సాక్షి, అమరావతి: కోడిగుడ్డు ధర ఊహించని రీతిలో పెరుగుతోంది. ఫారమ్ గేటు వద్ద రికార్డు స్థాయిలో ఒక్కో గుడ్డు ధర రూ.5.25 పలుకుతుండగా.. రిటైల్‌గా రూ.6.50 వరకు విక్రయిస్తున్నారు. ఇదే ధర మరికొంత కాలం కొనసాగితే.. నష్టాల నుంచి గట్టెక్కుతామని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలో 1,200 కోళ్ల ఫారాలు ఉండగా.. వాటిలో ప్రస్తుతం 5.60 కోట్లకు పైగా కోళ్లున్నాయి.
రోజుకు 6 కోట్ల గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ మేత, ఇతర ధరలు పెరగడంతో కోళ్ల ఉత్పత్తి సంఖ్య తగ్గిపోగా.. రోజుకు 4.75 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్ర పరిధిలో నిత్యం 2.50 కోట్ల నుంచి 3 కోట్ల గుడ్లు వినియోగమవుతున్నాయి. కాగా, దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు గల్ఫ్ దేశాలకు కోడిగుడ్లు ఎగుమతి అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఫారమ్ గేటు వద్ద ధర రూ.6 దాటే అవకాశం కన్పిస్తోందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రిటైల్ మార్కెట్‌లో గుడ్డు ధర రూ.7 మార్క్‌ను చేరుకునే అవకాశాలు లేకపోలేదంటున్నాయి.
ఎగుమతులకు ఊపు
సాధారణంగా మన రాష్ట్రం నుంచి పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, అస్సాం, మణిపూర్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. కొంతమేర గల్ఫ్‌తో పాటు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. విదేశాల విషయానికి వస్తే ప్రతినెలా 2 కోట్ల గుడ్లు గల్ఫ్ దేశాలకు, 50 లక్షల నుంచి 75 లక్షల వరకు ఇతర దేశాలకు మన దేశం నుంచి ఎగుమతి అవుతుంటాయి.
ప్రస్తుతం టర్కీ, నెదర్లాండ్స్‌లో కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో మన దేశం నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయి. గత నెలలో ఏకంగా 20 కోట్ల గుడ్లు ఎగుమతి అయ్యాయి. 50 లక్షలకు మించి ఎగుమతి కాని కతార్‌కు ప్రస్తుతం 2 కోట్లకు పైగా ఎగుమతి అవుతున్నాయి. ఇతర దేశాలకు కూడా కోటిన్నరకు పైగా గుడ్లు ఎగుమతి అవుతున్నాయి. అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సైతం రాష్ట్రం నుంచి ఎగుమతులు పెరిగాయి. ఫలితంగా గుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి.
రైతులకు ఊరట
మొక్కజొన్న టన్ను గత ఏడాది రూ.20 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.24 వేలకు చేరింది. సోయాబీన్ టన్ను గతేడాది రూ.38 వేల వరకు పలకగా.. ప్రస్తుతం రూ.48 వేల నుంచి రూ.51వేల మధ్య వరకు ఉంది. ఆయిల్ తీసిన తవుడు (డీవోపీ) గతేడాది కిలో రూ.9 నుంచి రూ.10 ఉండగా.. ప్రస్తుతం రూ.17–18 మధ్య ఉంది. ఇలా ఊహించని రీతిలో పెరిగిన మేత ధరల వల్ల పిల్ల దశ నుంచి గుడ్డు పెట్టే దశ వరకు ఒక్కో కోడికి రూ.300 నుంచి రూ.315 వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ కారణంగా ఫారమ్ గేట్ వద్ద ఒక్కో కోడిగుడ్డు ఉత్పత్తికి రూ.4.65 నుంచి రూ.4.75 వరకు ఖర్చవుతోంది. ఫిబ్రవరి నుంచి ఇదే రీతిలో ఖర్చవుతున్నా నెల రోజుల క్రితం వరకు ఫారమ్ గేట్ వద్ద గుడ్డు ధర రూ.3.90కి మించి పలకలేదు. ఫలితంగా పౌల్ట్రీ రైతులు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. కాగా, ప్రస్తుతం ఊహించని రీతిలో విదేశాలకు పెరిగిన ఎగుమతులు దేశీయంగా పౌల్ట్రీ రైతుకు కాస్త ఊరటనిచ్చాయి.
ఎగుమతులు పెరగటం వల్లే..
చాలా రోజుల తర్వాత పౌల్ట్రీ రైతుకు గిట్టుబాటు ధర లభిస్తోంది. ఇది పౌల్ట్రీ పరిశ్రమకు శుభపరిణామం. ఊహించని రీతిలో గల్ఫ్ దేశాలకు ఎగుమతులు పెరగడం వల్లే ఫారమ్ గేటు వద్ద రైతుకు గిట్టుబాటు ధర లభిస్తోంది. గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసే టర్కీ, నెదర్లాండ్స్ దేశాల్లో ఉత్పత్తి తగ్గడం మన గుడ్డుకు కలిసొచ్చింది.
– తుమ్మల కుటుంబరావు, చైర్మన్, ఎన్‌ఈసీఎస్, విజయవాడ జోన్
తొలిసారి గిట్టుబాటు ధర
కృష్ణా జిల్లాలో 70 కోళ్ల ఫారాలు ఉన్నాయి. సుమారు కోటి కోళ్లను పెంచుతుండగా.. 75 లక్షల నుంచి 80 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. పెరిగిన ముడిసరుకు ధరల వల్ల ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒక్కో కోడిపై నెలకు రూ.30 చొప్పున నష్టపోయాం. ఆ తర్వాత నెలకు రూ.10నుంచి రూ.15 మేర నష్టాలను చవిచూశాం. ప్రస్తుతం ఫారమ్ గేట్ వద్ద గుడ్డు తయారీకి రూ.4.75 వరకు ఖర్చవుతుండగా.. తొలిసారి రూ.5.25 ధర లభిస్తోంది. చాలా ఆనందంగా ఉంది. ఇదే రీతిలో కనీసం ఏడాది పాటు కొనసాగితే నష్టాల నుంచి గట్టెక్కగలం.
– ఆర్.సత్యనారాయణరెడ్డి, అధ్యక్షుడు, కృష్ణాజిల్లా లేయర్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
(చదవండి: సీఎం జగన్ దూరదృష్టికి నిదర్శనమే ఆర్బీకేలు: బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ప్రశంస)
Comments
Please login to add a commentAdd a comment