venture capital funds
-
ఫ్లాట్‌గా వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలు జూన్ క్వార్టర్లో 8 బిలియన్ డాలర్ల వీసీ నిధులను సంపాదించాయి. మార్చి త్రైమాసికంతో పోలిస్తే పెరగ్గా, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే స్తబ్దుగానే ఉన్నట్టు కేపీఎంజీ నివేదిక తెలిపింది. టాప్ డీల్స్‌లో బైజూస్ 700 మిలియన్ డాలర్లు, లెన్స్‌కార్ట్ 600 మిలియన్ డాలర్లు, ట్రూబ్యాలన్స్ 168 మిలియన్ డాలర్ల సమీకరణ ఉన్నాయి. ఫిన్‌టెక్, ఎడ్యుటెక్, గేమింగ్ కంపెనీలు దేశంలో ఎక్కువ వీసీ నిధులను ఆకర్షించాయి. ఆ తర్వాత అగ్రిటెక్ కూడా వీసీ ఇన్వెస్టర్ల ప్రాధాన్య క్రమంలో ఉంది. ఈ వివరాలను కేపీఎంజీ సంస్థ ‘వెంచర్పల్స్ క్యూ 2023’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయంగా వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు జూన్ త్రైమాసికంలో స్వల్పంగా తగ్గి 77.4 బిలియన్ డాలర్లుగా (రూ.6.34 లక్షల కోట్లు) ఉన్నాయి. మొత్తం 7,783 డీల్స్ నమోదయ్యాయి. అంతర్జాతీయంగా అనిశి్చత పరిస్థితుల్లోనూ భారీ డీల్స్‌కు ఇన్వెస్టర్ల నుంచి మద్దతు ఉందని ఈ నివేదిక తెలిపింది. అమెరికాకు చెందిన స్ట్రైప్ 6.8 బిలియన్ డాలర్లను జూన్ త్రైమాసికంలో సంపాదించింది. సింగపూర్‌కు చెందిన షీన్ 2 బిలియన్ డాలర్లు, అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ ఇన్ఫ్లెక్షన్ 1.3 బిలియన్ డాలర్ల నిధులను సొంతం చేసుకున్నాయి. కొత్త నిధుల సమీకరణ విషయంలో ప్రముఖ వీసీ సంస్థలు కొంత వేచి చూసే ధోరణితో ఉన్నట్టు కేపీఎంజీ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా అధిక ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అస్థిరతలు, వడ్డీ రేట్లను ఇంకా పెంచే అవకాశాలు ఉండడంతో సవాళ్లు ఇప్పట్లో ముగిసే పరిస్థితులు కనిపించడం లేదని ఈ నివేదిక అభిప్రాయపడింది. -
భారత కంపెనీల్లో తగ్గిన పీఈ పెట్టుబడులు
ముంబై: భారత కంపెనీల్లో ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు (పీఈ, వీసీ) ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలల్లో 23 శాతం మేర తగ్గి (క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు) 27.5 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. విలువ పరంగా చూస్తే గతేడాది ద్వితీయ ఆరు నెలల కాలంలోని పెట్టుబడులు 20.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే 33 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. గతేడాది తొలి ఆరు నెలల్లో పీఈ, వీసీ పెట్టుబడులు 35.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ వివరాలను పరిశ్రమ మండలి అయిన ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేటివ్ క్యాపిటల్ అసోసియేషన్ (ఏవీసీఏ), కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా విడుదల చేశాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో పీఈ, వీసీ పెట్టుబడుల లావాదేవీలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు సంఖ్యా పరంగా 44 శాతం తగ్గాయి. మొత్తం 427 లావాదేవీలు నమోదయ్యాయి. మొత్తంమీద పీఈ, వీసీ పెట్టుబడుల ధోరణి సానుకూలంగానే ఉందని, ముఖ్యంగా స్టార్టప్‌ల్లోకి పెట్టుబడులు తగ్గినట్టు ఈవై పార్ట్నర్ వివేక్ సోని తెలిపారు. పీఈ, వీసీ సంస్థలు ఈ ఏడాది ఆరు నెలల్లో 10.2 బిలియన్ డాలర్లను సమీకరించాయి. ఇది రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులకు మద్దతుగా నిలుస్తుందని ఈ నివేదిక తెలిపింది. నెలవారీగా చూస్తే పీఈ, వీసీ పెట్టుబడుల విలువ జూన్‌లో 3.1 బిలియన్ డాలర్లుగా ఉందని, మే నెలతో పోలిస్తే 9 శాతం తక్కువని పేర్కొంది. -
తగ్గిన పీఈ పెట్టుబడులు
ముంబై: భారత్‌లోకి ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పెట్టుబడుల ప్రవాహం మే నెలలో తగ్గింది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే గత నెలలో 44 శాతం, ఈ ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే 52 శాతం మేర పెట్టుబడులు తగ్గాయి. 3.5 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2022 మే నెలలో ఇవి 6.2 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 7.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పరిశ్రమ లాబీ ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. చాలా మటుకు ఫండ్స్ గత ఏడాదిన్నరగా పుష్కలంగా నిధులు సమీకరించినప్పటికీ వాటిని ఇన్వెస్ట్ చేసే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయని ఈవై పార్ట్నర్ వివేక్ సోని తెలిపారు. వృద్ధి, మార్జిన్లను మెరుగుపర్చుకునేందుకు నానా తంటాలు పడుతున్న ప్రస్తుత పోర్ట్‌ఫోలియో కంపెనీలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని వివరించారు. పెట్టుబడులపరంగా టెక్ రంగంలో కాస్త స్తబ్దత నెలకొందని పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ, ఆరి్థక సేవల విభాగాల్లోకి కాస్త పెట్టుబడులు వచి్చనట్లు సోని వివరించారు. మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే పెట్టుబడుల ప్రవాహం ఆశావహంగానే కనిపిస్తోందని, 2023లో మొత్తం పెట్టుబడులు గతేడాది కన్నా ఎక్కువగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► మే నెలలో మొత్తం 71 లావాదేవీలు జరిగాయి. గతేడాది మే నెలతో పోలిస్తే 42 శాతం తగ్గాయి. ► వృద్ధి దశలోని సంస్థల్లో పెట్టుబడులు 4 శాతం తగ్గాయి. 17 డీల్స్ కుదరగా 1.9 బిలియన్ డాలర్లు వచ్చాయి. 2022 మే లో 19 ఒప్పందాలు కుదరగా, 2 బిలియన ్డాలర్లు వచ్చాయి. ► రియల్ ఎస్టేట్‌పై ఫండ్స్ అత్యధికంగా ఆసక్తి చూపాయి. ఏడు డీల్స్ ద్వారా 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. 2022 మే నెలలో 12 డీల్స్ ద్వారా 1.1 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి. 864 మిలియన్ డాలర్ల పెట్టుబడులు, 15 డీల్స్‌తో టెక్నాలజీ రంగం రెండో స్థానంలో నిల్చింది. ఈ రంగంలో పెట్టుబడులు 159 శాతం పెరిగాయి. ► ఫండ్స్ గతేడాది మేలో 745 మిలియన్ డాలర్లు సమీకరించగా.. ఈసారి 2.2 బిలియన్ డాలర్లు సమీకరించాయి. -
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభం.. భారత్‌లో తగ్గిన ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు
ముంబై: దేశయంగా ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ పెట్టుబడులు గత నెలలో 4 శాతం నీరసించాయి. 5.3 బిలియన్ డాలర్లకు(రూ. 43,460 కోట్లు) పరిమితమయ్యాయి. 2022 మార్చితో పోలిస్తే లావాదేవీలు సైతం 125 నుంచి 82కు క్షీణించాయి. ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన నివేదిక వెల్లడించిన అంశాలివి. వీటి ప్రకారం జనవరి–మార్చి త్రైమాసికంలో డీల్స్ 21 శాతం తగ్గాయి. పెట్టుబడుల విలువ 13.3 బిలియన్ డాలర్లకు చేరింది. యూఎస్‌లో సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ) దివాలా అనిశ్చితికి దారితీసినట్లు ఈవై పార్టనర్ వివేక్ సోనీ పేర్కొన్నారు. దీంతో స్టార్టప్‌లకు నిధుల లభ్యత కఠినతరమైనట్లు తెలియజేశారు. అనిశ్చిత వాతావరణంలో స్టార్టప్‌ల విభాగంలో కన్సాలిడేషన్‌కు తెరలేచే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. నగదు అధికంగా ఖర్చయ్యే కంపెనీలు నిధుల సమీకరణలో సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు. వెరసి సంస్థల మధ్య విలీనాలు, కొనుగోళ్లు వంటివి నమోదుకావచ్చని తెలియజేశారు. ప్రధానంగా వాటాల మార్పిడి(షేర్ల స్వాప్) ద్వారా బిజినెస్‌లు, కంపెనీల విక్రయాలు జరిగే అవకాశమున్నట్లు వివరించారు. ధరల వ్యత్యాసం.. గత నెలలో డీల్స్ నీరసించడానికి కారణాలున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రమోటర్లు ఆశించే ధర, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిన బిడ్స్ మధ్య వ్యత్యాసాలు ప్రభావం చూపినట్లు తెలియజేసింది. 2023 మార్చిలో 10 కోట్లకుపైగా విలువగల 14 భారీ డీల్స్ జరిగాయి. వీటి విలువ 4.3 బిలియన్ డాలర్లు. 2022 మార్చిలో 2.9 బిలియన్ డాలర్ల విలువైన 13 లార్జ్ డీల్స్ నమోదయ్యాయి. తాజా డీల్స్‌లో గ్రీన్కో ఎనర్జీలో జీఐసీ, ఏడీఐఏ, ఓరిక్స్ చేపట్టిన 70 కోట్ల డాలర్ల పెట్టుబడులు, అదానీ గ్రూప్ కంపెనీలలో జీక్యూసీ పార్టనర్స్1.3 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. పైప్ జోరు విలువరీత్యా గత నెలలో పబ్లిక్ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ప్రయివేట్ ఇన్వెస్ట్మెంట్(పీఐపీఈ–పైప్) జోరు చూపాయి. 10 డీల్స్ ద్వారా 2.4 బిలియన్ డాలర్లు వచ్చాయి. 2022 మార్చిలో 8 లావాదేవీల ద్వారా 70 కోట్ల డాలర్ల పెట్టుబడులే నమోదయ్యాయి. తాజా డీల్స్‌లో మౌలికరంగం మొత్తం పెట్టుబడులను ఆకట్టుకుంది. ఇక ఈ మార్చిలో 1.75 బిలియన్ డాలర్ల విలువైన 30 అమ్మకపు(ఎగ్జిట్) లావాదేవీలు నమోదయ్యాయి. వీటిలో సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్ టాప్‌లో నిలిచింది. మరోవైపు మూడు డీల్స్ ద్వారా 1.95 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణ జరిగింది. 2022 మార్చిలో దాదాపు 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను మాత్రమే సమకూర్చుకున్నాయి. -
పీఈ, వీసీ పెట్టుబడులు డౌన్
ముంబై: దేశీయంగా ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ పెట్టుబడులు గత నెలలో భారీగా క్షీణించాయి. 44 శాతం నీరసించి 3.7 బిలియన్ డాలర్ల(రూ. 30,560 కోట్లు)కు పరిమితమయ్యాయి. గతేడాది(2022) ఫిబ్రవరిలో ఇవి 6.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది(2023) జనవరిలో లభించిన 4.31 బిలియన్ డాలర్లతో పోల్చినా తాజా పెట్టుబడులు 13 శాతం తగ్గాయి. పరిశ్రమల లాబీ.. ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ క్యాపిటల్ అసోసియేషన్, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన నివేదికలోని వివరాలివి. ఇతర అంశాలు చూద్దాం.. కారణాలివీ.. ప్రపంచ ఆర్థిక మాంద్యంపై ఆందోళనలు, పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలు, అమ్మకందారులు, కొనుగోలుదారుల మధ్య అంచనాలను అందుకోని వేల్యుయేషన్లు వంటి అంశాలు పీఈ, వీసీ పెట్టుబడుల క్షీణతకు కారణమైనట్లు ఈవై పార్ట్నర్ వివేక్ సోని పేర్కొన్నారు. ఇటీవల సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ) వైఫల్యంతో గ్లోబల్ ఫైనాన్షియల్ పరిస్థితులలో మార్పులు వచ్చినట్లు తెలియజేశారు. ఈ ప్రభావం యూఎస్‌లోని టెక్నాలజీ కంపెనీలకు నిధులు అందించే మధ్యస్థాయి బ్యాంకులపై పడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇది అనిశ్చితికి దారితీసినట్లు తెలియజేశారు. వెరసి మధ్యకాలానికి పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం కనిపించనున్నట్లు అంచనా వేశారు. డీల్స్ వెనకడుగు ఈవై నివేదిక ప్రకారం గత నెలలో డీల్స్ 60 శాతం క్షీణించి 55కు పరిమితమయ్యాయి. 2022 ఫిబ్రవరిలో ఇవి 139కాగా.. ఈ జనవరిలో 75 లావాదేవీలు నమోదయ్యాయి. రంగాలవారీగా చూస్తే ఈ ఫిబ్రవరిలో రియల్టీ అత్యధికంగా 2.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అందుకుంది. వీటిలో కార్యాలయ ఆస్తుల ఏర్పాటుకు సీడీపీక్యూ అనుబంధ సంస్థతో కలసి టెమాసెక్ ప్రకటించిన 1.9 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ ప్రణాళికలున్నాయి. మరోపక్క 10 కోట్ల డాలర్ల భారీ డీల్స్ 9 మాత్రమే నమోదయ్యాయి. అయితే 11 అమ్మకపు లావాదేవీలకూ తెరలేచింది. వీటి విలువ 73.1 కోట్ల డాలర్లుకాగా.. గతేడాది ఫిబ్రవరిలో 1.4 బిలియన్ డాలర్ల విలువైన 13 ఎగ్జిట్ డీల్స్ నమోదయ్యాయి. ఈ జనవరిలో 89.8 కోట్ల డాలర్ల విలువైన 20 అమ్మకపు లావాదేవీలు జరిగాయి. అయితే ఇండియాకు మాత్రమే కేటాయించిన ఫండ్స్ గత నెలలో 88.1 కోట్ల డాలర్లు సమకూర్చుకోగా.. గతేడాది ఫిబ్రవరిలో 34.7 కోట్ల డాలర్లు మాత్రమే సమీకరించాయి. వీటిలో డేటా సెంటర్ల కోసం కొటక్ ఆల్టర్నేట్ అసెట్ సమీకరించిన 59 కోట్ల డాలర్లు అత్యధికం. -
డబ్బే డబ్బు!! స్టార్టప్లోకి పెట్టుబడుల వరద!
ముంబై: ఇటీవల దేశీ స్టార్టప్ వ్యవస్థలోకి భారీగా తరలి వస్తున్న ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) పెట్టుబడులు ఫిబ్రవరిలో మరింత జోరందుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన ఫిబ్రవరిలో రెట్టింపై 5.8 బిలియన్ డాలర్లను తాకాయి. గతేడాది(2021) ఫిబ్రవరిలో ఇవి 2.5 బిలియన్ డాలర్లు మాత్రమే. ఐవీసీఏ–ఈవై రూపొందించిన నెలవారీ గణాంకాలివి. వీటి ప్రకారం ఫిబ్రవరిలో డీల్ పరిమాణం 33 శాతం ఎగసి 117కు చేరాయి. అయితే 2022 జనవరిలో నమోదైన 122 డీల్స్‌తో పోలిస్తే స్వల్పంగా క్షీణించాయి. కాగా.. పీఈ, వీసీ పెట్టుబడుల్లో 88 శాతం రియల్టీ, ఇన్ఫ్రా రంగాలను మినహాయించి ప్యూర్‌ప్లే ఇన్వెస్ట్మెంట్స్ కావడం గమనార్హం! గతేడాది ఫిబ్రవరిలో ఈ వాటా 79 శాతమే. 17 భారీ డీల్స్ గత నెలలో మొత్తం 4.4 బిలియన్ డాలర్ల విలువైన 17 భారీ డీల్స్ జరిగాయి. నెలవారీగా చూస్తే ఇవి 24 శాతం అధికం. మొత్తం పెట్టుబడుల్లో దాదాపు సగం అంటే 2.5 బిలియన్ డాలర్లు స్టార్టప్లలోకే ప్రవహించడం విశేషం! కాగా.. 85 డీల్స్ ద్వారా అత్యధిక పెట్టుబడులను స్టార్టప్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఏడు డీల్స్ ద్వారా 1.5 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లు నమోదయ్యాయి. మరోపక్క 1.4 బిలియన్ డాలర్ల విలువైన 10 విక్రయ డీల్స్ సైతం జరిగాయి. వీటిలో మూడు డీల్స్ 1.2 బిలియన్ డాలర్ల విలువైన సెకండరీ విక్రయాలు కావడం గమనార్హం! చదవండి: భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం, క్యూ కడుతున్న సరిహద్దు దేశాలు! -
స్టార్టప్‌లకు శుభవార్త! పెట్టుబడులకు వీరు సిద్ధమట?
న్యూఢిల్లీ: అత్యంత సంపన్న ఇన్వెస్టర్లు (యూహెచ్‌ఎన్‌ఐ), కుటుంబ కార్యాలయాలు .. ఇన్వెస్ట్ చేసేందుకు ప్రత్యామ్నాయ సాధనాల వైపు మళ్లుతున్నాయి. స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ మొదలైన ప్రైవేట్ మార్కెట్ పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నాయి. ఏజెడ్‌బీ అండ్ పార్ట్నర్స్, ఈవై, ట్రికా నిర్వహించిన ప్రైవేట్ మార్కెట్ మానిటర్ సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. స్టార్టప్‌లకు ప్రాధాన్యం ఈ సర్వేల ప్రకారం స్టార్టప్ వ్యవస్థ ముఖచిత్రం మారుతుండటం, తామరతంపరగా పబ్లిక్ ఇష్యూలు వస్తుండటం మొదలైన అంశాలు కొత్త రకం ఇన్వెస్టర్లను తెరపైకి తెచ్చాయి. కొత్త తరం యూహెచ్‌ఎన్‌ఐలు తమ సంపద నిర్వహణకు కుటుంబ కార్యాలయాలను మరింత క్రియాశీలకంగా ఉపయోగించుకుంటున్నారు. స్టార్టప్‌లలో పెట్టుబడులకు మరింత ప్రాధాన్యమిస్తున్నారు. ‘ప్రత్యామ్నాయ సాధనాలుగా ప్రైవేట్ మార్కెట్ పెట్టుబడులకు ప్రాధాన్యం కొనసాగుతోంది. మొత్తం పెట్టుబడుల్లో స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటల్ (వీసీ) ఫండ్స్ వాటా 18 శాతంగా ఉంది‘ అని నివేదిక పేర్కొంది. ఇన్వెస్టర్ల దూకుడు ఇతర ప్రత్యామ్నాయాలతో పోలిస్తే ప్రైవేట్ మార్కెట్ పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం పెట్టుబడుల్లో లిస్టెడ్ సంస్థల షేర్ల వాటా 36 శాతం, ఫిక్సిడ్ ఇన్‌కం సాధనాల వాటా 20 శాతం కాగా, ఇతర ప్రత్యామ్నాయాలు (రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా, ఆర్ట్ మొదలైనవి) 15 శాతం దక్కించుకున్నాయి. ఇక 83 శాతం ఫ్యామిలీ ఆఫీసులు పెట్టిన మొత్తం పెట్టుబడుల్లో ప్రైవేట్ మార్కెట్ల వాటా 10 శాతం పైగా ఉంటోంది. ఇది గత అయిదేళ్లుగా క్రమంగా పెరిగింది. 