పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిశ్రమల శాఖ జగిత్యాల జీఎం
విలేకరినని చెప్పిన వ్యక్తితోపాటు మరొకరి అరెస్టు
పరారీలో మరో ముగ్గురు
జగిత్యాల క్రైం: విలేకరినని పరిచయం చేసుకున్నాడు.. డబ్బులిస్తుంటే వీడియో తీశాడు.. తర్వాత బెదిరించి, పరిశ్రమల శాఖ జగిత్యాల జనరల్ మేనేజర్ యాదగిరి నుంచి పలు దఫాలుగా రూ.8.50 లక్షలు వసూలు చేశాడు. నిందితుడితోపాటు అతనికి సహకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన ఎర్ర యాదగిరి పరిశ్రమల శాఖ జగిత్యాల జిల్లా జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. గత నెల 20న విధుల్లో ఉండగా డీపీఆర్వో కార్యాలయ అటెండర్, జగిత్యాల అర్బన్ మండలం ధరూర్‌కు చెందిన బాలె జగన్ వచ్చాడు. రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ తండాకు చెందిన భూక్య సంతోష్‌నాయక్‌ను ఓ చానల్ విలేకరని ఆయనకు పరిచయం చేశాడు.
మరుసటి రోజు లోన్ కావాలని..
21న సంతోష్‌నాయక్ జనరల్ మేనేజర్ యాదగిరి ఆఫీస్‌కు ఓ మహిళను తీసుకెళ్లాడు. తన బంధువని చెప్పి, సబ్సిడీపై కారు లోన్ కావాలని అడిగాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. రూ.5 వేలను కవర్‌లో పెట్టి, ఆయన టేబుల్‌పై పెట్టాడు. తర్వాత రహస్యంగా వీడియో తీశాడు. అదేరోజు రాత్రి ప్రెస్ గ్రూప్‌లో పెడతామంటూ ఆ వీడియోను అధికారికి వాట్సాప్ చేసి, బెదిరించాడు. కాసేపటికి సంతోష్‌కుమార్‌కు సంబంధించిన ఒడ్డెలింగాపూర్‌కు చెందిన పాలకుర్తి రాకేశ్, లోక్యానాయక్ తండాకు చెందిన మాలోతు తిరుపతి, భూక్య గంగాధర్‌లు కారులో వచ్చి, యాదగిరిని జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట శివారుకు తీసుకెళ్లారు. రూ.3 లక్షలు డిమాండ్ చేస్తూ కొట్టారు.
దీంతో ఆయన రూ.35 వేలు ఇచ్చారు. అవి సరిపోవని చెప్పడంతో మళ్లీ రూ.35 వేలతోపాటు ఫోన్‌పే ద్వారా మరో రూ.30 వేలు ముట్ట జెప్పారు. సంతోష్‌కుమార్ 22న ఫోన్ చేసి, డబ్బులు సరిపోలేదని బెదిరించడంతో కలెక్టర్ కార్యాలయంలోని ఇరిగేషన్ ఆఫీసు వద్ద రూ.2 లక్షలు ఇచ్చారు. 23న మా చానల్ చైర్మన్ ఒప్పుకోవడం లేదనడంతో 25న కలెక్టర్ కార్యాలయ సమీపంలోని వాటర్‌ట్యాంక్ వద్ద రూ.5.50 లక్షలు అప్పగించారు. ఇలా.. నిందితులు మొత్తం రూ.8.50 లక్షలు వసూలు చేశారు.
బెదిరింపులు ఆగకపోవడంతో ఫిర్యాదు..
అయినా, బెదిరింపులకు పాల్పడటంతో అనుమానం వచ్చిన జీఎం యాదగిరి 30న జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. భూక్య సంతోష్‌కుమార్, పాలకుర్తి రాకేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.1.75 లక్షల విలువైన బంగారం, రూ.16 వేలు, రెండు సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. వసూలు చేసిన డబ్బులో నుంచి కొంత మొత్తం తీసి, సంతోష్‌కుమార్ తన అప్పులు కట్టుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుతో ప్రమేయం ఉన్న తిరుపతి, గంగాధర్, జగన్ పరారీలో ఉన్నారని, త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ వేణుగోపాల్, ఎస్సై కిరణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment