న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తరహాలోనే టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం స్పీడ్ కూడా దిగువముఖం పట్టింది. జూలైలో ఐదు నెలల కనిష్ట స్థాయిలో 13.93 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 జూలైతో పోల్చితే 2022 జూలైలో టోకు ధరల బాస్కెట్ ధర పెరుగుదల 13.93 శాతమన్నమాట. నెలవారీగా ఆహార, తయారీ ఉత్పత్తుల ధరల తగ్గుదల తాజా సానుకూల గణాంకానికి ప్రధాన కారణమని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
టోకు ధరల సూచీ తగ్గుదల ఇది వరుసగా రెండవనెల. మేలో సూచీ 15.88 శాతం రికార్డు గరిష్టానికి చేరింది. అయితే జూన్‌లో 15.18 శాతానికి తగ్గింది. తాజా సమీక్షా నెల్లో మరికొంత (13.93) దిగివచ్చింది. అయితే రెండంకెలపైనే డబ్ల్యూపీఐ స్పీడ్ కొనసాగడం వరుసగా 16వ నెల. రిటైల్ ద్రవ్యోల్బణం కూడా మేలో 7.04%కి చేరింది. అయితే జూన్‌లో 7.01%కి, జూలైలో 6.71 శాతానికి తగ్గింది. సరఫరాల పరంగా ప్రభుత్వం, ద్రవ్య పాలసీవైపు ఆర్‌బీఐ, పంట దిగుబడులు ద్రవ్యోల్బణం దిగిరావడానికి కారణమని భావిస్తున్నారు.
►ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం జూన్‌లో 14.39 శాతం ఉంటే, జూలైలో 10.77 శాతానికి తగ్గింది. ఇందులో కూరగాయల ధరల స్పీడ్ 18.25 శాతం. జూన్‌లో ఈ స్పీడ్ ఏకంగా 56.75 శాతంగా ఉంది.
►ఇంధన, విద్యుత్ బాస్కెట్ ద్రవ్యోల్బణం జూన్‌లో 40.38% ఉంటే, జూలైలో 43.75%కి పెరిగింది.
►సూచీలో మెజారిటీ వెయిటేజ్ ఉన్న తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 8.16 శాతానికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment