ఎగుమతులు మిస్
న్యూఢిల్లీ: దేశ ఎగుమతులు రివర్స్‌గేర్‌లోకి జారాయి. ఈ ఏడాది మార్చి నెలలో ఎగుమతులు 3.15 శాతం క్షీణించి 29.57 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మరోపక్క, దిగుమతులు సైతం 2.11 శాతం తగ్గుదలతో 40 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక వాణిజ్య లోటు(ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం) మార్చి నెలలో స్వల్పంగా తగ్గి 10.5 బిలియన్ డాలర్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే నెలలో వాణిజ్య లోటు 10.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మార్చిలో ఎగుమతులు తగ్గడానికి అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఇతర కారకాలతో పాటు దేశీయంగా తయారీ రంగం పేలవ పనితీరూ కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ అంతంతమాత్రంగానే ఉందని, వచ్చే నెలల్లో మెరుగుపడవచ్చని భారతీయ ఎగుమతిదారుల సంఘాల సమాఖ్య ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ వ్యాఖ్యానించారు.
లక్ష్యానికి కొద్దిగా దూరంలో...
గడిచిన 2013-14 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 325 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా 312 బిలి యన్ డాలర్లు మాత్రమే ఎగుమతులు జరిగాయి. అంటే లక్ష్యానికి 13 బిలియన్ డాలర్లు తగ్గాయి. అయితే, 2012-13లో నమోదైన 300 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పోలిస్తే దాదాపు 4 శాతం వృద్ధి నమోదైంది. ఇక దిగుమతులు 2012-13తో పోలిస్తే 8.11% తగ్గుదలతో 451 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 139 బిలియన్ డాలర్లకు తగ్గుముఖం పట్టింది. 2012-13లో వాణిజ్య లోటు 190 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనికి ప్రధానంగా వెండి, బంగారం దిగుమతులు భారీగా దిగిరావడమే కారణం.
పుత్తడి-వెండి
దిగుమతులు 40% డౌన్...
గతేడాది(2013-14)లో వాణిజ్య లోటు కట్టడికి ప్రధానంగా బంగారం, వెండి దిగుమతులు భారీగా తగ్గడమే కారణం. ఈ రెండు విలువైన లోహాల దిగుమతులు 40% మేర క్షీణించి 33.46 బిలియన్ డాలర్లకు చేరాయి. బంగారం దిగుమతులపై ప్రభుత్వం విధించిన కస్టమ్స్ సుంకం పెంపు(10%కి) ఇతరత్రా ఆంక్షలు వీటికి కళ్లెం వేసేందుకు దోహదపడ్డాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు లోహాల దిగుమతుల విలువ 55.79 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక ఈ ఏడాది మార్చిలో బంగారం, వెండి దిగుమతుల విలువ 2.75 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో 3.33 బిలియన్ డాలర్లతో పోలిస్తే 17.27% దిగుమతుల విలువ తగ్గడం గమనార్హం.