న్యూఢిల్లీ: అత్యంత సంపన్న ఇన్వెస్టర్లు (యూహెచ్‌ఎన్‌ఐ), కుటుంబ కార్యాలయాలు .. ఇన్వెస్ట్ చేసేందుకు ప్రత్యామ్నాయ సాధనాల వైపు మళ్లుతున్నాయి. స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ మొదలైన ప్రైవేట్ మార్కెట్ పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నాయి. ఏజెడ్‌బీ అండ్ పార్ట్‌నర్స్, ఈవై, ట్రికా నిర్వహించిన ప్రైవేట్ మార్కెట్ మానిటర్ సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
స్టార్టప్‌లకు ప్రాధాన్యం
ఈ సర్వేల ప్రకారం స్టార్టప్ వ్యవస్థ ముఖచిత్రం మారుతుండటం, తామరతంపరగా పబ్లిక్ ఇష్యూలు వస్తుండటం మొదలైన అంశాలు కొత్త రకం ఇన్వెస్టర్లను తెరపైకి తెచ్చాయి. కొత్త తరం యూహెచ్‌ఎన్‌ఐలు తమ సంపద నిర్వహణకు కుటుంబ కార్యాలయాలను మరింత క్రియాశీలకంగా ఉపయోగించుకుంటున్నారు. స్టార్టప్‌లలో పెట్టుబడులకు మరింత ప్రాధాన్యమిస్తున్నారు. ‘ప్రత్యామ్నాయ సాధనాలుగా ప్రైవేట్ మార్కెట్ పెట్టుబడులకు ప్రాధాన్యం కొనసాగుతోంది. మొత్తం పెట్టుబడుల్లో స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటల్ (వీసీ) ఫండ్స్ వాటా 18 శాతంగా ఉంది‘ అని నివేదిక పేర్కొంది.
ఇన్వెస్టర్ల దూకుడు
ఇతర ప్రత్యామ్నాయాలతో పోలిస్తే ప్రైవేట్ మార్కెట్ పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం పెట్టుబడుల్లో లిస్టెడ్ సంస్థల షేర్ల వాటా 36 శాతం, ఫిక్సిడ్ ఇన్‌కం సాధనాల వాటా 20 శాతం కాగా, ఇతర ప్రత్యామ్నాయాలు (రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రా, ఆర్ట్ మొదలైనవి) 15 శాతం దక్కించుకున్నాయి. ఇక 83 శాతం ఫ్యామిలీ ఆఫీసులు పెట్టిన మొత్తం పెట్టుబడుల్లో ప్రైవేట్ మార్కెట్ల వాటా 10 శాతం పైగా ఉంటోంది. ఇది గత అయిదేళ్లుగా క్రమంగా పెరిగింది. 100 పైగా ఫ్యామిలీ ఆఫీసులు, యూహెచ్‌ఎన్‌ఐలు ఈ సర్వేలో పాల్గొన్నారు.
మేనేజ్‌మెంట్, మార్కెట్ అవకాశాలు..
స్టార్టప్‌లలో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ప్రధానంగా టాప్ మేనేజ్‌మెంట్‌ను, అధిక వృద్ధికి అవకాశాలున్న మార్కెట్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఫిన్‌టెక్ (82 శాతం), ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ (71 శాతం) రంగాలు అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. కన్జూమర్ టెక్ (68 శాతం), హెల్త్‌కేర్ (50 శాతం), ఎడ్‌టెక్ (42 శాతం), అగ్రిటెక్ (35 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment