ఈయూ నిషేధంతో ఎగుమతులకు దెబ్బ
రూ. 6,300 కోట్లు తగ్గనున్న ఎగుమతులు
- కొత్త ఫార్మాసిటీతో అంతర్జాతీయ ఫార్మా కేంద్రంగా హైదరాబాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూరోపియన్ యూనియన్ నిషేధించిన 700 జెనరిక్ ఔషధాల వల్ల రూ.6,300 కోట్ల విలువైన ఎగుమతులు తగ్గుతాయని కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. జీవీకే బయో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో లోపాలున్నాయంటూ యూరోపియన్ యూనియన్ ఈ మధ్యనే 700 జెనరిక్ ఔషధాల అమ్మకాలను నిషేధించిన సంగతి తెలిసిందే. యూరోపియన్ యూనియన్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో ఎగుమతులు 1-1.2 బిలియన్ డాలర్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఫార్మాక్సిల్) అంచనా వేసింది.
ఈ నిర్ణయంతో యూరోపియన్ దేశాల ఎగుమతలు 30 శాతం క్షీణిస్తాయని భావిస్తున్నట్లు ఫార్మాక్సిల్ డెరైక్టర్ జనరల్ పి.వి.అప్పాజీ చెప్పారు. సోమవారం బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరింగ్ అసోసియేషన్ (బీడీఎంఏ) నిర్వహించిన సమావేశంలో అప్పాజీ విలేకరులతో మాట్లాడుతూ గతేడాది దేశం నుంచి 15.4 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఎగుమతులు జరగ్గా అందులో యూరోపియన్ యూనియన్ వాటా సుమారు 3 బిలియన్ డాలర్లు ఉందన్నారు. ఈ నిషేధం అవాంఛనీయమైనదని, దీనికి సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై ఒకటి రెండు రోజుల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ధరలను నియంత్రించకూడదు: సతీష్ రెడ్డి
అంతకుముందు ‘యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్’ సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ కె. సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఔషధాల ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదన్నారు. కొన్ని ఔషధాల ధరలపై నియంత్రణల వల్ల ఈ ఔషధాల తయారీకి కంపెనీలు ముందుకు రావడం లేదని, అలా కాకుండా మార్కెట్ పరిస్థితులకే ధరలను వదిలేస్తే పోటీ పెరిగి ధరలు తగ్గుతాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చెపుతున్నట్లు అన్ని మౌలిక వసతులతో ఫార్మా సిటీని అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ ఫార్మా హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రసాయనాలు, ఫెర్టిలైజర్స్ శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ మాట్లాడుతూ ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టడానికి దేశీయంగా అనేక అవకాశాలున్నాయన్నారు. కార్యక్రమంలో బీడీఎంఏ ప్రతినిధుల సహా వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.