గుడ్డు.. రికార్డు!
అమాంతం పెరిగిన ధర
కార్తీకం ముగియడంతోనే ధరకు రెక్కలు
కార్తీకం పుణ్యాన నెల్నాళ్లు ఒదిగి ఉన్న గుడ్డు పుణ్యకాలం పూర్తి కాగానే విశ్వరూపం చూపిస్తోంది. రికార్డు స్థాయిలో గుడ్డు చిల్లర ధర రూ.5కు పెరిగింది. గత 15 రోజుల్లోనే 49 పైసల పెరుగుదల నమోదు కావడం గతంలో ఎన్నడూ లేదని వ్యాపారులే అంటున్నారు.
విశాఖపట్నం : కార్తీకమాసం ముగిసీ ముగియగానే కోడి గుడ్డు ధర కొండెక్కేసింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ధర పెరిగింది. కూరగాయల ధరలు ఆకాశంలో విహరిస్తున్న సమయంలో కోడిగుడ్డే సామాన్యులను ఆదుకుంది. దాదాపు మూడు నెలల పాటు అందుబాటులో ఉన్న గుడ్డు ఇప్పుడు భారమవుతోంది. ప్రస్తుతం హోల్‌సేల్‌లో వంద గుడ్ల ధర రూ. 405లకు చేరింది. రిటైల్ మార్కెట్లో విడిగా రూ.5లకు విక్రయిస్తున్నారు. వాస్తవానికి హోల్‌సేల్ కంటే రిటైల్ ధర గుడ్డుకు గరిష్టంగా 50 పైసలు అధికంగా ఉంటుంది. కానీ అర్థ రూపాయికి కాలం చెల్లడంతో మధ్యలో బ్రేక్ లేకుండా వినియోగదారుడిపై ఏకంగా రూపాయి భారం పడుతోంది.
పెరిగిన వాడకం
నిజానికి కార్తీకమాసంలో పూజల సెంటిమెంట్‌తో మాంసాహారం వినియోగం బాగా తగ్గుతుంది. అందువల్ల వీటి అమ్మకాలు గణనీయంగా తగ్గిపోతాయి. దీంతో ధరలు తగ్గించి విక్రయాలు జరపడంతో గుడ్డు అందరికీ అందుబాటులో ఉంటుంది. శనివారంతో కార్తీకమాసం పూర్తయింది. మరోవైపు చలికాలమూ మొదలైంది. మళ్లీ గుడ్ల వాడకం పెరుగుతుంది. అదే సమయంలో కోడిగుడ్లను ఈశాన్య రాష్ట్రాల్లో ఈ చలి సీజనులో మామూలు రోజులకంటే అధికంగా తింటారు. ప్రస్తుతం ఒడిశా, బిహార్, పశ్చిమ బంగ, త్రిపుర, నాగాలాండ్, అస్సాం, మణిపూర్ తదితర రాష్ట్రాలకు మన రాష్ట్రం నుంచి గుడ్ల ఎగుమతులు ఊపందుకుంటాయి. వీట న్నింటినీ ఆసరాగా చేసుకుని గుడ్ల ధరలు పెంచుతున్నారు.
15 రోజుల్లో 49 పైసలు పెరుగుదల
గత నెల 14న వంద గుడ్ల ధర (హోల్‌సేల్) రూ.355, ఈనెల ఒకటిన రూ.356 ఉంది. అంటే ఆ పదిహేను రోజుల్లో కేవలం గుడ్డుపై ఒక్క పైసా మాత్రమే పెరిగింది. అప్పట్నుంచి రోజుకు మూడు నాలుగు పైసలు చొప్పున పెరుగుతూ ఆదివారం నాటికి రూ.400కు (గుడ్డు రూ.4.05లకు) చేరుకుంది. అంటే గుడ్డుపై 15 రోజుల వ్యవధిలో 49 పైసలు పెరిగిందన్న మాట! ఇప్పటిదాకా కోడిగుడ్డు ధర 2013 డిసెంబర్ 21న రూ.4.02 పైసలకు పెరగడమే రికార్డు. తాజా ధరతో అది చెరిగిపోయి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఉత్తరాంధ్రలో 20 లక్షల గుడ్ల ఉత్పత్తి
ఉత్తరాంధ్రలో రోజుకు వివిధ పౌల్ట్రీల నుంచి సుమారు 20 లక్షల గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. వీటిలో స్థానికంగా 60 శాతం గుడ్లు వినియోగమవుతాయి. మిగిలినవి ఆయా రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. వినియోగం పెరగడంతో పాటు కోళ్ల దాణా ధరలు, ఇతర ఉత్పత్తి వ్యయం కూడా బాగా పెరిగినందున గుడ్ల ధరలు పెంచక తప్పడం లేదని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు.