలో మాత్రం ద్రవ్యోల్బణం 4.45 శాతం పెరిగింది. 2017 డిసెంబర్‌లో ఇది క్షీణతలో –0.17శాతంగా నమోదయ్యింది.
► ఇంధనం, విద్యుత్: ఈ విభాగంలో రేటు 8.03 శాతం నుంచి 8.38 శాతానికి ఎగిసింది. 2018 నవంబర్‌లో ఈ రేటు ఏకంగా 16.28 శాతం ఉండటం గమనార్హం.
► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60% వాటా ఉన్న తయారీ రంగంలో ధరల పెరుగుదల వార్షికంగా 2.79% నుంచి 3.59%కి పెరిగింది. అయితే నెలవారీగా చూస్తే, నవంబర్‌లో ఈ రేటు 4.21%.
రిటైల్‌గా చూసినా తగ్గిన ధరల స్పీడ్..
ఇక వినియోగ ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు 2018 డిసెంబర్‌లో 2.19%. అంటే 2017 ఇదే నెలతో పోల్చితే రిటైల్‌గా ధరల బాస్కెట్ 2.19% పెరిగిందన్నమాట. గడచిన 18 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ధరలు పెరగడం ఇదే తొలిసారి. పండ్లు, కూరగాయలు, ఇంధనం ధరల స్పీడ్ తగ్గడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది. 2018 నవంబర్‌లో రిటైల్ ధరల స్పీడ్ 2.33 శాతం ఉండగా, డిసెంబర్‌లో 5.21 శాతంగా నమోదయ్యింది. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం– ఆహార ఉత్పత్తుల ధరలు పెరక్కపోగా –2.51 శాతం తగ్గాయి. ఇంధనం, లైట్ ద్రవ్యోల్బణం స్పీడ్ 7.39%(నవంబర్‌లో) నుంచి 4.54%కి (డిసెంబర్) తగ్గింది.
రేట్ల కోతకు ‘ధర’ల ఊతం!!
Published Tue, Jan 15 2019 4:50 AM | Last Updated on Tue, Jan 15 2019 5:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment