వసూల్‌ రాజాలు | Fake Media Reporters Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

వసూల్‌ రాజాలు

Published Sun, Aug 18 2019 8:45 AM | Last Updated on Wed, Aug 21 2019 12:33 PM

Fake Media Reporters Arrest in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నకిలీ విలేకరుల అవతారం ఎత్తి, మీడియా పేరు చెప్పుకుంటూ స్పాలు, మసాజ్‌ సెంటర్లను టార్గెట్‌గా చేసుకుని బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్న ముఠాను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరిపై నగరంలోని మూడు ఠాణాల్లో కేసులు నమోదై ఉన్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు శనివారం తెలిపారు. అమీర్‌పేట పటేల్‌నగర్‌కు చెందిన ఎ.సురేందర్‌రాజు గతంలో హబ్సిగూడ ప్రాంతంలో ‘స్టైల్‌ స్టూడియో’ పేరుతో బ్యూటీ సెలూన్‌ నిర్వహించాడు. నష్టాలు రావడంతో కారు డ్రైవర్‌గా మారిపోయాడు. ఆ సంపాదన సరిపోక ఇబ్బంది పడేవాడు. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి అనువైన మార్గాలు అన్వేషించాడు. తాను బ్యూటీ సెలూన్‌ నిర్వహిస్తున్నప్పుడు అనేక మంది మసాజ్‌ చేయించుకోవడానికి వచ్చి క్రాస్‌ మసాజ్‌ కావాలని కోరడం ఇతడికి గుర్తుంది. అప్పట్లో ఎలాంటి అనుమతులూ లేకపోయినా తాను అలాంటి మసాజ్‌లు కస్టమర్లకు ఏర్పాటు చేసేవాడు. దీంతో నగరంలోని మరికొన్ని స్పాలు, మసాజ్‌ సెంటర్లలో ఇదే విధంగా జరుగుతూ ఉంటుందని భావించాడు. అలాంటి వాటిపై మీడియా పేరుతో దాడులు చేసి డబ్బు గుంజాలని పథకం వేశాడు. జీడిమెట్లకు చెందిన మూవీ ఆర్టిస్ట్‌ ఎస్‌.కిరణ్‌కుమార్, బాలాపూర్‌కు చెందిన గోల్డ్‌స్మిత్‌ టి.రఘునాథ్‌చారి, కాచిగూడకు చెందిన ఆటోడ్రైవర్‌ బి.రాజ కృష్ణ, ఘట్కేసర్‌కు చెందిన గ్రాఫిక్‌ డిజైనర్‌ బి.రవిలతో ముఠా కట్టాడు.

స్నేహితులైన వీరందరికీ తన పథకం చెప్పిన సురేందర్‌ బెదిరింపు వసూళ్ళకు ఒప్పించాడు. వీరిలో రఘునాథ్‌చారి ‘ఎస్‌ 9 టీవీ’ పేరుతో ఉన్న ప్రెస్‌ రిపోర్టర్‌ హోదా గుర్తింపుకార్డు సంపాదించాడు. దీన్ని పట్టుకుని ఐదుగురూ ఓ ముఠాగా ఏర్పడి రంగంలోకి దిగారు. ఈ నెల 7న ఎస్సార్‌నగర్‌లోని ‘ఆర్‌వై ఫ్యామిలీ బ్యూటీ సెలూన్‌ అండ్‌ స్పా’తో పాటు ‘స్టార్‌ బ్యూటీ ఫ్యామిలీ సెలూన్‌’పై పడ్డారు. తాము విలేకరులం అంటూ అదే రోజు ఆర్‌వై సంస్థ నిర్వాహకుడిని అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ప్రచారం చేస్తామంటూ బెదిరించి రూ.40 వేలు గుంజారు. స్టార్‌ బ్యూటీ సంస్థపై మద్యం మత్తులో దాడి చేసిన వీళ్ళు వారిని తీవ్రంగా బెదిరించి, లోపల–బయట కొన్ని ఫొటోలు తీçసుకుని వచ్చేశారు. మళ్ళీ 13వ తేదీని వెళ్ళి మరోసారి బెదిరిస్తూ రూ.లక్ష దండుకున్నారు. అదే రోజు హబ్సిగూడలోని ‘న్యూ అలెక్స్‌ బ్యూటీ కాన్సెప్ట్‌ సెలూన్‌ అండ్‌ స్పా’కు వెళ్ళిన ఈ ముఠా అక్కడా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమకు సమాచారం ఉందని హడావుడి చేసింది. మీడియా పేరు చెప్పి దాని నిర్వాహకుడి నుంచి రూ.10 వేలు వసూలు చేయడంతో పాటు సీసీ కెమెరాల ఫీడ్‌ రికార్డు అయ్యే డీవీఆర్‌ బాక్సును ఎత్తుకుపోయింది. వీరి కార్యకలాపాలకు సంబంధించి ఆయా స్పా యజమానులు ఫిర్యాదు చేయడంతో ఎస్సార్‌నగర్, ఉస్మానియా వర్శిటీ ఠాణాల్లో మూడు కేసులు నమోదయ్యాయి.

దీంతో ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు ఎల్‌.భాస్కర్‌రెడ్డి, పి.మల్లికార్జున్, బి.దుర్గారావు, మహ్మద్‌ ముజఫర్‌ అలీలతో కూడిన బృందం రంగంలోకి దిగింది. ముమ్మరంగా గాలించిన నేపథ్యంలో శనివారం ఐదుగురినీ పట్టుకుంది. వీరి నుంచి రూ.50 వేల నగదు, నకిలీ మీడియా గుర్తింపుకార్డు, డీవీఆర్‌ బాక్స్‌ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని ఎస్సార్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement