సులభతర వాణిజ్యంలో తెలుగు రాష్ట్రాలు ఫస్ట్
- సంస్కరణల ఆధారంగా ర్యాంకులు కేటాయించిన కేంద్ర వాణిజ్యశాఖ
- మూడోస్థానానికి పడిపోయిన గుజరాత్
సాక్షి, న్యూఢిల్లీ : సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదటి ర్యాంకు సాధించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం ప్రకటించింది. ప్రతిపాదిత సంస్కరణల అమలుకు సంబంధించి గతేడాది జూలై 1 నుంచి ఈ ఏడాది జూన్ 30 మధ్య కాలానికి సంబంధించిన నివేదికలను రాష్ట్రాలు కేంద్ర పరిశ్రమల విభాగానికి అందించాయి. వీటిని కేంద్ర పరిశ్రమల విభాగం, ప్రపంచ బ్యాంకు విభాగం అధ్యయనం చేసి ర్యాంకులు ప్రకటించాయి. గతేడాది మొదటి స్థానంలో నిలిచిన గుజరాత్ ఈ ఏడాది మూడో స్థానానికి పడిపోయింది. నాలుగో స్థానంలో ఛత్తీస్‌గఢ్, ఐదో స్థానంలో మధ్యప్రదేశ్, హరియాణ 6, జార్ఖండ్ 7వ స్థానాల్లో నిలిచాయి. కాగా, రెండోస్థానాన్ని మాత్రం ప్రకటించలేదు.
పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి సింగిల్ విండో అనుమతుల మంజూరు, భూకేటాయింపు, విద్యుత్ సరఫరా, పన్నుల సరళీకరణ, భవన నిర్మాణాల అనుమతుల్లో పారదర్శకత, పర్యావరణ అనుమతులు, వివాదాల పరిష్కారంలో వేగం, తనిఖీల్లో పారదర్శకత లాంటి సంస్కరణల అమలు ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. ప్రతి రాష్ట్రం కూడా ఇతర రాష్ట్రాల్లోని పరిశ్రమల అనుమతుల విధానాలను పరిశీలించి ముందుకు సాగుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో అన్నారు. గతేడాది కేవలం ఏడు రాష్ట్రాలు 50 శాతం సంస్కరణలను అమలు చేస్తే.. ఈ ఏడాది 17 రాష్ట్రాలు 50 శాతం సంస్కరణలను అమలు చేశాయని ఆమె వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంస్కరణల అమలు 48.93 శాతంగా ఉందన్నారు.
‘వ్యవసాయ’ సంస్కరణల్లో ఏపీకి 7, తెలంగాణకు 9
వ్యవసాయ రంగ సంస్కరణలకు సంబంధించి నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, రైతు అనుకూల విధానాల అమలు’ నివేదికలో ఏపీకి 7, తెలంగాణకు 9వ ర్యాంకు దక్కింది. మరోవైపు మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌లు రైతులకు అనుకూలమైన పలు సంస్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. వ్యవసాయరంగ అభివృద్ధికి ఉన్న అడ్డంకులను అధిగమించి, రైతులకు అనుకూలంగా ప్రభుత్వాలు సంస్కరణలు ప్రవేశపెట్టడానికే ఈ నివేదికను విడుదల చేసినట్టు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా తెలిపారు.