
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
స్వతంత్ర హోదా కలిగిన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నిర్మలా సీతారామన్‌ను కర్ణాటక నుంచి రాజ్య సభకు ఎంపిక చేయనున్నారు. ఇందుకు తగ్గ చర్యలను బీజేపీ అధిష్టానం చేపట్టింది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో తమిళనాడుకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. ఒకరికి స్వతంత్ర హోదాతో సహాయ మంత్రి పదవి, మరొకరికి కేంద్ర సహాయ మంత్రి పదవి. ఇందులో ఒకరి నిర్మలా సీతారామన్, మరొకరు పొన్ రాధాకృష్ణన్. ఈయన కన్యాకుమారి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అయితే, నిర్మలా సీతారామన్ ఎన్నికల బరిలో దిగలేదు. ఈమె స్వస్థలం తమిళనాడు అయినా, పార్టీ పరంగా జాతీయ స్థాయిలో నాయకురాలిగా అవతరించారు. తిరుచ్చిలో జన్మించిన నిర్మలా సీతారామన్ అక్కడి సీతాలక్ష్మి రామస్వామి కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఉన్నత చదవుల అనంతరం కొంత కాలం లండన్‌లో ఉన్నా, ఆ తర్వాత తిరిగి భారత్‌కు వచ్చేశారు.
బీజేపీలో జాతీయ అధికార ప్రతినిధి హోదాతో చెన్నైకు పలు మార్లు వచ్చారు. తమిళం అనర్గళంగా మాట్లాడ గలిగే నిర్మలకు మోడీ ఆశీస్సులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులతో ఆమెకు అనుబంధం ఉన్న దృష్ట్యా, స్వతంత్ర హోదా కలిగిన పదవి వరించింది. ఇప్పుడు ఆమెకు రాజ్య సభ సీటు ఎక్కడి నుంచి దక్కుతుందన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. అయితే, కర్ణాటక నుంచి ఆమెను రాజ్య సభకు పంపొచ్చంటూ రాష్ట్ర బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. కర్ణాటకలో నాలుగు రాజ్య సభ సీట్లు ఖాళీ అవుతుండడం, ఇందులో బీజేపీకి అవకాశం ఉందంటున్నారు. కర్ణాటకలో ఒక్కో ఎంపీ ఎంపికకు 44 సీట్లు అవసరం అయితే, బీజేపీకి 43 సీట్లు ఉండడంతో, ఇతరుల సహకారంతో ఆ సీటు బరిలో నిర్మలా సీతారామన్‌ను దించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.