సాక్షి, జగిత్యాల: తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పని అయిపోతుందన్నారు ప్రధాని మోదీ. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందని చెప్పుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ.
కాగా, జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ..‘మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. వికసిత్ భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. మాల్కాజ్‌గిరిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ ప్రజలు అబ్ కీ బార్.. 400 పార్ అంటున్నారు. మొన్ననే లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. గడిచిన మూడు రోజుల్లో రెండు సార్లు తెలంగాణకు వచ్చాను.
దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. భారత్ అభివృద్ధి చెందితే తెలంగాణలో కూడా అభివృద్ధి జరుగుతుంది. బీఆర్‌ఎస్‌పై ప్రజలకు ఉన్న ఆగ్రహం అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడింది. తెలంగాణను దోచుకున్న వాళ్లను మేము వదిలిపెట్టం. మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమం ముఖ్యం. తెలంగాణలో ఎన్నో వేల కోట్ల రూపాయాలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉంటే.. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తే.. నాకు అంత శక్తి వస్తుంది. పసుపు రైతులను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదు. బీజేపీ ప్రభుత్వం పసుపు రైతులకు ఎంతో మేలు చేసింది.
ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పని అయిపోతుంది. పదేళ్లపాటు బీఆర్‌ఎస్ తెలంగాణను దోచుకుంది. తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో బీఆర్‌ఎస్ ఆడుకుంటోంది. ఇప్పుడు కాంగ్రెస్.. తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంటోంది. బీఆర్‌ఎస్‌పై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆ ఫైల్స్‌ను పక్కన పెడుతోంది. కాళేశ్వరం అవినీతిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కుమ్మకయ్యాయి. లిక్కర్ స్కామ్‌లోనూ బీఆర్‌ఎస్ కమీషన్లు తీసుకుంది. బీఆర్‌ఎస్ అవినీతిపై కాంగ్రెస్ దర్యాప్తు చేయడం లేదు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు నన్ను దూషించడమే పనిగా పెట్టుకున్నాయి. కాళేశ్వరంలో బీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడింది. ఇక్కడ దోచిన డబ్బును కుట్రలకు వాడుతున్నారు. తెలంగాణ నుంచి డబ్బులు ఢిల్లీలో కుటుంబ పార్టీ పెద్దలకు వెళ్తున్నాయి. దేశంలో జరిగిన స్కామ్‌లన్నింటికీ కుటుంబ పార్టీలే కారణం.
శివాజీ మైదానంలో రాహుల్ గాంధీ.. తన పోరాటం శక్తికి వ్యతిరేకం అని చెప్పారు. శక్తిని వినాశనం చేసేవాళ్లకు.. శక్తికి పూజ చేసే వాళ్లకు మధ్య పోరాటం జరగబోతుంది. నాకు ప్రతీ మహిళా.. ఒక శక్తి స్వరూపంలా కనిపిస్తుంది. శక్తిని ఖతమ్ చేస్తామన్న రాహుల్ గాంధీ ఛాలెంజ్‌ను నేను స్వీకరిస్తున్నాను. చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతానికి కూడా శివశక్తి అని పేరు పెట్టాను. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో.. జూన్ నాలుగో తేదీన తెలుస్తుంది. నేను భారతమాతకు పూజారిని’ అంటూ కామెంట్స్ చేశారు.
ప్రధాని మోడీ @ జగిత్యాల సభ
- నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు
- లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది
- ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య పండుగ మొదలైంది
- తెలంగాణ ప్రజలు కొత్త ఇతిహాసాన్ని లిఖించేందుకు సిద్ధమయ్యారు
- వికసిత భారత్ లో భాగంగా దేశం అభివృద్ధి చెందితే.. తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది
- నేను గత మూడ్రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు మరోసారి వచ్చాను
- ఆదిలాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం
- తెలంగాణలోని ప్రతి మారుమూల ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాం
- తెలంగాణలో బీజేపీని గెలిపించి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ను సాఫ్ చేయండి
- 4 జూన్ కో.. 400 పార్..
- బీజేపీకి ఓటు వేయాలని తెలుగులో కోరిన ప్రధాని
- నా ముందు శక్తి స్వరూపులైన వేషధారణలో ఉన్న చిన్నారి ఉంది.. ఆమెతో పాటు ఇంతమంది శక్తి స్వరూపులైన మహిళలు నన్ను ఆశీర్వదించేందుకు వచ్చారు
- నిన్న ముంబైలో ఇండి అలయన్స్ ర్యాలీ జరిగింది
- ఆ ర్యాలీలో మేనిఫెస్టో రిలీజ్ చేశారు
- వారు శక్తిని ఖతం చేయడానికి యుద్ధం చేస్తున్నారు
- కానీ నాకు శక్తి స్వరూపులైన మహిళలంతా అండగా ఉన్నారు
- నేను శక్తి స్వరూపులైన మిమ్మల్ని పూజిస్తాను
- భారత మాతకు, శక్తి స్వరూపులైన మహిళలకు పూజారిని
- ఈ ఎన్నికల్లో ఇండి అలయన్స్ శక్తిపై చేస్తున్న యుద్ధాన్ని స్వీకరిస్తున్నాను
- ఈ యుద్ధంలో నేను మీకోసం ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమే..
- భారత గడ్డపై శక్తిని వినాశనం చేస్తానని మాట్లాడుతున్నారు
- యావత్ దేశం శక్తిని పూజిస్తాం
- శివశక్తి పేరుతో చంద్రయాన్ సక్సెస్ చేసుకున్నాం
- శక్తిని వినాశనం చేసే అవకాశం వారికిద్దామా?
- శక్తిని విచ్ఛిన్నం చేసే వారు విచ్ఛిన్నం కావాలా? వద్దా?
- ఈ యుద్ధంలో శక్తిని పూజ చేసే వారు ఒక వైపు.. శక్తిని విచ్ఛిన్నం చేసేవారు ఒకవైపు
- ఈ యుద్ధంలో గెలుపెవరిదో జూన్ 4వ తేదీన తేలనుంది
- తెలంగాణ పుడమి సాధారణమైనది కాదు
- ఆంగ్లేయులు, రజాకార్ల అత్యాచారాలపై పోరాడిన గడ్డ
- తెలంగాణ కలలను కల్లలు చేసింది కాంగ్రెస్
- తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది
- బీఆర్ఎస్.. రాష్ట్రాన్ని దోచుకుంది
- ఇప్పుడు కాంగ్రెస్.. తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంది
- ఇక్కడి ప్రజలు డబ్బులు ఢిల్లీకి చేరుతున్నాయి
- కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలకు చేరుతున్నాయి
- అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు చేసింది..
- కానీ ఇప్పుడు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
- ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు
- బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ నోరు మెదపడం లేదు
- కాళేశ్వరం అవినీతిపై ఎవరూ ప్రశ్నించడంలేదు
- ఎన్నో గ్యారెంటీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిని అమలుచేయడం లేదు
- దీనిపై బీఆర్ఎస్ కూడా నోరుమెదపడం లేదు
- ఈరెండు పార్టీలు ఒకరినొకరు కాపాడుకుంటున్నాయి
- ఈ రెండు పార్టీలకు మోడీని తిట్టడం తప్పితే వేరే పనిలేదు
- ఈ పార్టీల నాయకులు ఎన్నడైనా భారత్ మాతా కీ జై అనడం వినిపించిందా?
- ఈ రెండు పార్టీలు ఎన్ని కవర్ ఫైర్లు చేసినా మేం బయటకుతీస్తాం
- తెలంగాణను దోచుకున్న వారిని విడిచిపెట్టం.. ఇది మోడీ గ్యారెంటీ
- కుటుంబ పార్టీలు కేవలం దేశాన్ని దోచుకునేందుకు రాజకీయం చేస్తాయి, అభివృద్ధి కోసం పనిచేయవు
- దేశంలో అవినీతి ఎక్కడ జరిగినా దాని వెనుక కుటుంబ పార్టీ హస్తం ఉంటుంది
- నేను దీనిపై మీడియా వారికి కూడా హోంవర్క్ ఇస్తున్నా.. కావాలంటే చూసుకోవచ్చు
- 2జీ స్కామ్, బోఫోర్స్, నేషనల్ హెరాల్డ్ కేసులో ఎవరి పేర్లొచ్చాయి?
- ఇలాంటి అవినీతే.. తెలంగాణలోనూ జరిగింది
- కాళేశ్వరం అవినీతితో పాటు లిక్కర్ స్కామ్ తో ఢిల్లీ వరకు వచ్చి కమీషన్లు తిన్నారు
- కాంగ్రెస్.. అయినా.. బీఆర్ఎస్ అయినా.. వారికి దూరంగా ఉండటమే మనకు మెడిసిన్. అందుకే బీజేపీని గెలిపించాలి
- శక్తిని వచ్ఛిన్నం చేసే వారిని విచ్ఛిన్నం చేసేందుకు నాకు మీ ఆశీర్వాదాలతో శక్తినివ్వండి
- కుర్చీతో సంబంధం లేకుండా మీ బాగు కోసం నేనుంటా
- గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పై కోపంతో ఎలాగైనా ఆ పార్టీని ఓడించాలనుకున్నారు.. ఓడించారు
- కానీ ఈసారి జరిగేవి కేంద్రంలో మరోసారి మోడీ సర్కారును తెచ్చేది
- అందుకే బీజేపీకి ఓటు వేయండి
- 2014కు ముదు వరకు ఇతర పార్టీలు చేసిన అభివృద్ధి చూడండి 2014 తర్వాత నుంచి కేవలం పదేండ్లలో జరిగిన అభివృద్ధి చూడండి
- జూన్ లో మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.. మరింత అభివృద్ధి చేపడుతాం..
- బండి సంజయ్, అర్వింద్, గోమాస శ్రీనివాస్ ను తమ్ముళ్లుగా పిలిచి.. మరీ అభ్యర్థులను పరిచయం చేసిన మోడీ
- నేను టెక్నాలజీ వినియోగించి మీతో తెలుగులో మాట్లాడుతాను
- ట్విట్టర్(ఎక్స్) వేదికగా ‘నమో ఇన్ తెలుగు’ డౌన్ లోడ్ చేసుకోండి
- వందకు వంద శాతం కాకపోయినా.. 80 నుంచి 90 శాతం వరకు ఇది సక్సెస్ అవుతుంది
- అందులో ఏమైనా తప్పులు ఉంటే నాకు చెప్పండి
- మీరు నా టీచర్లు.. నాకు తెలుగు నేర్పిస్తారు కదా..
- ఎవరైనా ఏమైనా అంటే.. గడ్ బడ్.. చేయకు.. మోడీ నా జేబులో ఉన్నాడని చెప్పండి
- తెలంగాణలోని ప్రతి మొబైల్ లో మోడీ ఉండాలి
- మీ మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి నాకు అండగా ఉంటానని గ్యారెంటీ ఇవ్వండి
Comments
Please login to add a commentAdd a comment