సాక్షి, సిటీబ్యూరో: కోడి ధర కొండ దిగింది. వారం రోజుల్లోనే చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. దీంతో పౌల్ట్రీ రైతులు, వ్యాపారులు పరేషాన్ అవుతున్నారు. వారం క్రితం రూ.160 ఉన్న లైవ్ బర్డ్ 100 రూపాయలకు తగ్గింది. అలాగే రూ.180 ఉన్న విత్‌స్కిన్ చికెన్ 120కు, రూ.210 ఉన్న స్కిన్‌లెస్ చికెన్ 140కి తగ్గింది. మొత్తంమీద వారంలో చికెన్ ధరలు దాదాపు రూ.60 వరకు పడిపోయాయి. వాస్తవంగా ఇది హోల్‌సేల్, ఫారంగేట్ ధరల్లో వ్యత్యాసం. రిటైల్ మార్కెట్లో మాత్రం ధరలు కాస్త ఫర్వాలేదన్నట్లుగా ఉన్నాయి. సాధారణంగా వేసవిలో చికెన్ ధరలు తగ్గుతాయి. కాని ప్రారంభంలోనే భారీస్థాయిలో ధరలు పతనమవడంతో పౌల్ట్రీ రైతులు దిగాలు చెందుతున్నారు.
ధరలు తగ్గడానికి కారణాలివే..
మన దగ్గర కోళ్ల ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి పెరగడంతో ధరలు తగ్గినట్లు పౌల్ట్రీ రంగం నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎండ కాలంలో చికెన్ ధరలు కాస్త తగ్గు ముఖం పట్టడం సహజం. కానీ వేసవి ప్రారంభంలోనే భారీగా తగ్గడంతో పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రం మొత్తంమీద 9 కోట్ల కోళ్లు ఉంటే ఇందులో సగానికి సగం గ్రేటర్ శివారు, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో లేయర్ కోళ్లు నాలుగున్నర కోట్లు , బ్రాయిలర్ నాలుగున్నర కోట్లు ఉన్నాయని అంచనా. హోల్‌సేల్ మార్కెట్‌లో రైతుకు కోడి గుడ్డు ధర రూ.3.80 పైస ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం రూపాయి నష్టానికి రూ.2.80కే అమ్ముకోవాల్సి వస్తుంది.
దిగుమతులు పెరిగాయి
తెలంగాణ రాష్ట్రంతో పాటు, మహారాష్ట్ర నుంచి కోళ్ల దిగుమతి పెరిగింది. ఎండా కాలం అవడంతో చికెన్ డిమాండ్ కూడా తగ్గింది. కోడి పారం ధర రూ.65 ఉంది. హోల్‌సెల్ ధర రూ.75 వరకు ఉంది. గత వారం రోజుల్లో కిలోకు దాదాపు రూ.50 నుంచి 60 వరకు తగ్గింది. కానీ రిటైల్ మార్కెట్‌లో చికెన్ ధరలు తగ్గడం లేదు. – డాక్టర్ రంజిత్ రెడ్డి, తెలంగాణ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
వేసవిలో ధరలు తగ్గుతాయి
ప్రతి ఏటా మార్చి నెల నుంచి గుడ్ల ధరలు తగ్గుతాయి. ప్రత్యేకంగా ఉగాది, శ్రీరామ నవమి నుంచి ధరలు తగ్గుముఖం పడతాయి. వేసవిలో గుడ్ల వినియోగం కాస్త తగ్గుతుంది. అందుకే ధరలు తగ్గుతాయి.
– సంజీవ్ చింతావర్, బిజినెస్ మేనేజర్ నెక్
Comments
Please login to add a commentAdd a comment