సాక్షి, జగిత్యాల: గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను ఉద్ధేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలకు పట్టిన శని పోయిందని నియోజకవర్గ ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడు మనషుల విలువ తెలుస్తుందని తెలిపారు. గాలికి గడ్డపారలు కొట్టుకుపోవు. గట్టి నాయకులు కొట్టుకుపోరని అన్నారు. గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమేనని తెలిపారు.
కార్యకర్తలు ఎమ్మెల్యేను తయారు చేశారు కానీ.. ఎమ్మెల్యే, కార్యకర్తలను తయారు చేయలేదని తెలిపారు. వేల మంది కష్టపడితే ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇప్పుడు దొంగల్లో కలిశాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతులకు ఆశపడి పోయిండని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే బుద్ది ఇవాళ తెలిసి వచ్చిందన్నారు.
‘అభివృద్ధి కోసం పోయినా అని సంజయ్ అన్నాడు. జగిత్యాల జిల్లా రద్దు చేస్తా.. మెడికల్, నర్సింగ్ కాలేజీ రద్దు చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నందుకు సంజయ్ కాంగ్రెస్‌లోకి వెళ్లిండా..? రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 4500 డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినందుకు రద్దు చేయమని పోయావా..? ఏ అభివృద్ధి ఆశించి పోయిండు సంజయ్. ఆయన పోయింది ఒక్కదాని కోసం..వియ్యంకుడి బిల్లులు రావాలి.. ఆయన క్రషర్ ఆగొద్దని పోయిండు. సొంత అభివృద్ధి కోసం పోయిండు.. జగిత్యాల అభివృద్ధి కోసం పోలేదు. ఎమ్మెల్యే సంజయ్‌కు దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలి.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది కాంగ్రెస్ పార్టీనే. దేశంలో ఆయారాం, గయారాం సంస్కృతికి బీజం వేసింది కాంగ్రెసే. దేశంలో ఎన్నో ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని చవిచూశాయి.
స్థానిక సంస్థల్లో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి. జగిత్యాల ఎమ్మెల్యే తనకు తానే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు.
2014 తర్వాత రేవంత్ రెడ్డి 50 లక్షలతో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికి జైలుకు పోయాడు. మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశాడు. టీడీపీ, బీఎస్పీ నుంచి మూడింట రెండొంతుల మంది మన పార్టీలో రాజ్యాంగబద్ధంగా విలీనం అయ్యారు. మనం రాజ్యాంగాన్ని, చట్టాన్ని తుంగలో తొక్కలేదు.
2014లో టీడీపీ నుంచి 15 మంది గెలిస్తే 10 మంది, బీఎస్పీ నుంచి గెలిచిన ఇద్దరు కలిసి బీఆర్ఎస్‌లో విలీనం అయ్యారు. 2018లో కాంగ్రెస్ నుంచి 18 మంది గెలిస్తే.. 12 మంది చేరారు. రాజ్యాంగబద్దంగా మూడింట రెండొంతుల మంది చేరారు. ఒక్కొక్కరు వచ్చి కండువా కప్పుకోలేదు. ఆ పని కేసీఆర్ చేయలేదు అని కేటీఆర్ వివరించారు.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలను కుక్కల మాదిరి రాళ్లతో కొట్టి చంపాలని రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడారు. మరి ఇప్పుడు ఎవరు పిచ్చికుక్క.. ఎవర్నీ రాళ్లతో కొట్టిచంపాలి. మీ చెమట, మీ రక్తం ధారపోసి గెలిపించాక పార్టీ ఫిరాయింపులు చేస్తే అలాంటి వారిని రాళ్లతో కొట్టిచంపమని రేవంత్ రెడ్డే చెప్పాడు. మరి ఎవర్నీ పిచ్చి కుక్క మాదిరి కొట్టాలి..?
ఎవర్నీ రాళ్లతో కొట్టాల్సిన అవసరం లేదు కానీ.. రేవంత్ రెడ్డి నీవు మొగోడివి అయితే.. నీకు దమ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా.. ఓట్లతో కొట్టి ఆ ఆరుగురిని రాజకీయంగా శ్వాశతంగా సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటది అని కేటీఆర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment