Fake reporters
-
విలేకరి పేరుతో రూ.7 లక్షలకు టోకరా..
సాక్షి, లింగంపేట (నిజామాబాద్): విలేకరి పేరుతో ఏకంగా రూ.7 లక్షలకు టోకరా వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం కొట్టాల్ గ్రామానికి చెందిన ఆలకుంట మంజుల, రాములు దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2017లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాములు మృతి చెందాడు. అయితే, లింగంపేట గ్రామానికి చెందిన సాయికృష్ణ తాను విలేకరినని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని నమ్మబలికి ఖర్చుల నిమిత్తం రూ.70 వేలు తీసుకున్నాడు. అలాగే, యాక్సిడెంట్ కేసులో రూ.12 లక్షలు రాగా, అందులో మంజులకు రూ.4 లక్షలు, ఆమె అత్తమ్మ హన్మవ్వకు రూ.లక్ష ఇచ్చాడు. మిగతా రూ.7 లక్షలు బాధితులకు ఇవ్వకుండా దగ్గర పెట్టుకున్నాడు. బాధితులు అడిగితే రేపు, మాపు అనుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడని బాధితులు గురువారం విలేకరులతో ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయి తాము పుట్టెడు దుఃఖంలో ఉంటే, తమను నమ్మించి నిలువునా మోసం చేశాడని వాపోయారు. సాయికృష్ణను డబ్బులు అడిగితే భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని, ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరిస్తున్నాడని తెలిపారు. ప్రస్తుతం కామారెడ్డిలో నివాసముంటున్న సాయికృష్ణ నుంచి తమకు డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని మంజుల విజ్ఞప్తి చేశారు. చదవండి: అమానుషం: వృద్ధుడిని చాపలో చుట్టి పడేశారు! -
వసూల్ రాజాలు
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ విలేకరుల అవతారం ఎత్తి, మీడియా పేరు చెప్పుకుంటూ స్పాలు, మసాజ్ సెంటర్లను టార్గెట్‌గా చేసుకుని బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్న ముఠాను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరిపై నగరంలోని మూడు ఠాణాల్లో కేసులు నమోదై ఉన్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు శనివారం తెలిపారు. అమీర్‌పేట పటేల్‌నగర్‌కు చెందిన ఎ.సురేందర్‌రాజు గతంలో హబ్సిగూడ ప్రాంతంలో ‘స్టైల్ స్టూడియో’ పేరుతో బ్యూటీ సెలూన్ నిర్వహించాడు. నష్టాలు రావడంతో కారు డ్రైవర్‌గా మారిపోయాడు. ఆ సంపాదన సరిపోక ఇబ్బంది పడేవాడు. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి అనువైన మార్గాలు అన్వేషించాడు. తాను బ్యూటీ సెలూన్ నిర్వహిస్తున్నప్పుడు అనేక మంది మసాజ్ చేయించుకోవడానికి వచ్చి క్రాస్ మసాజ్ కావాలని కోరడం ఇతడికి గుర్తుంది. అప్పట్లో ఎలాంటి అనుమతులూ లేకపోయినా తాను అలాంటి మసాజ్‌లు కస్టమర్లకు ఏర్పాటు చేసేవాడు. దీంతో నగరంలోని మరికొన్ని స్పాలు, మసాజ్ సెంటర్లలో ఇదే విధంగా జరుగుతూ ఉంటుందని భావించాడు. అలాంటి వాటిపై మీడియా పేరుతో దాడులు చేసి డబ్బు గుంజాలని పథకం వేశాడు. జీడిమెట్లకు చెందిన మూవీ ఆర్టిస్ట్ ఎస్.కిరణ్‌కుమార్, బాలాపూర్‌కు చెందిన గోల్డ్‌స్మిత్ టి.రఘునాథ్‌చారి, కాచిగూడకు చెందిన ఆటోడ్రైవర్ బి.రాజ కృష్ణ, ఘట్కేసర్కు చెందిన గ్రాఫిక్ డిజైనర్ బి.రవిలతో ముఠా కట్టాడు. స్నేహితులైన వీరందరికీ తన పథకం చెప్పిన సురేందర్ బెదిరింపు వసూళ్ళకు ఒప్పించాడు. వీరిలో రఘునాథ్‌చారి ‘ఎస్ 9 టీవీ’ పేరుతో ఉన్న ప్రెస్ రిపోర్టర్ హోదా గుర్తింపుకార్డు సంపాదించాడు. దీన్ని పట్టుకుని ఐదుగురూ ఓ ముఠాగా ఏర్పడి రంగంలోకి దిగారు. ఈ నెల 7న ఎస్సార్‌నగర్‌లోని ‘ఆర్వై ఫ్యామిలీ బ్యూటీ సెలూన్ అండ్ స్పా’తో పాటు ‘స్టార్ బ్యూటీ ఫ్యామిలీ సెలూన్’పై పడ్డారు. తాము విలేకరులం అంటూ అదే రోజు ఆర్వై సంస్థ నిర్వాహకుడిని అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ప్రచారం చేస్తామంటూ బెదిరించి రూ.40 వేలు గుంజారు. స్టార్ బ్యూటీ సంస్థపై మద్యం మత్తులో దాడి చేసిన వీళ్ళు వారిని తీవ్రంగా బెదిరించి, లోపల–బయట కొన్ని ఫొటోలు తీçసుకుని వచ్చేశారు. మళ్ళీ 13వ తేదీని వెళ్ళి మరోసారి బెదిరిస్తూ రూ.లక్ష దండుకున్నారు. అదే రోజు హబ్సిగూడలోని ‘న్యూ అలెక్స్ బ్యూటీ కాన్సెప్ట్ సెలూన్ అండ్ స్పా’కు వెళ్ళిన ఈ ముఠా అక్కడా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమకు సమాచారం ఉందని హడావుడి చేసింది. మీడియా పేరు చెప్పి దాని నిర్వాహకుడి నుంచి రూ.10 వేలు వసూలు చేయడంతో పాటు సీసీ కెమెరాల ఫీడ్ రికార్డు అయ్యే డీవీఆర్ బాక్సును ఎత్తుకుపోయింది. వీరి కార్యకలాపాలకు సంబంధించి ఆయా స్పా యజమానులు ఫిర్యాదు చేయడంతో ఎస్సార్‌నగర్, ఉస్మానియా వర్శిటీ ఠాణాల్లో మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు ఎల్.భాస్కర్‌రెడ్డి, పి.మల్లికార్జున్, బి.దుర్గారావు, మహ్మద్ ముజఫర్ అలీలతో కూడిన బృందం రంగంలోకి దిగింది. ముమ్మరంగా గాలించిన నేపథ్యంలో శనివారం ఐదుగురినీ పట్టుకుంది. వీరి నుంచి రూ.50 వేల నగదు, నకిలీ మీడియా గుర్తింపుకార్డు, డీవీఆర్ బాక్స్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని ఎస్సార్‌నగర్ పోలీసులకు అప్పగించారు. -
విలేకరుల పేరుతో మోసం
ఒంగోలు క్రైం: వ్యభిచార గృహం నిర్వాహకురాలు, అందులో వ్యభిచరిస్తున్న వారితో పాటు విలేకరుల పేరుతో వారి నుంచి డబ్బులు వసూలు చేసిన నిందితులను ఒంగోలు తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక తాలూకా పోలీసుస్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలను సీఐ గంగా వెంకటేశ్వర్లు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. శక్తి చానల్ స్టాఫ్ రిపోర్టరని చెప్పుకునే కందుకూరి మల్లేశ్వరి తన చానల్లో పనిచేస్తున్నారంటూ ముగ్గురిని తీసుకొని నగరంలోని సమతానగర్ నాలుగో లైన్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఇంటికి వెళ్లి డబ్బులు డిమాండ్ చేశారు. వ్యభిచారం గృహానికి వెళ్లి డబ్బులు డిమాండ్ చేసిన కందుకూరి మల్లేశ్వరితో పాటు రిపోర్టర్ అన్నపురెడ్ది శివప్రసాద్, కంప్యూటర్ ఆపరేటర్ అన్నపురెడ్డి శేఖర్, యాడ్స్ ఇన్చార్జి అన్నపురెడ్డి కోటేశ్వరరావులను అరెస్టు చేశారు. వీరితో పాటు వ్యభిచార గృహం నిర్వహస్తున్న వేలుపూరి నాగజ్యోతి, వ్యభిచరించేందుకు వెళ్లిన మురళీకుమార్, నాగిరెడ్డి, పేరిరెడ్డిలను కూడా అరెస్టు చేశారు. సమతానగర్‌లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న సమాచారం తెలుసుకున్న స్టాఫ్ రిపోర్టర్ కందుకూరి మల్లేశ్వరి.. తన వద్ద పనిచేసే ముగ్గురిని తీసుకొని ఇంట్లోకి ప్రవేశించి తొలుత వీడియో తీసింది. టీవీలో ప్రసారం చేస్తామని, దీంతో పరువుపోతుందని బెదిరించింది. టీవీలో ప్రసారమైతే పోలీసులు కేసు నమోదు చేస్తారని, చివరకు జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరించింది. భయపడిన వ్యభిచార గృహం నిర్వాహకురాలు డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించింది. మల్లేశ్వరి రూ.50 వేలు డిమాండ్ చేసింది. చివరకు రూ.20 వేలకు అంగీకారం కుదిరింది. డబ్బులు ఇచ్చిన అనంతరం వేలుపూరి నాగజ్యోతికి అనుమానం వచ్చి జర్నలిస్టు గుర్తింపు కార్డులు చూపాలని కోరింది. కార్డులు చూపకుండా వాహనాలపై వెళ్లిపోయారు. నాగజ్యోతితో పాటు వ్యభిచార గృహంలో ఉన్న ముగ్గురు యువకులు వాహనాలపై వారి వెంటపడ్డారు. చివరకు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను వెంబడించి పట్టుకున్నారు. అందరిపై కేసు నమోదు చేసి ఒంగోలు కోర్టులో న్యామూర్తి ఎదుట హాజరు పరచనున్నట్లు సీఐ వివరించారు. నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఎస్ఐ ఎన్సీ ప్రసాద్, తాలూకా పోలీసులు పాల్గొన్నారు. -
ముగ్గురు నకిలీ రిపోర్టర్ల అరెస్ట్
ఏటూరునాగారం(భూపాలపల్లి): పేరున్న మీడియా సంస్థలో రిపోర్లమని పోజులిస్తూ అందినకాడికి అక్రమాలకు పాల్పడుతోన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామం నుంచి ఇసుక తరలిస్తున్న లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు నకిలీ రిపోర్టర్లను గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ముగ్గురు నకిలీలు మంగపేట మండలానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. -
నకిలీ విలేకరుల అరెస్టు
ఖమ్మం రూరల్: టీవీ చానల్స్ విలేకరులమని చెప్పుకుని వసూళ్లకు పాల్పడిన ఇద్దరిని ఖమ్మం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం డీఎస్పీ దక్షిణా మూర్తి విలేకరులతో తెలిపిన వివరాలు ఇలా ఉన్నారుు. ఖమ్మంలోని సారథి నగర్ జూబ్లిపురాకు చెందిన బట్టా నాగరాజు, బుర్హన్‌పురానికి చెందిన సంతులూరి వంశీ కలిసి బుధవారం ఉదయం కోదాడ క్రాస్ రోడ్డు వద్ద లారీలను ఆపుతూ డ్రైవర్ల వద్ద నుంచి డబ్బులను వసూలు చేశారు. మేం విలేకరులం.. మీ లారీల్లో దొంగ సరుకు వెళ్తోంది. ఆర్టీఓ కు సమాచారం అందిస్తామని బెదిరిస్తూ పలువురు డ్రైవర్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ క్రమంలో ఓ లారీ డ్రైవర్ వీరితో వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న రూరల్ ఎస్సె లక్షీనారాయణ వీరిని గమనించి ఆరా తీయగా లారీ డ్రైవర్ విషయూన్ని తెలిపాడు. దీంతో వంశీ, నాగరాజులను అదుపులోకి తీసుకుని రూరల్ పోలీస్టేషన్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ.2 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో వంశీకి ప్రభుత్వం నుంచి విలేకరులకు ఇచ్చే అక్రిడిటేషన్ కార్డు ఉండగా, నాగరాజు ప్రారంభం కానున్న ఓ టీవీ చానల్ పేరిటి స్వయంగా గుర్తింపు కార్డును తయూరు చేసుకున్నాడు. డీఎస్పీ మాట్లాడుతూ అపరిచితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దగ్గర్లో ఉన్న పోలీస్టేషన్ లేదా 100 నంబర్‌కు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు. ఎవరైనా విలేకరుల మని, లేదా పోలీసులమని చెప్పి వివరాలు అడిగితే గుర్తింపు కార్డులు చూపించాలని కోరాలని సూచించారు. విలేఖరుల సమావేశంలో సీఐ ఆంనేయులు పాల్గొన్నారు. -
నకిలీ విలేకరులు రిమాండ్
హైదరాబాద్ : విలేకరులమని వచ్చి ఓ ఆర్ఎంపీ డాక్టర్ ను బ్లాక్మెయిల్ చేసి రూ.25 వేలు తీసుకున్న నలుగురు నకిలీ విలేకరులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన సోమవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... అమలాపురానికి చెందిన సిలివేరు సత్యరావుప్రసాద్ మెదక్ జిల్లా బీరంగూడ రాజేంద్రకాలనీలో నివాసముంటున్నారు. పశ్చిమగోదావరి తాడేపల్లిగూడెంకు చెందిన నేదూరి స్వామి కూకట్‌పల్లిలోని మధురానగర్‌కాలనీ, తూర్పుగోదావరి మామిడికుదురుకు చెందిన బోర్సు సాయి వెంకటదుర్గారావు వనస్థలిపురం శారదానగర్‌లో నివసిస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన కొరవేలు ఉజ్వల లు కలిసి నలుగురూ ఓ ముఠాగా ఏర్పడ్డారు. కుత్బుల్లాపూర్‌లో ఆర్ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్న సంధ్యను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజేందుకు పథకం వేశారు. ఈ క్రమంలో గత నెల 17న తమ గర్ల్‌ఫ్రెండ్‌కు అబార్షన్ చేయాలని సంధ్య వద్ద కు వచ్చారు. ఆమె అబార్షన్ చేసేందుకు ఒప్పుకుంది. దీనికి సంబంధించిన సంభాషణలను వారు రికార్డు చేశారు. అనంతరం డాక్టర్ సంధ్యకు ఫోన్‌చేసి మేము న్యూస్ ఇండియా ఛానల్లో పనిచేస్తున్న విలేకరులమని చెప్పి అక్రమంగా అబార్షన్ చేస్తున్నట్లు ప్రచారం చేస్తామని బెదిరించారు. తమకు డబ్బులు ఇస్తే గుట్టు బయటపడకుండా చేస్తామని ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. దీంతో బెదిరిపోయిన సంధ్య వారికి రూ.25 వేలు ఇచ్చింది. అనంతరం వారిపై హయత్‌నగర్ పోలీస్‌స్టేష న్లో ఫిర్యాదు చేసింది. సంధ్య ఫిర్యాదు మేరకు పో లీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సత్యరావు ప్రసాద్, నేదూరి స్వామి, సాయివెంకట దు ర్గారావు, ఉజ్వలలు టీవీ ఛానల్లో పనిచేయడం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో నిందితులను అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. -
నకిలీ విలేకరుల గుట్టురట్టు
ఆలమూరు : విజిలెన్స్ అధికారులమంటూ మోసాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది నకిలీ విలేకరుల గుట్టురట్టయ్యింది. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా, మిగతా ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆలమూరు పోలీసు స్టేషన్లో మండపేట సీఐ పీవీ రమణ ఆధ్వర్యంలో ఎస్సై సీహెచ్ సూర్య భాస్కరరావు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలను వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ రాత్రి గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి నుంచి సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలేనికి కిరోసిన్ ట్యాంకర్ బయల్దేరింది. పదహారో నంబర్ జాతీయ రహదారిలోని జొన్నాడ ఆంజనేయస్వామి గుడి వద్దకు వచ్చేసరికి ఎనిమిది మంది నకిలీ విలేకరులు రెండు కార్లపై వచ్చి తాము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులమంటూ కిరోసిన్ ట్యాంకర్‌ను నిలిపి, రికార్డులను తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగానే ఉన్నప్పటికీ వారు ట్యాంకర్ డ్రైవర్ పీఈ సత్యనారాయణను రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో అతను ట్యాంకర్ ఓనర్ కె.హరిబాబుకు ఫోన్ చేయగా అతడి మిత్రుడు పత్రికా విలేకరి కోటిపల్లి త్రిమూర్తులును తీసుకురావడంతో వారి బండారం బయటపడింది. వీరు విజిలెన్స్ అధికారులు కాదని, విలేకరులమంటూ తరచూ బెదిరింపులకు దిగుతూ డబ్బులు గుంజుతుంటారని చెప్పాడు. దీంతో కోపోద్రిక్తులైన ఆ నకిలీ విలేకరులు త్రిమూర్తులుపై దాడికి దిగారు. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయాన్ని బయటకు చెబితే ఎస్సీ, ఎస్టీ కేసును బనాయిస్తామని బెదిరించారు. దీంతో ఆ పత్రికా విలేకరి గాయాలతోనే ఆలమూరు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. దీనిపై మూడు రోజుల పాటు విచారణ జరిపిన పోలీసులు ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు. గతంలో కూడా అనేక బెదిరింపులకు పాల్పడి లక్షలాది రూపాయలు అక్రమార్జన జరిపారని నిర్ధారించారు. గుర్తింపు కార్డులు స్వాధీనం ఎనిమిది మంది నకిలీ విలేకరులలో కడియం మండలం దుళ్లకు చెందిన గుంటూరి కిరణ్‌కుమార్, చీకట్ల శివన్నారాయణ (శివ), నేల చక్రవర్తిలను పోలీసులు అరెస్ట్ చేసి వీరి నుంచి రాజమండ్రికి చెందిన ‘కోస్తా సమయం’ దినపత్రిక గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పులూరి సూర్య ప్రకాశరావు చౌదరి, శెట్టి పోసిబాబు, పిల్లి బాబి, గుత్తుల కుమార్, ఉమ్మిడి చింతాలు అనే మిగతా నకిలీ విలేకరులను ఆరెస్ట్ చేయాల్సి ఉంది. వీరు మీడియాకు చెందిన వారా? లేక గుర్తింపు కార్డులు కూడా నకిలీవా? అనే విషయం దర్యాప్తులో తేలుతుందని సీఐ రమణ తెలిపారు. అలాగే నిందితులు వినియోగించిన మారుతి సుజుకి కంపెనీకి చెందిన స్విఫ్ట్ డిజైర్, టాటా కంపెనీకి చెందిన మాన్యర్ వాహనాల కోసం గాలిస్తున్నామన్నారు. వీరిపై ఐపీసీ 341, 419, 384, 324 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. నకిలీలపై అప్రమత్తంగా ఉండాలి నకిలీ విలేకరులు, నకిలీ అధికారుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండపేట సీఐ పీవీ రమణ కోరారు. అధికారులు తనిఖీకి వచ్చినపుడు ఏమాత్రం తొందరపాటుకు గురికాకుండా వారి ప్రవర్తన, తీరు తెన్నులను అధ్యయనం చేయాలన్నారు. అనుమానం వస్తే సంబంధిత పోలీసు అధికారులకు పిర్యాదు చేయాలని కోరారు.