Ministry of Commerce and Industry
-
‘బోర్న్‌విటా’ పై కేంద్రం కీలక ఆదేశాలు.. తక్షణమే అమల్లోకి
న్యూఢిల్లీ: చాక్లెట్ మాల్ట్ డ్రింక్ మిశ్రమాల బ్రాండ్లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పలు తయారీ కంపెనీల వెబ్సైట్లు, ఇతర మాద్యమాల్లో పలు చాక్లెట్ మాల్ట్ డ్రింక్ ఉత్పత్తులపై ‘హెల్త్ డ్రింక్’ అనే పదాన్ని తొలగించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈకామర్స్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. వాటిల్లో బోర్న్‌వీటా సైతం ఉంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ)కి సబ్మిట్ చేసిన మోండెలెజ్ ఇండియా ఫుడ్స్ (బోర్న్‌వీటా తయారీ కంపెనీ) సమర్పించిన నియమాలు, నిబంధనల్లో బోర్న్‌వీటా ‘హెల్త్ డ్రింక్’గా నమోదు చేసినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయంటూ అయితే నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్), బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (సీపీసీఆర్) చట్టం 2005 సెక్షన్ (3) సీఆర్పీసీ చట్టం 2005లోని సెక్షన్ 14 కింద విచారణ జరిపిన తర్వాత బోర్న్‌విటాలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని, ఇది ఆమోదయోగ్యమైన పరిమితుల కంటే చాలా ఎక్కువగా ఉందని ఎన్సీపీసీఆర్ చేసిన పరిశోధన నేపథ్యంలో ఈ కీలక ఉత్తర్వులు వెలుగులోకి వచ్చాయి. పవర్ సప్లిమెంట్లను సైతం అంతకుముందు, భద్రతా ప్రమాణాలు, మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైన పవర్ సప్లిమెంట్లను 'హెల్త్ డ్రింక్స్'గా విక్రయాలు జరుపుతున్న కంపెనీలపై చర్య తీసుకోవాలని ఎన్సీపీసీఆర్ భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ (FSSAI)ని కోరింది. ముఖ్యంగా, రెగ్యులేటరీ బాడీ ప్రకారం దేశంలోని ఆహార చట్టాలలో ‘హెల్త్ డ్రింక్’ అని ఎక్కుడా వినియోగించకూడదు. కాదని హెల్త్ డ్రింక్ పేరుతో అమ్మకాలు నిర్వహిస్తే సదరు కంపెనీలపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. కాగా, ఈ నెల ప్రారంభంలో, డైరీ ఆధారిత లేదా మాల్ట్ ఆధారిత పానీయాలను ‘హెల్త్ డ్రింక్స్’గా లేబుల్ వినియోగించడాన్ని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తప్పుపట్టింది. హెల్త్ డ్రింక్ పేరుతో అమ్మకాలు నిర్వహిస్తుంటే వెంటనే వాటిని నిలిపివేయాలని ఈ-కామర్స్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. -
‘అచీవర్’ ఆంధ్రప్రదేశ్.. కేంద్ర ప్రభుత్వ సూచికలో టాప్!
వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. సరకు రవాణా రంగంలో అద్భుత పనితీరుతో దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్ 2023లో అచీవర్‌గా అవతరించింది. సరకు రవాణాలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతల పనితీరుపై రూపొందించిన లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్ 2023ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తాజాగా విడుదల చేసింది. ఈ ఇండెక్స్‌లో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అచీవర్‌లుగా వర్గీకరించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలిచింది. ఏపీతోపాటు కర్ణాటక, తమిళనాడు, చండీగఢ్, గుజరాత్ తదితర రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఎగుమతులు, ఆర్థిక వృద్ధికి అవసరమైన లాజిస్టికల్ సేవల్లో ఆయా రాష్ట్రాల సామర్థ్యాన్ని ఈ సూచిక తెలియజేస్తోంది. కాగా లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్‌లో అచీవర్స్ తర్వాత ఫాస్ట్ మూవర్స్ కేటగరిలో కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలు నిలిచాయి. గోవా, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఆస్పైరర్స్ కేటగిరీలో ఉన్నాయి. రాష్ట్రాల్లో సరకు రవాణా సేవలకు కల్పిస్తున్న అనుకూల పరిస్థితుల ఆధారంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ ర్యాంకింగ్ ఇచ్చింది. -
ఎగుమతుల్లో 5వ స్థానం..అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్
దేశంలోని ఆయా రాష్ట్రాలు ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంటాయి. ఈ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తుంది. ఎగమతులపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నివేదికను విడుదల చేస్తుంది. అయితే తాజాగా, విడుదల చేసిన ఎగుమతుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో నిలిచింది. ఏప్రిల్ - సెప్టెంబర్ -2023 మధ్య జరిగిన ఈ ఎగుమతులు విలువ రూ.85,021 కోట్లుగా ఉంది. ఇక, దేశంలోని ఆయా రాష్ట్రాల జరిగే ఎగుమతుల జాబిత ఇలా ఉంది. వాటిల్లో గూజరాత్ - రూ.5,52,855 కోట్లు మహరాష్ట్ర - రూ.2,72,492 కోట్లు తమిళనాడు - రూ.1,71,462 కోట్లు కర్ణాటక - రూ.1,04,448 కోట్లు ఆంధ్రప్రదేశ్ - రూ.85,021 కోట్లతో తొలి ఐదు రాష్ట్రాల జాబితాలో నిలిచింది. 🚨 Top Indian Export States in H1, FY24. (April - September) 1. Gujarat - 5,52,855 crore 2. Maharashtra - 2,72,492 crore 3. Tamil Nadu - 1,71,462 crore 4. Karnataka - 1,04,428 crore 5. Andhra Pradesh - 85,021 crore 6. Uttar Pradesh - 83,260 crore 7. Haryana - 67,258 crore 8.… — Indian Tech & Infra (@IndianTechGuide) December 10, 2023 -
ఎగుమతుల ప్రోత్సాహకానికి సమావేశాలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ ద్వారా ఎగుమతులను ప్రోత్సహించే మార్గాలపై అవగాహన పెంచేందుకు నెలవారీ వర్క్‌షాప్‌లను నిర్వహించాలని నిర్ణయించినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. వర్క్‌షాప్‌ల ద్వారా విదేశాలకు సరుకు రవాణా, పోస్టల్, కస్టమ్స్ సమ్మతి, చెల్లింపులకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతిపాదిత వర్క్‌షాప్‌లు ప్రతి నెల మొదటి వారంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తారు. సాధ్యమయ్యే చోట వ్యక్తిగతంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అనుభవాలను పంచుకోవడానికి, కొత్త వ్యవస్థాపకులకు సలహా ఇవ్వడానికి ప్రముఖ ఈ–కామర్స్ ఎగుమతిదారులను ఆహా్వనించినట్టు వెల్లడించింది. -
ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల దిగుమతులు: సంచలన నిర్ణయం
Restrictions on Imports కేంద్ర ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు కంప్యూటర్ల దిగుమతిపై తక్షణమే ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి నేడు (ఆగస్ట్ 3 న) వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. పరిమితులు విధించిన దిగుమతులకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌తో దిగుమతికి అనుమతి ఉంటుందని పేర్కొంది.బ్యాగేజీ నిబంధనల ప్రకారం దిగుమతులపై పరిమితులు వర్తించవు ఈ దిగుమతులపై ప్రభుత్వం తక్షణమే అమలయ్యేలా ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆల్-ఇన్-వన్ పర్సనల్ కంప్యూటర్లు ,అల్ట్రా స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతులపై హెచ్ఎస్ఎన్ 8741 కింద ఈ పరిమితులు విధిస్తున్నట్టు వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో వెల్లడించింది. (శుభవార్త: భారీగా పడిన వెండి, మురిపిస్తున్న పసిడి) బ్యాగేజీ నిబంధనల ప్రకారం దిగుమతులపై ఆంక్షలు వర్తించవని మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాగేజీ నియమాలు భారత సరిహద్దులోకి ప్రవేశించే లేదా బయటికి వచ్చే ప్రతి ప్రయాణీకుడు కస్టమ్స్ నిబంధనలు పాటించాలి. అలాగే పోస్ట్ లేదా కొరియర్. దిగుమతులు వర్తించే విధంగా సుంకం చెల్లింపునకు లోబడి ఉంటాయి. అలాగే విదేశాల్లో రిపేర్ అయిన వస్తువులను తిరిగి దిగుమతి చేసుకునేందుకు సంబంధించి, వాటి రిపేర్‌కి ఇవ్వడానికి, తిరిగి తీసుకోవడానికి సంబంధించిన దిగుమతులకు లైసెన్స్ అవసరం లేదని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. (టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!) సెర్చ్ అండ్ డెవలప్మెంట్, టెస్టింగ్, బెంచ్‌మార్కింగ్ ఇతర సమయాల్లో దిగుమతిదారులు దిగుమతి లైసెన్స్ అవసరం లేకుండా సరుకుకు 20 వస్తువులను తీసుకురావచ్చు. అయితే, ఈ ఐటెమ్‌లు తప్పనిసరిగా నిర్దిష్ట ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగింలాలి. తిరిగి విక్రయించడానికి లేదు. ఉద్దేశించిన ప్రయోజనం నెరవేరిన తర్వాత, ఉత్పత్తులను నాశనం చేయాలి లేదా తిరిగి ఎగుమతి చేయాలి. -
టోకు ధరలూ పెరిగాయ్!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 1.48 శాతం ఎగసింది. అంటే 2019 అక్టోబర్‌తో పోల్చితే 2020 అక్టోబర్‌లో టోకు వస్తువుల బాస్కెట్ ధర 1.48 శాతం పెరిగిందన్నమాట. ఎనిమిది నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. తయారీ ఉత్పత్తుల ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం. ఆర్థిక మందగమనం, వ్యవస్థలో డిమాండ్ లేకపోవడం, కరోనా ప్రతికూలతలు వంటి అంశాల నేపథ్యంలో టోకు ధరల సూచీ ‘జీరో’ లేదా ప్రతిద్రవ్యోల్బణం స్థాయిలో నమోదవుతోంది. సూచీలోని ఒక్క ఆహార ఉత్పత్తుల ధరలు మాత్రమే పెరుగుదలను సూచిస్తున్నాయి. అయితే వ్యవస్థలో కొంత డిమాండ్ నెలకొనడంతోపాటు, బేస్ ఎఫెక్ట్ (2019 అక్టోబర్‌లో ‘జీరో’ ద్రవ్యోల్బణం) కూడా తాజాగా సూచీ పెరుగుదలకు ఒక కారణమవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆవిష్కరించిన తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► మొత్తం సూచీలో దాదాపు 12% వెయిటేజ్ ఉన్న ఆహార ఉత్పత్తుల ధరలు టోకును 6.37% పెరిగాయి. ఒక్క కూరగాయల ధరలు 25.23 శాతం పెరిగితే, ఆలూ ధరలు ఏకంగా 107.70% ఎగశాయి (2019 అక్టోబర్ ధరలతో పోల్చితే). ► సూచీలో 12% వెయిటేజ్ ఉన్న నాన్–ఫుడ్ ఆర్టికల్స్, మినరల్స్ ధరలు 2.85 శాతం, 9.11 శాతం చొప్పున ఎగశాయి. ► మొత్తం సూచీలో దాదాపు 62 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో ధరలు 2.12 శాతం ఎగశాయి. ► 14% వెయిటేజ్ ఉన్న ఫ్యూయల్ అండ్ పవర్ ఇండెక్స్‌లో అసలు పెరుగుదల లేకపోగా 10.95% క్షీణించాయి. ఆర్బీఐ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చు... ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) తగ్గింపు ప్రక్రియకు ఇక తెరపడినట్లేనని నిపుణులు అంచనావేస్తున్నారు. వచ్చే నెల్లో జరగనున్న ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో యథాతథ రేటును కొనసాగించే వీలుందన్నది వారి విశ్లేషణ. టోకు ధరలే తీవ్రంగా ఉంటే, ఇక రిటైల్ ధరలు మరింత పెరుగుతాయని వారు విశ్లేషిస్తున్నారు. ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలని కేంద్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి నిర్దేశిస్తోంది. అయితే ఈ స్థాయికి మించి ఈ రేటు నమోదవుతోంది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో ఎనిమిది నెలల గరిష్టం 7.27 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, రిటల్ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్టు, అక్టోబర్ నెలల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగించింది. అయితే సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ అంచనావేస్తోంది. -
టోకు ధరలు.. మైనస్ నుంచి ప్లస్
న్యూఢిల్లీ: ప్రభుత్వం సోమవారం నాడు ఆగస్టుకు సంబంధించి అటు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలను, ఇటు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను విడుదల చేసింది. టోకు ద్రవ్యోల్బణం 0.16 శాతం నమోదయితే, రిటైల్ ద్రవ్యోల్బణం 6.69 శాతంగా నమోదయ్యింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన టోకు ధరల గణాంకాల్లో కీలక అంశాలను పరిశీలిస్తే... టోకు డిమాండ్ మెరుగుపడుతుందనుకోలేం! టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల తర్వాత మొట్టమొదటిసారి ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితుల నుంచి బయటపడింది. ఆగస్టులో ద్రవ్యోల్బణం 0.16 శాతంగా నమోదయ్యింది. అంటే 2019 ఆగస్టుతో పోల్చితే 2020 ఆగస్టులో టోకు బాస్కెట్‌లోని మొత్తం ఉత్పత్తుల ధర 0.16 శాతం పెరిగిందన్నమాట. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించిన తర్వాత వరుసగా ఏప్రిల్ (– 1.57%), మే (–3.37%), జూన్ (–1.81%), జూలై (–0.58%) నెలల్లో ప్రతికూల టోకు ద్రవ్యోల్బణం రేట్లు నమోదయ్యాయి. వ్యవస్థలో డిమాండ్ లేమి పరిస్థితులను ప్రతి ద్రవ్యోల్బణం సూచిస్తుంది. అయితే తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థలో మళ్లీ డిమాండ్ కనిపిస్తోందనడానికి సూచన కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఆగస్టులో ద్రవ్యోల్బణం పెరగడానికి బేస్ ఎఫెక్టే కారణమన్నది వారి అంచనా. అంటే 2019 ఆగస్టులో నమోదయిన టోకు ద్రవ్యోల్బణం అతి తక్కువగా ఉండడం (కేవలం 1.17%), ఆర్థిక మందగమనం వల్ల అటు తర్వాత నెలల్లోనూ వ్యవస్థలో పూర్తి ప్రతి ద్రవ్యోల్బణం పరిస్థితులే నెలకొనడం వంటి అంశాలతో తాజా సమీక్షా నెల 2020 ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం కొంచెం పెరిగినట్లు ‘గణాంకాల్లో’ కనిపిస్తోందన్నది వారి అభిప్రాయం. దీనినే బేస్ ఎఫెక్ట్ మాయగా నిపుణులు పేర్కొంటారు. కాగా మార్చిలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 0.42%. మూడు ప్రధాన విభాగాలను చూస్తే... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్ ఫుడ్ విభాగాలతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణం ఆగస్టులో 1.60 శాతానికి తగ్గింది. 2019 ఆగస్టులో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 6.51 శాతం. ఇక ఈ విభాగంలో కేవలం ఫుడ్ ఆర్టికల్స్‌ను తీసుకుంటే, ద్రవ్యోల్బణం 7.80 శాతం నుంచి 3.84 శాతానికి తగ్గింది. నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌లో మాత్రం ప్రతి ద్రవ్యోల్బణం (–1.46 శాతం) కొనసాగుతోంది. 2019 ఇదే నెలలో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 4.68 శాతం. ► ఇంధనం, విద్యుత్: ప్రతి ద్రవ్యోల్బణం మైనస్ 3.53 శాతం నుంచి మరింతగా మైనస్ 9.68 శాతానికి పెరిగింది. ► తయారీ: తయారీ రంగంలో 1.27 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. 2019 ఆగస్టులో ఇది స్థిరంగా ఉంది. టోకున ‘నిత్యావసరాల’ మంట డబ్ల్యూపీఐ... ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం వార్షికంగా చూస్తే 7.80% నుంచి 3.84%కి తగ్గినా, నిత్యావసరాల ధరలు మాత్రం ఇంకా సామాన్యునికి భారంగానే ఉండడం గమనార్హం. కూరగాయల ధరలు 7.03% పెరిగాయి (2019 ఆగస్టుతో పోల్చి). పప్పు దినుసుల ధరలు 9.86% ఎగశాయి. ప్రొటీన్ ఆధారిత గుడ్లు, మాంసం, చేపల ధరలు 6.23% పెరిగాయి. ఆలూ ధరలు భారీగా 82.93 శాతం ఎగశాయి. అయితే ఉల్లిపాయల ధరలు మాత్రం 34.48% తగ్గాయి. -
నక్క తోలుపై కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఉన్ని దుస్తులు, హ్యాండ్‌బ్యాగ్స్, షూ, బెల్ట్స్ వంటి వస్తువుల తయారీకి విరివిగా వినియోగించే నక్క తోలు, మొసలి చర్మాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యాషన్ వస్తువుల తయారీ కోసమే జంతువులను యథేచ్ఛగా వధిస్తున్నారన్న వాదనతో ఏకీభవిస్తూ నక్క తోలు, మొసలి చర్మాల దిగుమతిపై నిషేధం విధించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖలో అంతర్భాగమైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్టీ) ఈ మేరకు జనవరి 3న నోటిఫికేషన్ జారీచేసింది. మొసలి చర్మంతో తయారయ్యే హ్యాండ్‌బ్యాగులు, షూ, బెల్ట్, పర్స్లాంటి వస్తువులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక నక్క తోలుతో తయారయ్యే ఉన్ని దుస్తుల ధారణ గొప్ప ఫ్యాషన్‌గా కొనసాగుతున్న విషయం విదితమే. విచ్చలవిడిగా సాగుతోన్న జంతువధను, వాటితో తయారయ్యే వస్తువుల వాడకంపై స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ.. ఆందోళనకారులకు మద్దతు పలకడమేకాక, జంతు చర్మాల దిగుమతిపై నిషేధం విధించాలని కోరుతూ వాణిజ్య, పరిశ్రమల శాఖకు పలు మార్లు లేఖలు రాశారు. దీంతో విదేశాల నుంచి వాటి దిగుమతిని డీజీఎఫ్టీ నిషేధించింది. దేశీయంగా ఈ నిషేధం చాలా కాలం నుంచే అమలులోఉంది. -
సులభతర వాణిజ్యంలో తెలుగు రాష్ట్రాలు ఫస్ట్
- సంస్కరణల ఆధారంగా ర్యాంకులు కేటాయించిన కేంద్ర వాణిజ్యశాఖ - మూడోస్థానానికి పడిపోయిన గుజరాత్ సాక్షి, న్యూఢిల్లీ : సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదటి ర్యాంకు సాధించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం ప్రకటించింది. ప్రతిపాదిత సంస్కరణల అమలుకు సంబంధించి గతేడాది జూలై 1 నుంచి ఈ ఏడాది జూన్ 30 మధ్య కాలానికి సంబంధించిన నివేదికలను రాష్ట్రాలు కేంద్ర పరిశ్రమల విభాగానికి అందించాయి. వీటిని కేంద్ర పరిశ్రమల విభాగం, ప్రపంచ బ్యాంకు విభాగం అధ్యయనం చేసి ర్యాంకులు ప్రకటించాయి. గతేడాది మొదటి స్థానంలో నిలిచిన గుజరాత్ ఈ ఏడాది మూడో స్థానానికి పడిపోయింది. నాలుగో స్థానంలో ఛత్తీస్‌గఢ్, ఐదో స్థానంలో మధ్యప్రదేశ్, హరియాణ 6, జార్ఖండ్ 7వ స్థానాల్లో నిలిచాయి. కాగా, రెండోస్థానాన్ని మాత్రం ప్రకటించలేదు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి సింగిల్ విండో అనుమతుల మంజూరు, భూకేటాయింపు, విద్యుత్ సరఫరా, పన్నుల సరళీకరణ, భవన నిర్మాణాల అనుమతుల్లో పారదర్శకత, పర్యావరణ అనుమతులు, వివాదాల పరిష్కారంలో వేగం, తనిఖీల్లో పారదర్శకత లాంటి సంస్కరణల అమలు ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. ప్రతి రాష్ట్రం కూడా ఇతర రాష్ట్రాల్లోని పరిశ్రమల అనుమతుల విధానాలను పరిశీలించి ముందుకు సాగుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో అన్నారు. గతేడాది కేవలం ఏడు రాష్ట్రాలు 50 శాతం సంస్కరణలను అమలు చేస్తే.. ఈ ఏడాది 17 రాష్ట్రాలు 50 శాతం సంస్కరణలను అమలు చేశాయని ఆమె వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంస్కరణల అమలు 48.93 శాతంగా ఉందన్నారు. ‘వ్యవసాయ’ సంస్కరణల్లో ఏపీకి 7, తెలంగాణకు 9 వ్యవసాయ రంగ సంస్కరణలకు సంబంధించి నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, రైతు అనుకూల విధానాల అమలు’ నివేదికలో ఏపీకి 7, తెలంగాణకు 9వ ర్యాంకు దక్కింది. మరోవైపు మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌లు రైతులకు అనుకూలమైన పలు సంస్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. వ్యవసాయరంగ అభివృద్ధికి ఉన్న అడ్డంకులను అధిగమించి, రైతులకు అనుకూలంగా ప్రభుత్వాలు సంస్కరణలు ప్రవేశపెట్టడానికే ఈ నివేదికను విడుదల చేసినట్టు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా తెలిపారు. -
5 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తాడేపల్లిగూడెం: దేశవ్యాప్తంగా రెండేళ్లలో 5 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తాడేపల్లిగూడెంలోని జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన హాకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. గివ్ ఇట్ అప్ పథకానికి దేశ వ్యాప్తంగా విపరీత స్పందన వచ్చిందని, 55 లక్షల మంది గ్యాస్ రాయితీలను వదులుకున్నారని తెలిపారు. ఇలా వదులుకున్న వాటిలో 46 లక్షల కనెక్షన్లను అర్హులైన పేదలకు కేటాయించామన్నారు. తాగునీటి కాలుష్యం వల్ల కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని, అందువల్ల ప్రతి జిల్లాలో ప్రభుత్వం తరఫున ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు పాల్గొన్నారు. -
రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం మంత్రి ప్రత్తిపాటి
వర్గీకరణ సున్నిత అంశం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు పెట్టుకున్నాయని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై మీ వైఖరేంటని ప్రశ్నించగా, అది సున్నితమైన అంశమని, ముఖ్యమంత్రి పరిష్కరిస్తారని సమాధానం దాటవేశారు. సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, పార్టీ నాయకులు దాసరి రాజామాస్టారు, మన్నవ సుబ్బారావు, బోనబోయిన శ్రీనివాసయాదవ్, మద్దాళి గిరిధర్, టీవీ రావు తదితరులు పాల్గొన్నారు. కొరిటెపాడు (గుంటూరు) : రైతులకు గిట్టుబాబు ధర కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే రైతుల నుంచి కందులు కొనుగోలు చేస్తున్నామని, త్వరలో మినుములు, శనగలు, పెసలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. మోన్శాంటో హైబ్రిడ్ పత్తి విత్తనాల వేసిన చాలామంది రైతులు పింక్‌బౌల్ పురుగు సోకి నష్టపోయారని తెలిపారు. మోన్శాంటో కంపెనీ(ప్యాకెట్‌పై) వసూలుచేస్తున్న రూ.180 ఈ ఏడాది మానుకోవాలని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. రైతులకు అవసరమైన అధునాత యంత్ర పరికరాలను 50 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ఏపీ ఆగ్రోస్ ద్వారా కొన్ని వ్యవసాయ యంత్ర పరికరాలను తయారీదారుల నుంచే నేరుగా రైతులకు అందజేనున్నట్లు మంత్రి ప్రత్తిపాటి వివరించారు. -
ఫార్మా కంపెనీల తనిఖీ విధానం మరింత సరళంగా..
దక్షిణాసియా దేశాలతో కలసి ఉమ్మడి నియంత్రణ వ్యవస్థ - ఏపీఐ ఎగుమతుల పెంపుపై దృష్టి - కేంద్ర వాణిజ్య శాఖ - సంయుక్త కార్యదర్శి సుధాంషు పాండే హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం అమల్లో ఉన్న బహుళ తనిఖీల విధానాన్ని సరళీకరించడం ద్వారా ఫార్మారంగంలో వ్యయాలను నియంత్రించవచ్చని, తద్వారా మరింత చౌకగా ఔషధాలను అందించే వీలు కలుగుతుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎగుమతి చేస్తున్న ప్రతీ దేశం తనిఖీలు నిర్వహించి అనుమతులు మంజూరు చేయడం వల్ల సమయంతో పాటు ధనం కూడా వృథా అవుతోందని, దీని స్థానంలో ఏకీకృత తనిఖీ విధానం రావాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సుధాంషు పాండే పేర్కొన్నారు. ఫార్మెక్సిల్ 11వ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన పాండే, తనను కలసిన విలేకరులతో మాట్లాడుతూ ఏకీకృత తనిఖీ విధానం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఒక దేశం తనిఖీ చేస్తే మిగిలిన సభ్యదేశాలు కూడా వాటిని ఆమోదించే విధంగా ఒక ఉమ్మడి తనిఖీ విధానాన్ని తీసుకురావాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇందులోభాగంగా 12 దక్షిణాసియా దేశాల నియంత్రణ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఏపీఐ ఎగుమతులు పెరగాలి.. గత కొంతకాలంగా తగ్గుతున్న ఏపీఐ (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్) ఎగుమతులను పెంచడంపై దృష్టిసారిస్తున్నట్లు పాండే తెలిపారు. ఇందుకోసం త్వరలోనే ఏపీఓ పాలసీ తీసుకురానున్నట్లు తెలిపారు. గతంలో దేశీయ ఫార్మా ఎగుమతుల్లో 90 శాతం ఏపీఐ నుంచే ఉంటే ఇప్పుడది 24 శాతానికి పడిపోయింది. గతేడాది దేశం నుంచి రూ. 95,000 కోట్ల విలువైన ఫార్మా ఎగుమతులు జరిగాయి. ఈ ఏడాది కూడా ఫార్మా ఎగుమతులు స్థిరంగా ఉంటాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జీవీకే బయోకి క్లీన్చిట్: జీవీకే బయో తప్పుడు సమాచారంతో క్లినికల్ ట్రయల్స్ నివేదికలను తయారు చేసిందన్న ఫ్రాన్స్ నియంత్రణ సంస్థ ఆరోపణలను పాండే ఖండించారు. ఈ ఆరోపణలపై కేంద్రం ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించిందని, ఈ కమిటీ పరిశీలనలో ఎటువంటి లోపాలు వెలుగు చూడలేదన్నారు. త్వరలోనే ఈ నివేదికను కేంద్రానికి సమర్పించనున్నట్లు తెలి పారు. జీవికే బయో పరిశీలించి నివేదిక ఇచ్చిన 54 ఔషధాల అ మ్మకాలను నిషేధిస్తూ పలు యూరప్ దేశాలు నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఔషధాల విక్రయాలను నిషేధించడానికి యూరప్ నియంత్రణ సంస్థలు సరైన కారణాలు చెప్పలేకపోతున్నాయని, ఇప్పటి వరకు ఆరుసార్లు వారితో చర్చించినా స్పందన లేదన్నారు. -
ఈయూ నిషేధంతో ఎగుమతులకు దెబ్బ
రూ. 6,300 కోట్లు తగ్గనున్న ఎగుమతులు - కొత్త ఫార్మాసిటీతో అంతర్జాతీయ ఫార్మా కేంద్రంగా హైదరాబాద్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూరోపియన్ యూనియన్ నిషేధించిన 700 జెనరిక్ ఔషధాల వల్ల రూ.6,300 కోట్ల విలువైన ఎగుమతులు తగ్గుతాయని కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. జీవీకే బయో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో లోపాలున్నాయంటూ యూరోపియన్ యూనియన్ ఈ మధ్యనే 700 జెనరిక్ ఔషధాల అమ్మకాలను నిషేధించిన సంగతి తెలిసిందే. యూరోపియన్ యూనియన్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో ఎగుమతులు 1-1.2 బిలియన్ డాలర్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఫార్మాక్సిల్) అంచనా వేసింది. ఈ నిర్ణయంతో యూరోపియన్ దేశాల ఎగుమతలు 30 శాతం క్షీణిస్తాయని భావిస్తున్నట్లు ఫార్మాక్సిల్ డెరైక్టర్ జనరల్ పి.వి.అప్పాజీ చెప్పారు. సోమవారం బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరింగ్ అసోసియేషన్ (బీడీఎంఏ) నిర్వహించిన సమావేశంలో అప్పాజీ విలేకరులతో మాట్లాడుతూ గతేడాది దేశం నుంచి 15.4 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఎగుమతులు జరగ్గా అందులో యూరోపియన్ యూనియన్ వాటా సుమారు 3 బిలియన్ డాలర్లు ఉందన్నారు. ఈ నిషేధం అవాంఛనీయమైనదని, దీనికి సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై ఒకటి రెండు రోజుల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ధరలను నియంత్రించకూడదు: సతీష్ రెడ్డి అంతకుముందు ‘యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్’ సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ కె. సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఔషధాల ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదన్నారు. కొన్ని ఔషధాల ధరలపై నియంత్రణల వల్ల ఈ ఔషధాల తయారీకి కంపెనీలు ముందుకు రావడం లేదని, అలా కాకుండా మార్కెట్ పరిస్థితులకే ధరలను వదిలేస్తే పోటీ పెరిగి ధరలు తగ్గుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం చెపుతున్నట్లు అన్ని మౌలిక వసతులతో ఫార్మా సిటీని అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ ఫార్మా హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రసాయనాలు, ఫెర్టిలైజర్స్ శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ మాట్లాడుతూ ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టడానికి దేశీయంగా అనేక అవకాశాలున్నాయన్నారు. కార్యక్రమంలో బీడీఎంఏ ప్రతినిధుల సహా వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘హోదా’పై వెనకడుగు
* ఆంధ్రాకు ‘ప్రత్యేకం’పై తగ్గిన కేంద్రం * బీహార్, ఒడిశా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ల డిమాండ్‌తో వెనక్కు తగ్గిన కేంద్రం * కేవలం చట్టంలో పేర్కొన్న మేరకు ప్రత్యేక పన్ను రాయితీలు * కేంద్ర వర్తక, వాణిజ్య మంత్రిత్వ శాఖలో కదిలిన ఫైలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటన ఉత్తుత్తి ప్రకటనగానే మిగిలిపోనుంది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని తేలిపోయింది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తే తమకు కూడా ఇవ్వాల్సిందిగా అడిగేందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజేతో పాటు బీహార్ ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు ఉన్నతస్థాయి వర్గాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. అయితే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొ న్న విధంగా ఏపీలో పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక రాయితీలను ఐదు లేదా పదేళ్ల పాటు కల్పించేందుకు కేంద్ర వర్తక, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఫైలును సిద్ధం చేసినట్లు ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాని పరిస్థితుల్లోనే పరిశ్రమల స్థాపన విషయంలో చట్టంలో పేర్కొన్న విధంగా ప్రత్యేక రాయితీలను కల్పించేం దుకు కేంద్ర ప్రభుత్వం ఫైలును సిద్ధం చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రత్యేక హోదాపై కేంద్ర నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌కు తీరని నిరాశే మిగల్చనుంది. ప్రత్యేక హోదా వస్తే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంటు రూపంలో నిధులు వస్తాయని, పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన చేపట్టవచ్చునని ఏపీ ప్రభుత్వం, ప్రజలు భావించారు. అయితే కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాల డిమాండ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సంగతిని పక్కనపెట్టింది. ప్రస్తుతానికి చట్టంలో పేర్కొన్న విధంగా పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి అవసరమైన పన్ను రాయితీలను కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. వెనుకబడిన ప్రాం తాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సాయం అందించనుంది. అలాగే రాజధానిలో రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, మండలి తదితర మౌలిక వసతుల నిర్మాణాలకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వకుండానే చట్టంలో పేర్కొన్న ప్రతీ అంశాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అధికార వర్గాలు తెలిపాయి. -
'కొత్త రాష్ట్రంతో యువతకు ఉద్యోగావకాశాలు'
ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నిర్మల సీతారామన్ శనివారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాల సీతారామన్ మాట్లాడుతూ... ఇరు రాష్ట్రాలు పారిశ్రామికంగా అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. అలాగే ఇరు రాష్ట్రాలలో ఫూడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను అభివృద్ధికి తనవంత సహకారం అందిస్తానని ఆమె భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు అధికమవుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఆమె ఈ సందర్బంగా గుర్తు చేశారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామని చెప్పామని అందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని ఆమె వివరించారు. మహిళపై దాడులను నిరోధించేందుకు కేంద్ర పటిష్టమైన చర్యలు చేపట్టిందని ఆమె గుర్తు చేశారు. నిర్మల సీతారామన్ సన్మాన కార్యక్రమంలో సికింద్రబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు పలువురు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నిర్మల సీతారామన్ పాల్గొనున్నారు. -
కర్ణాటక నుంచి పెద్దల సభకు నిర్మలా సీతారామన్
స్వతంత్ర హోదా కలిగిన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నిర్మలా సీతారామన్‌ను కర్ణాటక నుంచి రాజ్య సభకు ఎంపిక చేయనున్నారు. ఇందుకు తగ్గ చర్యలను బీజేపీ అధిష్టానం చేపట్టింది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో తమిళనాడుకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. ఒకరికి స్వతంత్ర హోదాతో సహాయ మంత్రి పదవి, మరొకరికి కేంద్ర సహాయ మంత్రి పదవి. ఇందులో ఒకరి నిర్మలా సీతారామన్, మరొకరు పొన్ రాధాకృష్ణన్. ఈయన కన్యాకుమారి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అయితే, నిర్మలా సీతారామన్ ఎన్నికల బరిలో దిగలేదు. ఈమె స్వస్థలం తమిళనాడు అయినా, పార్టీ పరంగా జాతీయ స్థాయిలో నాయకురాలిగా అవతరించారు. తిరుచ్చిలో జన్మించిన నిర్మలా సీతారామన్ అక్కడి సీతాలక్ష్మి రామస్వామి కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఉన్నత చదవుల అనంతరం కొంత కాలం లండన్‌లో ఉన్నా, ఆ తర్వాత తిరిగి భారత్‌కు వచ్చేశారు. బీజేపీలో జాతీయ అధికార ప్రతినిధి హోదాతో చెన్నైకు పలు మార్లు వచ్చారు. తమిళం అనర్గళంగా మాట్లాడ గలిగే నిర్మలకు మోడీ ఆశీస్సులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులతో ఆమెకు అనుబంధం ఉన్న దృష్ట్యా, స్వతంత్ర హోదా కలిగిన పదవి వరించింది. ఇప్పుడు ఆమెకు రాజ్య సభ సీటు ఎక్కడి నుంచి దక్కుతుందన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. అయితే, కర్ణాటక నుంచి ఆమెను రాజ్య సభకు పంపొచ్చంటూ రాష్ట్ర బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. కర్ణాటకలో నాలుగు రాజ్య సభ సీట్లు ఖాళీ అవుతుండడం, ఇందులో బీజేపీకి అవకాశం ఉందంటున్నారు. కర్ణాటకలో ఒక్కో ఎంపీ ఎంపికకు 44 సీట్లు అవసరం అయితే, బీజేపీకి 43 సీట్లు ఉండడంతో, ఇతరుల సహకారంతో ఆ సీటు బరిలో నిర్మలా సీతారామన్‌ను దించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
ఎగుమతులు మిస్
న్యూఢిల్లీ: దేశ ఎగుమతులు రివర్స్‌గేర్‌లోకి జారాయి. ఈ ఏడాది మార్చి నెలలో ఎగుమతులు 3.15 శాతం క్షీణించి 29.57 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మరోపక్క, దిగుమతులు సైతం 2.11 శాతం తగ్గుదలతో 40 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక వాణిజ్య లోటు(ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం) మార్చి నెలలో స్వల్పంగా తగ్గి 10.5 బిలియన్ డాలర్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే నెలలో వాణిజ్య లోటు 10.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మార్చిలో ఎగుమతులు తగ్గడానికి అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఇతర కారకాలతో పాటు దేశీయంగా తయారీ రంగం పేలవ పనితీరూ కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ అంతంతమాత్రంగానే ఉందని, వచ్చే నెలల్లో మెరుగుపడవచ్చని భారతీయ ఎగుమతిదారుల సంఘాల సమాఖ్య ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ వ్యాఖ్యానించారు. లక్ష్యానికి కొద్దిగా దూరంలో... గడిచిన 2013-14 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 325 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా 312 బిలి యన్ డాలర్లు మాత్రమే ఎగుమతులు జరిగాయి. అంటే లక్ష్యానికి 13 బిలియన్ డాలర్లు తగ్గాయి. అయితే, 2012-13లో నమోదైన 300 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పోలిస్తే దాదాపు 4 శాతం వృద్ధి నమోదైంది. ఇక దిగుమతులు 2012-13తో పోలిస్తే 8.11% తగ్గుదలతో 451 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 139 బిలియన్ డాలర్లకు తగ్గుముఖం పట్టింది. 2012-13లో వాణిజ్య లోటు 190 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనికి ప్రధానంగా వెండి, బంగారం దిగుమతులు భారీగా దిగిరావడమే కారణం. పుత్తడి-వెండి దిగుమతులు 40% డౌన్... గతేడాది(2013-14)లో వాణిజ్య లోటు కట్టడికి ప్రధానంగా బంగారం, వెండి దిగుమతులు భారీగా తగ్గడమే కారణం. ఈ రెండు విలువైన లోహాల దిగుమతులు 40% మేర క్షీణించి 33.46 బిలియన్ డాలర్లకు చేరాయి. బంగారం దిగుమతులపై ప్రభుత్వం విధించిన కస్టమ్స్ సుంకం పెంపు(10%కి) ఇతరత్రా ఆంక్షలు వీటికి కళ్లెం వేసేందుకు దోహదపడ్డాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు లోహాల దిగుమతుల విలువ 55.79 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక ఈ ఏడాది మార్చిలో బంగారం, వెండి దిగుమతుల విలువ 2.75 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో 3.33 బిలియన్ డాలర్లతో పోలిస్తే 17.27% దిగుమతుల విలువ తగ్గడం గమనార్హం.