తణుకు: చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. సాధారణంగా ఎండాకాలం మొదలవగానే చికెన్ ధరలు తగ్గుతుంటాయి. అయితే ఒక్కసారిగా ఉత్పత్తి తగ్గడంతో ధర అమాంతం పెరిగింది. వారం రోజుల క్రితం వరకు కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.180, స్కిన్ చికెన్ రూ. 160 ఉండగా.. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో స్కిన్ చికెన్ రూ.280కు విక్రయిస్తున్నారు. స్కిన్ లెస్ రూ.300 పలుకుతోంది. ఈ ధరలు చూసి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడంలేదు. దాంతో వ్యాపారాలు మందగించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల మేత ధరలు విపరీతంగా పెరగడంతో కొత్త బ్యాచ్‌లు వేసేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. దీంతో బహుళజాతి సంస్థల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా చికెన్ ధరలకు రెక్కలు వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
మేత ధరల మోత
పశ్చిమ గోదావరి జిల్లాలో సాధారణంగా రోజుకు 2 లక్షల కిలోల మేర చికెన్ వినియోగిస్తుండగా ఆదివారం, ఇతర పండుగల రోజుల్లో రెట్టింపు అమ్మకాలు జరుగుతుంటాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 ఫారాల్లో 8 లక్షలకు పైగా బ్రాయిలర్ కోళ్లు పెరుగుతున్నాయి. సాధారణంగా ఎండలు పెరుగుతున్న సమయంలో చికెన్ ధర తగ్గుతుంది. ఈ సారి ధర పెరగడంతో అటు వ్యాపారులు, ఇటు సామాన్యులకు చికెన్ గుబులు పుట్టిస్తోంది. సాధారణంగా రెండు కిలోల కోడి తయారు కావడానికి 40 రోజులు సమయం పడుతుంది. ఎండాకాలంలో మేత సరిగ్గా తినకపోవడంతో 60 రోజులు పడుతోంది. ఈ పరిస్థితుల్లో మేత ధరలు అమాంతం పెరగడంతో కొత్త బ్యాచ్‌లు వేయడంలేదు. దీంతో అనుకున్న సమయానికి కోళ్లు ఉత్పత్తి కావడంలేదు. మరోవైపు పౌల్ట్రీ రైతులు నష్టాల బాట పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ధరలు పెంచుతున్నారు. బ్రాయిలర్‌తో పోల్చితే లేయర్ చికెన్ ధరలు పెద్దగా పెరగకపోవడం వినియోగదారులకు కొంత ఊరటనిస్తోంది.
డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదు
మేత ధరలు పెరిగిపోవడంతో రైతులు కొత్త బ్యాచ్‌లు వేసేందుకు ముందుకు రావడంలేదు. దీంతో జిల్లాలో డిమాండ్‌కు తగినట్లుగా కోళ్లు అందుబాటులో లేవు. దీంతో చికెన్ ధర పెరిగింది. మేత ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా కేవలం రెండు నెలల్లో మూడు రెట్లు పెరిగాయి. మేత ధరలు తగ్గి కొత్త బ్యాచ్‌లు వస్తేనే ధరలు తగ్గుతాయి.
– బండి గణేష్, చికెన్ వ్యాపారి, తణుకు
తగ్గిన బ్రాయిలర్ కోళ్ల పెంపకం
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఇతరత్రా కారణాలతో కొద్ది రోజుల వ్యవధిలోనే మేత ధర పెరిగింది. స్థానిక ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుండటం, కొత్త పంటలు మార్కెట్‌లోకి రాకపోవడం మేత ధర పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. బ్రాయిలర్ కోడి మేతలో ప్రధానమైన సోయాబీన్ ధర నెల రోజుల్లో కిలోకు ఏకంగా రూ. 35 నుంచి రూ.90కి పెరిగింది. మొక్కజొన్న కిలో రూ. 12 నుంచి రూ. 24కి పెరిగింది. ఈ పరిస్థితుల్లో బ్రాయిలర్ కోళ్ల పెంపకం సగానికిపైగా తగ్గిపోయింది. దీంతో ఉభయగోదావరి జిల్లాలతోపాటు తెలంగాణలోని బ్రాయిలర్ కంపెనీల నుంచి స్థానిక వ్యాపారులు కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బ్రాయిలర్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment