కేజీ చికెన్ ధర రూ.180
ఒక కోడిగుడ్డు ధర రూ.7
జ్యోతినగర్(రామగుండం): బహిరంగ మార్కెట్‌లో కోడిగుడ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఒకకోడిగుడ్డు రిటెయిల్ ధర రూ.7గా పలుకుతోంది. హోల్‌సేల్‌గా రూ.6.50గా ధర ఉంది. చలికాలంలో కోడిగుడ్ల ధరలు పెరగడం సాధారణమేనని, కానీ, ఈస్థాయిలో ధర పెరగడం అరుదని కొందరు వ్యాపారులు వివరిస్తున్నారు.
క్రిస్మస్, న్యూ ఇయర్ కేక్‌ల కోసం..
ఈనెలలో క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకల్లో ప్రధానంగా కేక్‌లు కట్‌చేసి మిఠాయిలు పంచుకుంటారు. ఇప్పటికే జిల్లాలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇదేసమయంలో కేక్‌ల వినియోగం, విక్రయాలూ పెరిగాయి. కేక్‌ల తయారీలో కోడిగుడ్ల వినియోగం అధికంగా ఉంటుంది. దీంతో సహజంగానే వాటికి డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు.. న్యూ ఇయర్ వేడుకల కోసం కొందరు ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. వివిధ డిజైన్లలో కేక్‌లు తయారు చేసుకునేందుకు ఆర్డర్లు ఇస్తున్నారు. దీంతో బేకరీలు, మిఠాయి దుకాణదారులు కోడిగుడ్లు కొనుగోలు చేయడం అధికమైంది. ఫలితంగా మార్కెట్‌లో కోడిగుడ్లకు ధర పెరుగుతోందని వ్యాపారులు అంటున్నారు.
కార్తీకం నేపథ్యంలో దిగివచ్చిన చికెన్
కార్తీక మాసం నేపథ్యంలో చికెన్ ధరలు తగ్గాయి. కార్తీక మాసానికి ముందు కేజీ చికెన్ ధర రూ.230వరకు పలికింది. ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉండడంతో డిమాండ్ పడిపోయిందని, ఫలితంగా చికెన్ ధరలు దిగొచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం కేజీ చికెన్ ధర రూ.180గా పలుకుతోది. మరోవైపు.. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వరకు చికెన్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.
చలికాలమే కారణం..
30 గుడ్లు గల ట్రే ధర రూ.195గా ఉంది. హోల్‌సేల్‌గా గుడ్డు ధర రూ.6.50గా ఉంది. చలికాలంలో గుడ్ల ధరలు పెరుగుతుంటాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా వీటి వినియోగం అధికమైంది.
– గుండ చంద్రమౌళి, హోల్‌సేల్ వ్యాపారి, ఎన్టీపీసీ
Comments
Please login to add a commentAdd a comment