
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్‌జెండర్లకు రేషన్ షాపుల్లో సరుకుల కేటాయింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుందో లేదో తెలియజేయాలని హైకోర్టు కోరింది. కరోనా సమయంలో ట్రాన్స్‌జెండర్లకు నిత్యావసరా లు, వసతి, వైద్యం, ప్రభుత్వ పథకాలను అమలు చేసేలా ఉత్తర్వుల జారీని కోరుతూ వైజయంతి వసంత మొగిలి (ఎం.విజయ్‌కుమార్) దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో వివరాలు అసమగ్రంగా ఉన్నాయని, పూర్తి వివరాలు నివేదించాలని ధర్మాసనం ఆదేశించింది.
వైరస్ వ్యాప్తికి గురయ్యే ట్రాన్స్‌జెండర్లకు వైద్య సహాయం అందించేందుకు గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించే ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించాలని సూచించింది. వారిని జనరల్ వార్డులో ఉంచితే ఇతరులతో వారు సమస్యలు ఎదుర్కొనవచ్చునని వ్యాఖ్య చేసింది. ఇలా చేయడం దురదృష్టకరమని కోర్టు అభిప్రాయపడింది. అనంతరం కోర్టు కేసు విచారణ జూలై 6వ తేదీకి వాయిదా వేసింది.