నకిలీ విలేకరుల గుట్టురట్టు
ఆలమూరు : విజిలెన్స్ అధికారులమంటూ మోసాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది నకిలీ విలేకరుల గుట్టురట్టయ్యింది. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా, మిగతా ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆలమూరు పోలీసు స్టేషన్‌లో మండపేట సీఐ పీవీ రమణ ఆధ్వర్యంలో ఎస్సై సీహెచ్ సూర్య భాస్కరరావు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలను వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ రాత్రి గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి నుంచి సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలేనికి కిరోసిన్ ట్యాంకర్ బయల్దేరింది.
పదహారో నంబర్ జాతీయ రహదారిలోని జొన్నాడ ఆంజనేయస్వామి గుడి వద్దకు వచ్చేసరికి ఎనిమిది మంది నకిలీ విలేకరులు రెండు కార్లపై వచ్చి తాము విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులమంటూ కిరోసిన్ ట్యాంకర్‌ను నిలిపి, రికార్డులను తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగానే ఉన్నప్పటికీ వారు ట్యాంకర్ డ్రైవర్ పీఈ సత్యనారాయణను రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో అతను ట్యాంకర్ ఓనర్ కె.హరిబాబుకు ఫోన్ చేయగా అతడి మిత్రుడు పత్రికా విలేకరి కోటిపల్లి త్రిమూర్తులును తీసుకురావడంతో వారి బండారం బయటపడింది. వీరు విజిలెన్స్ అధికారులు కాదని, విలేకరులమంటూ తరచూ బెదిరింపులకు దిగుతూ డబ్బులు గుంజుతుంటారని చెప్పాడు.
దీంతో కోపోద్రిక్తులైన ఆ నకిలీ విలేకరులు త్రిమూర్తులుపై దాడికి దిగారు. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయాన్ని బయటకు చెబితే ఎస్సీ, ఎస్టీ కేసును బనాయిస్తామని బెదిరించారు. దీంతో ఆ పత్రికా విలేకరి గాయాలతోనే ఆలమూరు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. దీనిపై మూడు రోజుల పాటు విచారణ జరిపిన పోలీసులు ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు. గతంలో కూడా అనేక బెదిరింపులకు పాల్పడి లక్షలాది రూపాయలు అక్రమార్జన జరిపారని నిర్ధారించారు.
గుర్తింపు కార్డులు స్వాధీనం
ఎనిమిది మంది నకిలీ విలేకరులలో కడియం మండలం దుళ్లకు చెందిన గుంటూరి కిరణ్‌కుమార్, చీకట్ల శివన్నారాయణ (శివ), నేల చక్రవర్తిలను పోలీసులు అరెస్ట్ చేసి వీరి నుంచి రాజమండ్రికి చెందిన ‘కోస్తా సమయం’ దినపత్రిక గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పులూరి సూర్య ప్రకాశరావు చౌదరి, శెట్టి పోసిబాబు, పిల్లి బాబి, గుత్తుల కుమార్, ఉమ్మిడి చింతాలు అనే మిగతా నకిలీ విలేకరులను ఆరెస్ట్ చేయాల్సి ఉంది. వీరు మీడియాకు చెందిన వారా? లేక గుర్తింపు కార్డులు కూడా నకిలీవా? అనే విషయం దర్యాప్తులో తేలుతుందని సీఐ రమణ తెలిపారు. అలాగే నిందితులు వినియోగించిన మారుతి సుజుకి కంపెనీకి చెందిన స్విఫ్ట్ డిజైర్, టాటా కంపెనీకి చెందిన మాన్యర్ వాహనాల కోసం గాలిస్తున్నామన్నారు. వీరిపై ఐపీసీ 341, 419, 384, 324 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు.
నకిలీలపై అప్రమత్తంగా ఉండాలి
నకిలీ విలేకరులు, నకిలీ అధికారుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండపేట సీఐ పీవీ రమణ కోరారు. అధికారులు తనిఖీకి వచ్చినపుడు ఏమాత్రం తొందరపాటుకు గురికాకుండా వారి ప్రవర్తన, తీరు తెన్నులను అధ్యయనం చేయాలన్నారు. అనుమానం వస్తే సంబంధిత పోలీసు అధికారులకు పిర్యాదు చేయాలని కోరారు.