
ఇబ్బందుల్లో సెంటర్ నిర్వాహకులు
అమ్మకాలు తగ్గినా తగ్గని ధర
తినేందుకు ముందుకు రాని ప్రజలు
ఆదివారమైనా చికెన్‌కు దూరందూరం
జగిత్యాల: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చికెన్ అమ్మకాలు భారీగా తగ్గాయి. చికెన్ సెంటర్లు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. కోళ్లకు బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తోందని, చికెన్ తినొద్దని ఇటీవల ప్రభుత్వం నుంచి ప్రకటన రావడంతో కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు, కొన్ని జిల్లాలో బర్డ్‌ఫ్లూ కేసులు నమోదు కావడంతో ఉమ్మడి జిల్లాలో భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కువగా ఉడికించిన చికెన్ తింటే వైరస్ ఉండదని అధికారులు చెబుతున్నా వైరస్ వ్యాపిస్తోందని సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ కావడంతో ప్రజలెవరూ ముందుకు రావడం లేదు. మరోవైపు చికెన్ అమ్మకాలు పడిపోయినా రేటు మాత్రం తగ్గడం లేదు. ఉమ్మడి జిల్లాలో ప్రతి చికెన్ సెంటర్‌లో సగానికిపై విక్రయాలు తగ్గిపోయాయి.
అసలే పెళ్లిళ్ల సీజన్
ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ప్రస్తుతం మంచి రోజులు కావడంతో రెండునెలలపాటు శుభకార్యాలు అధికంగా ఉన్నాయి. శుభకార్యాల్లో చికెన్ తప్పనిసరి. ఈ క్రమంలో బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో వివాహాల్లో చికెన్ వడ్డించాలా..? వద్ద సంశయంలో ప్రజలు ఉన్నారు. చాలా మంది చికెన్ తినాలంటే జంకుతుండటంతో మటన్, ఫిష్, ఎగ్స్ పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. చికెన్‌కు కొంత తక్కువ ధర ఉండటంతో చాలామంది దీనివైపే దృష్టి సారిస్తుంటారు. ప్రభుత్వ హాస్టళ్లు, వైద్య కళాశాల హాస్టళ్లలో చికెన్ నిలిపివేస్తున్నారు. మటన్, చేపలకు రేటు ఎక్కువగా ఉండటంతో అది కూడా పెట్టలేని పరిస్థితి నెలకొంది.
తగ్గని రేటు
చికెన్ విక్రయాలు పడిపోయినా ధరలు మాత్రం తగ్గడం లేదు. చికెన్ రేటు కిలోకు రూ.200 కిలో పలుకుతోంది. మరికొందరు కిలోకు రూ.180 నుంచి రూ.160వరకు విక్రయిస్తున్నారు. మరిన్ని రోజులు బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉండటంతో చికెన్ సెంటర్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికెన్ కాకుండా గుడ్ల విక్రయాలు కూడా సగానికి పడిపోయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడ బర్డ్‌ఫ్లూ కేసులు నమోదు కాలేదని పశుసంవర్దక శాఖ అధికారులు పేర్కొంటున్నా ప్రజల్లో మాత్రం భయాందోళనలు నెలకొన్నాయి. ఒకవైపు పశువైద్యాధికారులు పౌల్ట్రీలపై దృష్టి పెట్టామని, అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటున్నారు.
కానీ ప్రజల్లో మాత్రం భయాందోళనలు పోవడం లేదు. దుకాణాల అద్దె, వర్కర్స్‌కు జీతాలు, విద్యుత్ బిల్స్, కోళ్ల క్రయవిక్రయాల్లో పెట్టిన పెట్టుబడి రాక ఇబ్బందులకు గురవుతున్నారు. మళ్లీ ఎప్పుడు పుంజుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీల వద్ద కోళ్లను కొనుగోలు చేయకుండా ఉన్న కోళ్లను విక్రయించేలా చికెన్ సెంటర్ల నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ కంపెనీల వద్ద నుంచి కోళ్లను కొనుగోలు చేసినా సేల్స్ లేకపోవడంతో అధిక నష్టం వచ్చే అవకాశం ఉండటంతో చికెన్ సెంటర్ల నిర్వాహకులు భయాందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment