కోడి కొనలేం.. గుడ్డు తినలేం | Chicken And Egg prices hit a high | Sakshi
Sakshi News home page

కోడి కొనలేం.. గుడ్డు తినలేం

Published Sun, Jan 5 2020 4:23 AM | Last Updated on Sun, Jan 5 2020 4:24 AM

Chicken And Egg prices hit a high - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: గత కొన్ని రోజులుగా కొండెక్కిన కోడి ధర కిందికి దిగిరానంటోంది. ఆదివారం అలవాటుగా నాన్‌ వెజ్‌ తిందామనుకునే మాంసాహార ప్రియులకు చికెన్‌ ధరలు షాకిస్తున్నాయి. కిలో చికెన్‌ రేటు రూ. 200లు దాటిపోవడంతో కొనేందుకు దుకాణాలకు వెళ్లిన మాంసాహార ప్రియులు అమ్మో! అంత రేటా.. అని నోరెళ్లబెడుతున్నారు. చికెన్‌కు పోటీగా గుడ్డు కూడా కొనుగోలుదారుల జేబుకు చిల్లుపెడుతోంది. రిటైల్‌ మార్కెట్‌లో గుడ్డు ధర రూ. 6లుగా ఉంది. కూరగాయల రేట్లు దిగివస్తున్నా.. వీటి ధరలకు మాత్రం రెక్కలొచ్చాయి.  

డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడం వల్లే.. 
సాధారణంగా శీతాకాలంలో మాంసం, కోడిగుడ్లను ఎక్కువగా తింటారు. ఆ డిమాండ్‌కు తగినట్లు సరఫరా లేకపోవడంతో ధర పెరుగుతూ ఉంది. నెలన్నర రోజులుగా స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర కిలో రూ.190 నుంచి కిందికి దిగిరాలేదు. ఇప్పుడది రూ.200కి చేరింది. వారం రోజుల క్రితం బ్రాయిలర్‌ చికెన్‌ ధర కిలో రూ.214కి చేరి కంగారెత్తించింది. ఈ సీజనులో ఇదే అత్యధిక ధర. గత ఏడాది కూడా చికెన్‌ కిలో ధర రూ.200 చేరి తర్వాత దిగొచ్చింది. ఇప్పుడు మాత్రం రేటు పైపైకే తప్ప సామాన్యుడికి అందుబాటులోకి రావడం లేదు. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో రోజుకు సగటున 2 లక్షల కిలోల చికెన్‌ను వినియోగిస్తారు. ఆదివారం 3 లక్షల కిలోల వరకు చికెన్‌ విక్రయాలు జరుగుతాయి. అయితే ఆ స్థాయిలో కోళ్ల లభ్యత లేకపోవడం వల్ల ధరలు స్వల్పంగా పెరిగాయని కోళ్ల ఫారాల రైతులు చెబుతున్నారు.  

‘గుడ్లు’ తేలేసేలా ధర 
మరోవైపు కోడిగుడ్డు ధర వింటే గుడ్లు తేలేసేలా ఉంది. గుడ్డు ధర మార్కెట్లో రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం వంద గుడ్లకు రైతుకు చెల్లించే ధర రూ.473గా ఉండగా.. రిటైల్‌ మార్కెట్లో డజన్‌ గుడ్ల ధర రూ.66 వరకు ఉంది. రైతు బజార్‌లో విడిగా ఒక్కొక్కటి రూ.6కు అమ్ముతున్నారు. నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ (నెక్‌) విజయవాడ జోన్‌ పరిధిలో కృష్ణా, విజయవాడ, గుంటూరు జిల్లాలుండగా.. ఒక్క కృష్ణా జిల్లాలోనే రోజుకు 80 లక్షల గుడ్ల వరకు ఉత్పత్తవుతున్నాయి. వీటిలో 50 శాతం స్థానికంగా వినియోగిస్తుండగా మిగతా ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, అస్సాం తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం చలికాలం కావడం వల్ల స్థానికంగా, ఈశాన్య రాష్ట్రాల్లో కోడిగుడ్ల వినియోగం పెరిగింది. మరోవైపు గిట్టుబాటు కాక కొంతమంది కోళ్ల ఫారాల రైతులు బ్యాచ్‌లు తగ్గించారు. దీంతో గుడ్ల ఉత్పత్తి తగ్గి కోడిగుడ్ల ధరలు పెరిగాయని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు.  

దిగొస్తున్న కూరగాయలు 
కూరగాయల ధరలు దిగొస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు కిలో రూ.30 నుంచి రూ.50 వరకూ పలికిన కూరగాయల ధరలు తగ్గాయి. రైతు» బజార్లలో కిలో టమోటా రూ.13, వంగ రూ.14, బెండ రూ.20, కాకర, గోరుచిక్కుడు రూ.18, కాలీఫ్లవర్‌ రూ.15, చిక్కుడుకాయలు రూ.24, బంగాళాదుంపలు రూ.25కు దొరుకుతున్నాయి. బయట మార్కెట్లో రూ.5 నుంచి 10లు పెంచి విక్రయిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం రైతుబజార్లు, మార్కెట్‌ యార్డుల్లో కిలో రూ.15కే ఉల్లిపాయలను అందుబాటులో ఉంచింది. బయట కిలో రూ.100–150 వరకు పలికిన ఉల్లిపాయలు ఇప్పడు రూ.60కు లభ్యమవుతున్నాయి.  

గుడ్ల రేటు పెరగడంతో రైతుకు ఉపశమనం 
కోళ్ల మేత ధరలు బాగా పెరిగాయి. కిలో రూ.14 ఉండే మొక్కజొన్న రూ.26 వరకు పెరిగింది. సోయా కూడా పెరగడంతో రైతులు నష్టపోతున్నారు. ఈ తరుణంలో గుడ్ల ధరల పెరుగుదల రైతుకు కాస్త ఊరటనిస్తోంది. అయితే ఈ గిట్టుబాటు ధరలు మరో రెండు నెలల వరకే కొనసాగుతాయి. ఆ తర్వాత ఎండలు మొదలైతే తగ్గుముఖం పడతాయి.  
–కుటుంబరావు, నెక్‌ విజయవాడ జోన్‌ చైర్మన్‌ 

ఈ ధరలు కొన్నాళ్లే.. 
కోళ్ల దాణా ధరలు, నిర్వహణ వ్యయం పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత చికెన్‌ ధర పౌల్ట్రీ రైతులకు గిట్టుబాటుగానే ఉంది. ఇవి కొన్నాళ్ల పాటే కొనసాగుతాయి. 
– వెంకటేశ్వరరావు, అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్, ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement