5 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
తాడేపల్లిగూడెం: దేశవ్యాప్తంగా రెండేళ్లలో 5 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తాడేపల్లిగూడెంలోని జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ హాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన హాకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు.
గివ్ ఇట్ అప్ పథకానికి దేశ వ్యాప్తంగా విపరీత స్పందన వచ్చిందని, 55 లక్షల మంది గ్యాస్ రాయితీలను వదులుకున్నారని తెలిపారు. ఇలా వదులుకున్న వాటిలో 46 లక్షల కనెక్షన్లను అర్హులైన పేదలకు కేటాయించామన్నారు. తాగునీటి కాలుష్యం వల్ల కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని, అందువల్ల ప్రతి జిల్లాలో ప్రభుత్వం తరఫున ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు పాల్గొన్నారు.