100 పైగా ఫ్యామిలీ ఆఫీసులు, యూహెచ్‌ఎన్‌ఐలు ఈ సర్వేలో పాల్గొన్నారు. మేనేజ్మెంట్, మార్కెట్ అవకాశాలు.. స్టార్టప్‌లలో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ప్రధానంగా టాప్ మేనేజ్మెంట్ను, అధిక వృద్ధికి అవకాశాలున్న మార్కెట్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఫిన్‌టెక్ (82 శాతం), ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ (71 శాతం) రంగాలు అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. కన్జూమర్ టెక్ (68 శాతం), హెల్త్‌కేర్ (50 శాతం), ఎడ్టెక్ (42 శాతం), అగ్రిటెక్ (35 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చదవండి: స్టార్టప్‌లకు కేంద్రబిందువుగా హైదరాబాద్ -
ఆగస్ట్‌లో డీల్స్ జూమ్
ముంబై: గత నెల(ఆగస్ట్)లో దేశీ కార్పొరేట్ ప్రపంచంలో డీల్స్ భారీగా ఎగశాయి. మొత్తం 219 డీల్స్ జరిగాయి. 2005 తదుపరి ఇవి అత్యధికంకాగా.. 2020 ఆగస్ట్‌తో పోల్చినా రెట్టింపయ్యాయి. వీటి విలువ 8.4 బిలియన్ డాలర్లు. కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ అందించిన వివరాలివి. అయితే ఈ(2021) జులైతో పోలిస్తే లావాదేవీలు పరిమాణంలో 21 శాతం ఎగసినప్పటికీ విలువలో 36 శాతం క్షీణించాయి. ఇందుకు విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) విభాగంలో యాక్టివిటీ ఆరు రెట్లు పడిపోవడం కారణమైంది. ఆగస్ట్‌లో ప్రధానంగా ప్రయివేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ద్వారానే అత్యధిక డీల్స్ నమోదయ్యాయి. 182 లావాదేవీల ద్వారా 7.6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. దేశీ కంపెనీలు, యూనికార్న్(స్టార్టప్‌లు) ఇందుకు వేదికయ్యాయి. లాభదాయక అవకాశాలు, ఆర్థిక రికవరీపై విశ్వాసం, పరిశ్రమల స్థాపనలో నైపుణ్యం వంటి అంశాలు ప్రభావం చూపాయి. యూనికార్న్‌ల స్పీడ్ పారిశ్రామిక పురోగతి, బలపడుతున్న డిమాండ్, ఆర్థిక రికవరీ నేపథ్యంలో ఇకపై సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశమున్నట్లు గ్రాంట్ థార్న్టన్ నిపుణులు శాంతి విజేత పేర్కొన్నారు. వ్యాక్సినేషన్లు, విధానాల మద్దతు, ప్రపంచ దేశాల పురోభివృద్ధి ఇందుకు మద్దతుగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎంఅండ్ఏ విభాగంలో 86.7 కోట్ల డాలర్ల విలువైన 37 డీల్స్ జరిగాయి. 2020 ఆగస్ట్‌లో 90.8 కోట్ల డాలర్ల విలువైన 30 లావాదేవీలు నమోదయ్యాయి. టెక్, ఎడ్యుకేషన్, ఫార్మా, ఎనర్జీ రంగాలలో అధిక డీల్స్ జరిగాయి. గత నెలలో ఏడు స్టార్టప్‌లో యూనికార్న్ హోదాను అందుకున్నాయి. బిలియన్ డాలర్ల విలువను సాధించిన స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. దేశీ స్టార్టప్ వ్యవస్థ 115 డీల్స్ ద్వారా 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకుంది. -
2020: ఎఫ్‌పీఐల పెట్టుబడుల స్పీడ్
ముంబై, సాక్షి: ఈ కేలండర్ ఏడాది(2020)లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) నుంచి దేశీ క్యాపిటల్ మార్కెట్లలోకి భారీగా పెట్టుబడులు తరలివచ్చాయి. ప్రధానంగా ఈక్విటీలలో ఇప్పటివరకూ 22.6 బిలియన్ డాలర్లు ప్రవహించాయి. ఇవి 2019లో నమోదైన 14.23 బిలియన్ డాలర్లతో పోలిస్తే 58 శాతం అధికంకావడం విశేషం! తద్వారా వర్ధమాన మార్కెట్లలో అత్యధిక ఎఫ్‌పీఐల పెట్టుబడులను ఆకట్టుకున్న దేశంగా చైనా తదుపరి భారత్ నిలిచింది. ఇప్పటివరకూ చైనాకు 104 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తరలి వెళ్లాయి. అయితే 2019లో చైనా ఆకట్టుకున్న 132.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి 21 శాతానికిపైగా తక్కువకావడం గమనార్హం! కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ రూపొందించిన గణాంకాలివి. కాగా.. 2019లో 4.4 కోట్ల బిలియన్ డాలర్లను ఆకట్టుకున్న రష్యా 2020లో మరింత అధికంగా 12.25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టింది. తద్వారా మూడో ర్యాంకులో నిలిచింది. చదవండి: (2021: ముకేశ్ ఏం చేయనున్నారు?) ఏప్రిల్ నుంచీ జోరు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ రెండో వారంవరకూ చూస్తే దేశీ ఈక్విటీలలోకి రూ. 2 లక్షల కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు ప్రవహించాయి. వీటిలో ఫైనాన్షియల్ సర్వీసుల రంగం రూ. 63,000 కోట్లను ఆకట్టుకోగా.. రూ. 47,000 కోట్ల పెట్టుబడులతో బ్యాంకింగ్ అగ్రభాగాన నిలిచింది. కోవిడ్-19 కారణంగా నిజానికి ఏప్రిల్, మే నెలల్లో ఎఫ్‌పీఐలు నికర అమ్మకందారులుగా నిలిచారు. అయితే నవంబర్‌లో గత 12 ఏళ్లలోలేని విధంగా 8.1 బిలియన్ డాలర్లను ఎఫ్‌పీఐలు ఇన్వెస్ట్ చేశారు. ఇదే నెలలో భారత్ తదుపరి బ్రెజిల్(6.2 బిలియన్ డాలర్లు), దక్షిణ కొరియా(5.2 బిలియన్ డాలర్లు), తైవాన్(4.5 బిలియన్ డాలర్లు) జాబితాలో చేరాయి. ఇక డిసెంబర్‌లోనూ ఇప్పటివరకూ దేశీ ఈక్విటీలలోకి 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించడం ప్రస్తావించదగ్గ అంశం! 80 శాతం జూమ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ కల్లోలంతో మార్చిలో స్టాక్ మార్కెట్లు పతనమైన సంగతి తెలిసిందే. తదుపరి పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడంతో విదేశీ పెట్టుబడులు ఊపందుకున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ 75 శాతానికిపైగా ర్యాలీ చేసి సరికొత్త గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ 47,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ 14,000 పాయింట్లవైపు చూస్తోంది. ఈ బాటలో ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 81 శాతం దూసుకెళ్లి 31,000 సమీపానికి చేరింది. ఫలితంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ 80 శాతం స్థాయిలో ఎగశాయి. చదవండి: (2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!) చైనా వెనకడుగు ఈ ఏడాది(2020)లో చైనా, హాంకాంగ్‌ల నుంచి ప్రయివేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ నిధులు భారీగా క్షీణించాయి. ఈ రెండు ప్రాంతాల నుంచి దేశానికి తరలివచ్చిన పెట్టుబడులు 2019తో పోలిస్తే 72 శాతం పడిపోయాయి. 95.2 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాదిలో 340 కోట్ల డాలర్ల పెట్టుబడులు లభించాయి. వెంచర్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం మెయిన్‌ల్యాండ్ చైనా నుంచి 64 శాతం తక్కువగా 37.7 కోట్ల డాలర్లు, హాంకాంగ్ నుంచి 75 శాతం తక్కువగా 57.5 కోట్ల డాలర్ల పెట్టుబడులు తరలి వచ్చాయి. కాగా.. చైనీస్ సంస్థలు దేశీయంగా ఇన్వెస్ట్ చేసేందుకు దాఖలు చేసిన 150 అప్లకేషన్లు పెండింగ్‌లో ఉన్నట్లు ఖైటాన్ అండ్ కో తెలియజేసింది. పెట్టుబడులు తగ్గడానికి ప్రధానంగా ప్రెస్ నోట్3 నిబంధనలు కారణమైనట్లు లా సంస్థ ఖైటాన్ అభిప్రాయపడింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ఏప్రిల్‌లో ప్రభుత్వం పీఎన్3ను ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. ఈ నిబంధనల ప్రకారం భారత్‌తో సరిహద్దు కలిగిన విదేశీ సంస్థలు ప్రభుత్వ అనుమతితోనే ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుందని తెలియజేసింది. -
వెంచర్ ఫండ్స్‌కు ప్రోత్సాహం..!
నారాయణ మూర్తి సంఘంకీలక సిఫారసులు ♦ ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ కేపిటల్ ఫండ్స్‌ను ఆకర్షించేలా చర్యలకు సూచనలు ♦ సానుకూల పన్ను విధానాలకు సలహా న్యూఢిల్లీ: ప్రైవేటు ఈక్విటీ (పీఈఎఫ్) అలాగే వెంచర్ క్యాపిటల్ (వీసీఎఫ్) నిధులకు సంబంధించిన నిబంధనల్లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలని ఇన్ఫోసిన్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి నేతృత్వంలోని కమిటీ పేర్కొంది. దేశీయంగా, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి దీర్ఘకాలిక నిధులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఏర్పాటుచేసిన అత్యున్నత స్థాయి కమిటీ సిఫారసు చేసింది. ముఖ్యంగా ఇందుకు తగిన సానుకూల పన్ను వ్యవస్థ ఉండాలని సూచించింది. కొత్తగా పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్రం ప్రతిష్టాత్మక ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమాన్ని నేపథ్యంలో కమిటీ ఈ కీలక సిఫారసులు చేయడం గమనార్హం. సెబీకి సమర్పించిన కమిటీ సిఫార్సుల్లో ముఖ్యాంశాలు చూస్తే... దేశంలో ఫండ్ నిర్వహణా వ్యవస్థలను ప్రోత్సహించాలి. పీఈఎఫ్, వీసీఎఫ్కు సంబంధించి ప్రస్తుత ప్రత్యామ్నాయ పెట్టుబడుల ఫండ్ (ఏఐఎఫ్) వ్యవస్థను సంస్కరించాలి.ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులకు తగిన సెక్యూరిటీ లావాదేవీల పన్నును ప్రవేశపెట్టాలి. తద్వారా ఆదాయాలకు సంబంధించి ఒక పటిష్ట పన్ను విధానాలు అమలు చేయాలి. పెట్టుబడులు సుదీర్ఘకాలం సుస్థిరంగా కొనసాగేందుకు పన్ను ప్రోత్సాహకాలు అవసరం. విదేశీ ఫండ్స్‌ను ఆకర్షించడంలో తీవ్ర వైఫల్యం నెలకొంటోంది. ఏఐఎఫ్స్లో ప్రవాసభారతీయుల పెట్టుబడులకు సంబంధించి నిబంధనలను సరళతరం చేయాలి. ఆయా అంశాల్లో సంక్లిష్టతలు తొలగించాలి. ఈ నివేదికపై ఫిబ్రవరి 10 వరకూ సంబంధిత వర్గాలు సలహాలు, సూచనలు ఇవ్వాలని సెబీ విజ్ఞప్తి చేసింది. 15 ఏళ్లలో 103 బిలియన్ డాలర్లు... 2001-2015 మధ్య దాదాపు 103 బిలియన్ డాలర్ల విలువైన వెంచర్ కేపిటల్, ప్రైవేటు ఈక్విటీ నిధులు భారత కంపెనీల్లోకి వచ్చాయి. దాదాపు 12 ప్రధాన రంగాల్లోని 3,100కుపైగా సంస్థలు ఈ తరహా నిధులను అందుకున్నాయి.