Private equity and venture capital funds investments declined 4% to $5.3 billion in March - Sakshi
Sakshi News home page

సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ సంక్షోభం.. భారత్‌లో తగ్గిన ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడులు

Published Tue, Apr 18 2023 7:57 AM | Last Updated on Tue, Apr 18 2023 10:49 AM

Private Equity And Venture Capital Funds Investments Declined To 5.3 Billion In March 2023 - Sakshi

ముంబై: దేశయంగా ప్రయివేట్‌ ఈక్విటీ(పీఈ), వెంచర్‌ క్యాపిటల్‌(వీసీ) ఫండ్స్‌ పెట్టుబడులు గత నెలలో 4 శాతం నీరసించాయి. 5.3 బిలియన్‌ డాలర్లకు(రూ. 43,460 కోట్లు) పరిమితమయ్యాయి. 2022 మార్చితో పోలిస్తే లావాదేవీలు సైతం 125 నుంచి 82కు క్షీణించాయి. ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన నివేదిక వెల్లడించిన అంశాలివి. వీటి ప్రకారం జనవరి–మార్చి త్రైమాసికంలో డీల్స్‌ 21 శాతం తగ్గాయి. పెట్టుబడుల విలువ 13.3 బిలియన్‌ డాలర్లకు చేరింది. యూఎస్‌లో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌(ఎస్‌వీబీ) దివాలా అనిశ్చితికి దారితీసినట్లు ఈవై పార్టనర్‌ వివేక్‌ సోనీ పేర్కొన్నారు. దీంతో స్టార్టప్‌లకు నిధుల లభ్యత కఠినతరమైనట్లు తెలియజేశారు. అనిశ్చిత వాతావరణంలో స్టార్టప్‌ల విభాగంలో కన్సాలిడేషన్‌కు తెరలేచే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. నగదు అధికంగా ఖర్చయ్యే కంపెనీలు నిధుల సమీకరణలో సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు. వెరసి సంస్థల మధ్య విలీనాలు, కొనుగోళ్లు వంటివి నమోదుకావచ్చని తెలియజేశారు. ప్రధానంగా వాటాల మార్పిడి(షేర్ల స్వాప్‌) ద్వారా బిజినెస్‌లు, కంపెనీల విక్రయాలు జరిగే అవకాశమున్నట్లు వివరించారు.   

ధరల వ్యత్యాసం.. 
గత నెలలో డీల్స్‌ నీరసించడానికి కారణాలున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రమోటర్లు ఆశించే ధర, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిన బిడ్స్‌ మధ్య వ్యత్యాసాలు ప్రభావం చూపినట్లు తెలియజేసింది. 2023 మార్చిలో 10 కోట్లకుపైగా విలువగల 14 భారీ డీల్స్‌ జరిగాయి. వీటి విలువ 4.3 బిలియన్‌ డాలర్లు. 2022 మార్చిలో 2.9 బిలియన్‌ డాలర్ల విలువైన 13 లార్జ్‌ డీల్స్‌ నమోదయ్యాయి. తాజా డీల్స్‌లో గ్రీన్‌కో ఎనర్జీలో జీఐసీ, ఏడీఐఏ, ఓరిక్స్‌ చేపట్టిన 70 కోట్ల డాలర్ల పెట్టుబడులు, అదానీ గ్రూప్‌ కంపెనీలలో జీక్యూసీ పార్టనర్స్‌1.3 బిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉన్నాయి.  

పైప్‌ జోరు 
విలువరీత్యా గత నెలలో పబ్లిక్‌ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ప్రయివేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌(పీఐపీఈ–పైప్‌) జోరు చూపాయి. 10 డీల్స్‌ ద్వారా 2.4 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. 2022 మార్చిలో 8 లావాదేవీల ద్వారా 70 కోట్ల డాలర్ల పెట్టుబడులే నమోదయ్యాయి. తాజా డీల్స్‌లో మౌలికరంగం మొత్తం పెట్టుబడులను ఆకట్టుకుంది. ఇక ఈ మార్చిలో 1.75 బిలియన్‌ డాలర్ల విలువైన 30 అమ్మకపు(ఎగ్జిట్‌) లావాదేవీలు నమోదయ్యాయి. వీటిలో సోనా బీఎల్‌డబ్ల్యూ ప్రెసిషన్‌ ఫోర్జింగ్స్‌ టాప్‌లో నిలిచింది. మరోవైపు మూడు డీల్స్‌ ద్వారా 1.95 బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణ జరిగింది. 2022 మార్చిలో దాదాపు 1.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను మాత్రమే సమకూర్చుకున్నాయి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement