రేవంత్‌.. చైనా ఫోన్‌ లాంటి పాలన నీది: కవిత | BRS MLC Kavitha Satirical Comments On Revanth Reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌.. చైనా ఫోన్‌ లాంటి పాలన నీది: కవిత

Published Mon, Feb 10 2025 12:06 PM | Last Updated on Mon, Feb 10 2025 12:33 PM

BRS MLC Kavitha Satirical Comments On Revanth Reddy

సాక్షి, జగిత్యాల: తెలంగాణలో కేసీఆర్ పాలన ఐఫోన్‌లా ఉంటే.. రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్‌లా ఉందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ కవిత. చైనా ఫోన్‌ చూడటానికే బాగుంటుంది కానీ.. సరిగా పనిచేయదు. రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలి అని డిమాండ్‌ చేశారు. అలాగే, ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు  బయటపెట్టడం లేదు? అని ప్రశ్నించారు.

జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్‌ పాలనకు, రేవంత్‌ రెడ్డి సర్కార్‌కు ఎంత తేడా ఉందో ప్రజలే గమనిస్తున్నారు. మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకుని సీఎం రేవంత్‌ రెడ్డి బురిడీ కొట్టిస్తున్నాడు. ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదు?. తూతూ మంత్రంగా పొన్నం ప్రభాకర్‌ బీసీ సంఘాలతో సమావేశం పెట్టారు. బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడక పోవడం బీసీలను అవమానించడమే అవుతుంది.

బీసీ కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలి. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదు. మరో తెలంగాణ పోరాటం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలి. 52 శాతం బీసీలు ఉన్నారని 2014లోనే కేసీఆర్ లెక్క తేల్చారు. బీసీల సంఖ్యను తక్కువ చూపించడం శోచనీయం. ఈ తప్పుడు లెక్కలు చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంట్‌ను తప్పదోవపట్టించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఎందుకు పెట్టడం లేదు?.

ఎండిన పంటపొలాలను చూస్తుంటే కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. కేసీఆర్‌పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదు. రైతులకు నీళ్లు ఇచ్చే తెలివి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలి. మహిళలను చిన్నచూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి కాలం గుణపాఠం చెబుతుంది. రేవంత్ రెడ్డి తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారు.. తగిన సమయంలో బుద్దిచెబుతారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement