ఈసారి సంక్రాంతి పండగకు రేషన్ సరుకులు అందడం అనుమానమే. పామాయిల్‌కు తీవ్రమైన కొరత ఉంది. చక్కెర, కందిపప్పుతో పాటు ఇతర సరుకులు పూర్తిస్థాయిలో సరఫరా అయ్యే పరిస్థితి కనిపించడంలేదు. సోమవారం వరకు డీలర్లు సరుకులు తీసుకోవాల్సి ఉన్నా, మూడోవంతు స్టాకు కూడా రేషన్ దుకాణాలకు చేరలేదు. పండగ నేపథ్యంలో పామాయిల్ సకాలంలో అందుబాటులో ఉంచాల్సిన సర్కారు మొండిచేయి చూపింది.
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో 11,11,000 పైచిలుకు తెల్లకార్డులున్నాయి. లబ్ధిదారులకు జనవరి నెలకు 1.21 లక్షల క్వింటాళ్ల బియ్యంతోపాటు అమ్మహస్తం పథకం కింద పామాయిల్, కందిపప్పు, చక్కెర, కారం, పసుపు, చింతపండు, గోధుమలు, గోధుమపిండి కోటా ఎప్పటిలాగే మంజూరైంది. కానీ ఆ మేరకు స్టాక్ విడుదల కాలేదు. డిసెంబర్ నెలలో విడుదలైన స్టాకులో మూడో వంతు కూడా జనవరి కోటా కింద సరఫరా కాలేదు. డిసెంబర్‌లో 1,49,642 ప్యాకెట్ల కందిపప్పు, 2,94,549 పామాయిల్ ప్యాకెట్లు, 10,24,540 చక్కెర ప్యాకెట్లు విడుదలయ్యాయి.
జనవరిలో కందిపప్పు 62,209 ప్యాకెట్లు, పామాయిల్ 89,556 ప్యాకెట్లు, చక్కెర 6,92,498 ప్యాకెట్లు మాత్రమే రేషన్ దుకాణాలకు చేరాయి. వాస్తవానికి గత నెలలో కన్నా ఈ నెలలో సరుకులకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇప్పటికి డీడీలు కడితేనే డీలర్లకు పౌరసరఫరాల సంస్థ నుంచి సరుకులు అందుతాయి. డీలర్ల పరిధిలోని వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా పౌరసరఫరాలశాఖ డెప్యూటీ తహసీల్దార్లు డీడీలు తీయించాలి. ఇప్పటివరకు తమకు వచ్చిన డీడీలకు సంబంధించి నిల్వలు విడుదల చేశామని, సరుకులకు కొరత లేదని పౌరసరఫరాల సంస్థ అధికారులు చెప్తున్నారు.
సంక్రాంతికి ఇతర సరుకుల కన్నా పామాయిల్‌కే డిమాండ్ అధికంగా ఉంటుంది. అదనంగా సరఫరా చేయాల్సిన సమయంలో అసలుకే ఎసరు పెట్టారు. జిల్లాకు 11 లక్షల పైబడి పామాయిల్ ప్యాకెట్ల కోటా ఉండగా ఒక్క నెలలలో కూడా పూర్తిస్థాయిలో సరఫరా జరగలేదు. నవంబర్‌లో 63,4912 ప్యాకెట్లు సరఫరా అయ్యాయి. డిసెంబర్‌లో 2,94,549 ప్యాకెట్లు సరఫరా చేయగా, ఈ నెలలో కేవలం 89,556 ప్యాకెట్లే వచ్చాయి. జిల్లా కోటా ప్రకారం పామాయిల్ విడుదల కావడం లేదు. గతంలో ఉద్యమాల వల్ల రవాణా స్తంభించి స్టాక్ రాలేదని అధికారులు చెప్తూవచ్చారు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకపోయినా కొరత తప్పలేదు.
పండగకు మొండిచేయి
Published Sun, Jan 5 2014 3:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement
Advertisement