గోదాముల్లో గోల్‌మాల్! | gowden Public distribution rice | Sakshi
Sakshi News home page

గోదాముల్లో గోల్‌మాల్!

Published Sun, Dec 21 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM

గోదాముల్లో గోల్‌మాల్!

గోదాముల్లో గోల్‌మాల్!

సాక్షి నిఘా విభాగం, మెదక్: మెదక్ జిల్లాలో ప్రజాపంపిణీ బియ్యం సరఫరా కోసం మొత్తం 19 మండల స్థాయి గోదాములున్నాయి. నెలనెలా జిల్లాకు సుమారు 13 వేల టన్నుల సబ్సిడి బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో గానీ, ఇతర జిల్లాల్లో గానీ ఉన్న స్టేజ్-1 గోదాం నుంచి సంబంధిత స్టేజ్-1 కాంట్రాక్టర్ మండలస్థాయి స్టాక్ పాయింట్లకు రేషన్ సరుకులు రవాణా చేస్తాడు. అక్కడి నుండి స్టేజ్-2 కాంట్రాక్టర్ గ్రామాల్లోని రేషన్ డీలర్లకు రేషన్ సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే డీలర్లు ప్రతినెలా తమ కోటాకనుగుణంగా డీడీలు చెల్లించి 18 తేదీలోగా మండల రెవెన్యూ కార్యాలయంలో అందజేస్తే వారు ఆర్‌ఓలు జారీ చేస్తారు. ఇందుకనుగుణంగా నెల చివరి వరకు స్టేజ్-2 కాంట్రాక్టర్ డీలర్లకు రేషన్ సరఫరా చేయాలి.
 
బియ్యం పక్కదారి పడుతున్న తీరిది
మామూలుగా స్టేజ్-1 గోదాం నుంచి రేషన్ సరుకులను వే బ్రిడ్జి మీద తూకం వేసి ఇస్తారు. అలాగే స్టేజీ-2 గోదాం నుంచి సరుకులను తూకం వేసిన తర్వాతే  డీలర్లకు పంపిణీ చేయాలి. జిల్లాలోని ఎంఎల్‌ఎస్ పాయింట్లలో ఎక్కడా వే బ్రిడ్జిలు లేవు. కేవలం చిన్నపాటి తులామాన్ తూకాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో బియ్యం తూకం వేయకుండానే 50 కిలోల లెక్కన బియ్యాన్ని సంచిల్లో నింపి డీలర్లకు సరఫరా చేస్తున్నారు. బియ్యం సంచులు లోడ్ అన్‌లోడ్ చేసేటప్పుడు ఇనుప కొక్కాలు వాడుతుంటారు. దీంతో సంచులకు కన్నాలు పడి కిలోల కొద్ది బియ్యం గోదాంలో పడిపోతుంటాయి.

బియ్యంలోని తేమ ఆవిరవుతుండటంతో కూడా సంచుల్లో తరుగు వస్తుంది. ఈ లెక్కన 50 కిలోలుండాల్సిన బియ్యం సంచి డీలరును చేరే సరికి 48 నుంచి 49 కిలోలు మాత్రమే ఉంటుందన్న ఆరోపణలున్నాయి. ఒక్కోసారి సంచులకు రంద్రాలు పడితే అందులో 5 కిలోల వరకు తరుగు వస్తుందని డీలర్లు వాపోతున్నారు. ఈ లెక్కన గోదాముల్లో నెలనెలా క్వింటాళ్లకొద్ది బియ్యం మిగిలిపోతున్నాయి. అలాగే బోగస్ రేషన్‌కార్డులు కలిగి ఉన్న రేషన్ డీలర్లు మిగులుబాటు బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్‌లోనే అమ్ముకుంటున్నారు.

కొన్నిచోట్ల రేషన్ డీలర్లు ప్రతినెల మొదటివారంలో ఇవ్వాల్సిన బియ్యాన్ని 20వ  తేదీ నుంచి సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అవికూడా రెండు, మూడు రోజులకోసారి బియ్యం ఇస్తుండటంతో 20 శాతం బియ్యం పంపిణీ చేయకముందే మరో నెల కోటా వ స్తోంది. ఇలా ఒక నెల బియ్యం..మరో నెలలో కలుపుతూ ఏడాదికి ఎంతలేదన్నా రెండు, మూడు కోటాల రేషన్ సరుకులను మింగేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరికొన్ని గ్రామాల్లో ఒకే వ్యక్తి పేరుపై రెండు, మూడు బినామి రేషన్ షాపులున్నాయి. అవికూడా వేర్వేరు షాపులుగా కాకుండా ఒకేదుకాణంలో నిర్వహిస్తున్నారు. అలాగే సంక్షేమ హాస్టళ్లలో అధికారులు  బినామీ విద్యార్థుల పేర్లు నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

వీరికి సంబంధించిన బియ్యం కూడా మిగిలిపోతున్నాయి. ఇలా రకరకాల మోసాలతో మిగిలించుకున్న బియ్యం తిరిగి గోదాముల్లోకే చేరుతున్నాయి. బయట అమ్ముకుంటే బజారు పాలవుతామన్న ఉద్దేశ్యంతో అవినీతి పరులు గుట్టుచప్పుడు కాకుండా మిగులుబాటు బియ్యాన్ని గోదాంలోనే వదిలేసి...అందుకు సంబంధించిన డబ్బులందుకొని బయట పడుతున్నారనే ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం రేషన్ సరుకులు గ్రామాల్లోకి తీసుకెళ్లే సమయంలో తప్పనిసరిగా రూట్ అధికారి ఉండాలి. గ్రామంలోని కనీసం ఐదు గురుకి సమాచారం ఇవ్వాలి. కానీ చాలా చోట్ల ఈ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. కొన్ని చోట్ల ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా బియ్యం సరఫరా చేస్తున్నారు. దీంతో బియ్యం బకాసురుల అవినీతికి అడ్డేలేకుండా పోతుంది.
 
ఆర్‌ఓలే మారుతాయ్... బియ్యం బస్తాలు కదలవు..
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వార సరఫరా చేసే బియ్యం కుంభకోణం రాకెట్ పకడ్బందీ ప్రణాళికతో, హైటెక్ మోసంతో కొనసాగుతుందన్న ఆరోపణలున్నాయి. సాధారణంగా మండలస్థాయి స్టాక్ పాయింట్లలో వివిధ మార్గాల ద్వారా ప్రతినెల ఎన్ని బియ్యం మిగులుతాయనే విషయం సంబంధిత గోదాం ఇన్‌చార్జికి అవగాహన ఉంటుంది. అంతే పరిమాణంలో రేషన్ బియ్యాన్ని స్టేజ్-1 గోదాం నుంచి స్టేజ్-2 గోదాంకు తీసుకురాకుండానే ఆర్‌ఓలను ఎంఎల్‌ఎస్ పాయింట్ల స్టాక్ రిజిష్టర్‌లో నమోదు చేసుకుంటారని ఆరోపణలున్నాయి.

ఈ మేరకు అక్రమ పద్ధతి ద్వారా మిగిలిన బియ్యాన్ని సర్దుబాటు చేస్తారు. అలాగే స్టేజ్-1 గోదాంలో మిగిలిన బియ్యానికి సమానంగా ఏదో ఒక రైస్‌మిల్ నుంచి లేవీ కింద తెచ్చి జమ చేసినట్లు లెక్కలు చూపుతారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో డీలర్లు, గోదాం అధికారులు, కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్లు కూడబలుక్కొని లక్షలాది రూపాయల బియ్యం కుంభకోణాలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. సాధారణంగా స్టేజ్-1 ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్ట్ పొందిన వ్యక్తులు స్టేజ్-2 కాంట్రాక్ట్ తీసుకోకూడదనే నిబంధనలున్నాయి. కానీ స్టేజ్-1 కాంట్రాక్టరే బినామీ పేర్లతో స్టేజ్-2 కాంట్రాక్ట్ తీసుకుని నడిపిస్తున్నట్లు సమాచారం.
 
కేసులైనా...ఆగని అక్రమాలు..
* ఈనెల 15న దుబ్బాక ఎంఎల్‌ఎస్ పాయింట్‌పై విజిలెన్స్ శాఖ దాడులు చేయగా, 54 బియ్యం బస్తాలు, రెండు ఉప్పు బస్తాలు, ఒక చెక్కర బస్తా తక్కువగా వచ్చాయి.
* ఈ సంవత్సరం జూలైలో సదాశివపేటలోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌పై జరిగిన విజిలెన్స్ దాడి చేయగా, భారీమొత్తంలో బియ్యం స్టాక్ గల్లంతైనట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆందోళనకు లోనైన గోదాం ఇన్‌చార్జి గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు.
* ఏడాదిన్నర క్రితం గజ్వేల్ ఎంఎల్‌ఎస్ పాయింట్ పై జరిగిన దాడిలో సుమారు 50 క్వింటాళ్ల బియ్యం తక్కువగా వచ్చినట్లు సమాచారం.
 
తూకానికి వే బ్రిడ్జిలు లేవు: సివిల్ సప్లయీస్ డీఏం జయరాజ్
జిల్లాలోని గోదాముల్లో బియ్యం తూకం చేయడానికి వే బ్రిడ్జిలు లేవు. వేసవికాలంలో బియ్యం తరుగు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తూకం చేస్తుంటారు. ఇతర సమయాల్లో డీలర్లు అడిగితే బయట వే బ్రిడ్జిలపై తూకం వేసి ఇస్తారు. గోదాముల్లో ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వహించవద్దు. ఎలాంటి అక్రమాలు జరిగినా తగిన చర్యలు తీసుకుంటాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement