న్యూఢిల్లీ: ఉన్ని దుస్తులు, హ్యాండ్‌బ్యాగ్స్, షూ, బెల్ట్స్ వంటి వస్తువుల తయారీకి విరివిగా వినియోగించే నక్క తోలు, మొసలి చర్మాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యాషన్ వస్తువుల తయారీ కోసమే జంతువులను యథేచ్ఛగా వధిస్తున్నారన్న వాదనతో ఏకీభవిస్తూ నక్క తోలు, మొసలి చర్మాల దిగుమతిపై నిషేధం విధించింది.
కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖలో అంతర్భాగమైన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్‌టీ) ఈ మేరకు జనవరి 3న నోటిఫికేషన్ జారీచేసింది. మొసలి చర్మంతో తయారయ్యే హ్యాండ్‌బ్యాగులు, షూ, బెల్ట్, పర్స్‌లాంటి వస్తువులకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక నక్క తోలుతో తయారయ్యే ఉన్ని దుస్తుల ధారణ గొప్ప ఫ్యాషన్‌గా కొనసాగుతున్న విషయం విదితమే.
విచ్చలవిడిగా సాగుతోన్న జంతువధను, వాటితో తయారయ్యే వస్తువుల వాడకంపై స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ.. ఆందోళనకారులకు మద్దతు పలకడమేకాక, జంతు చర్మాల దిగుమతిపై నిషేధం విధించాలని కోరుతూ వాణిజ్య, పరిశ్రమల శాఖకు పలు మార్లు లేఖలు రాశారు. దీంతో విదేశాల నుంచి వాటి దిగుమతిని డీజీఎఫ్‌టీ నిషేధించింది. దేశీయంగా ఈ నిషేధం చాలా కాలం నుంచే అమలులోఉంది.
నక్క తోలుపై కేంద్రం కీలక నిర్ణయం
Published Fri, Jan 6 2017 9:27 AM | Last Updated on Fri, May 25 2018 2:36 PM
Advertisement