న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 1.48 శాతం ఎగసింది. అంటే 2019 అక్టోబర్‌తో పోల్చితే 2020 అక్టోబర్‌లో టోకు వస్తువుల బాస్కెట్ ధర 1.48 శాతం పెరిగిందన్నమాట. ఎనిమిది నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. తయారీ ఉత్పత్తుల ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం. ఆర్థిక మందగమనం, వ్యవస్థలో డిమాండ్ లేకపోవడం, కరోనా ప్రతికూలతలు వంటి అంశాల నేపథ్యంలో టోకు ధరల సూచీ ‘జీరో’ లేదా ప్రతిద్రవ్యోల్బణం స్థాయిలో నమోదవుతోంది. సూచీలోని ఒక్క ఆహార ఉత్పత్తుల ధరలు మాత్రమే పెరుగుదలను సూచిస్తున్నాయి. అయితే వ్యవస్థలో కొంత డిమాండ్ నెలకొనడంతోపాటు, బేస్ ఎఫెక్ట్ (2019 అక్టోబర్‌లో ‘జీరో’ ద్రవ్యోల్బణం) కూడా తాజాగా సూచీ పెరుగుదలకు ఒక కారణమవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆవిష్కరించిన తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...
► మొత్తం సూచీలో దాదాపు 12% వెయిటేజ్ ఉన్న ఆహార ఉత్పత్తుల ధరలు టోకును 6.37% పెరిగాయి. ఒక్క కూరగాయల ధరలు 25.23 శాతం పెరిగితే, ఆలూ ధరలు ఏకంగా 107.70% ఎగశాయి (2019 అక్టోబర్ ధరలతో పోల్చితే).
► సూచీలో 12% వెయిటేజ్ ఉన్న నాన్–ఫుడ్ ఆర్టికల్స్, మినరల్స్ ధరలు 2.85 శాతం, 9.11 శాతం చొప్పున ఎగశాయి.
► మొత్తం సూచీలో దాదాపు 62 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో ధరలు 2.12 శాతం ఎగశాయి.
► 14% వెయిటేజ్ ఉన్న ఫ్యూయల్ అండ్ పవర్ ఇండెక్స్‌లో అసలు పెరుగుదల లేకపోగా 10.95% క్షీణించాయి.
ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చు...
ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) తగ్గింపు ప్రక్రియకు ఇక తెరపడినట్లేనని నిపుణులు అంచనావేస్తున్నారు. వచ్చే నెల్లో జరగనున్న ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో యథాతథ రేటును కొనసాగించే వీలుందన్నది వారి విశ్లేషణ. టోకు ధరలే తీవ్రంగా ఉంటే, ఇక రిటైల్ ధరలు మరింత పెరుగుతాయని వారు విశ్లేషిస్తున్నారు. ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలని కేంద్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి నిర్దేశిస్తోంది.
అయితే ఈ స్థాయికి మించి ఈ రేటు నమోదవుతోంది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో ఎనిమిది నెలల గరిష్టం 7.27 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) రెపోరేటు తగ్గించిన ఆర్‌బీఐ, రిటల్ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్టు, అక్టోబర్ నెలల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగించింది. అయితే సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్‌బీఐ అంచనావేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment