విలేకరుల పేరుతో మోసం | Fake Journalist Demand Money To Brothel House And Arrest | Sakshi
Sakshi News home page

విలేకరుల పేరుతో మోసం

Published Tue, Mar 27 2018 9:38 AM | Last Updated on Tue, Mar 27 2018 9:38 AM

Fake Journalist Demand Money To Brothel House And Arrest - Sakshi

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న తాలూకా సీఐ వెంకటేశ్వర్లు

ఒంగోలు క్రైం: వ్యభిచార గృహం నిర్వాహకురాలు, అందులో వ్యభిచరిస్తున్న వారితో పాటు విలేకరుల పేరుతో వారి నుంచి డబ్బులు వసూలు చేసిన నిందితులను ఒంగోలు తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక తాలూకా పోలీసుస్టేషన్‌లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలను సీఐ గంగా వెంకటేశ్వర్లు   వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. శక్తి చానల్‌ స్టాఫ్‌ రిపోర్టరని చెప్పుకునే కందుకూరి మల్లేశ్వరి తన చానల్‌లో పనిచేస్తున్నారంటూ ముగ్గురిని తీసుకొని నగరంలోని సమతానగర్‌ నాలుగో లైన్‌లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఇంటికి వెళ్లి డబ్బులు డిమాండ్‌ చేశారు. వ్యభిచారం గృహానికి వెళ్లి డబ్బులు డిమాండ్‌ చేసిన కందుకూరి మల్లేశ్వరితో పాటు రిపోర్టర్‌ అన్నపురెడ్ది శివప్రసాద్, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అన్నపురెడ్డి శేఖర్, యాడ్స్‌ ఇన్‌చార్జి అన్నపురెడ్డి కోటేశ్వరరావులను అరెస్టు చేశారు.

వీరితో పాటు వ్యభిచార గృహం నిర్వహస్తున్న వేలుపూరి నాగజ్యోతి, వ్యభిచరించేందుకు వెళ్లిన మురళీకుమార్, నాగిరెడ్డి, పేరిరెడ్డిలను కూడా అరెస్టు చేశారు. సమతానగర్‌లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న సమాచారం తెలుసుకున్న స్టాఫ్‌ రిపోర్టర్‌ కందుకూరి మల్లేశ్వరి.. తన వద్ద పనిచేసే ముగ్గురిని తీసుకొని ఇంట్లోకి ప్రవేశించి తొలుత వీడియో తీసింది. టీవీలో ప్రసారం చేస్తామని, దీంతో పరువుపోతుందని బెదిరించింది. టీవీలో ప్రసారమైతే పోలీసులు కేసు నమోదు చేస్తారని, చివరకు జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరించింది. భయపడిన వ్యభిచార గృహం నిర్వాహకురాలు డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించింది. మల్లేశ్వరి రూ.50 వేలు డిమాండ్‌ చేసింది. చివరకు రూ.20 వేలకు అంగీకారం కుదిరింది. డబ్బులు ఇచ్చిన అనంతరం వేలుపూరి నాగజ్యోతికి అనుమానం వచ్చి జర్నలిస్టు గుర్తింపు కార్డులు చూపాలని కోరింది. కార్డులు చూపకుండా వాహనాలపై వెళ్లిపోయారు. నాగజ్యోతితో పాటు వ్యభిచార గృహంలో ఉన్న ముగ్గురు యువకులు వాహనాలపై వారి వెంటపడ్డారు. చివరకు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను వెంబడించి పట్టుకున్నారు. అందరిపై కేసు నమోదు చేసి ఒంగోలు కోర్టులో న్యామూర్తి ఎదుట హాజరు పరచనున్నట్లు సీఐ వివరించారు. నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించారు. ఎస్‌ఐ ఎన్‌సీ ప్రసాద్, తాలూకా పోలీసులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement