గివ్ ఇట్ అప్
బియ్యం వద్దనుకుంటే తహసీల్దార్‌కు లేఖ ఇస్తే చాలు..
ఆ మేరకు డీలర్ కోటాలో కోత
మిగతా రేషన్ సరుకులు యథావిధిగా పొందొచ్చు
కేంద్రం నుంచి వెలువడిన ఉత్తర్వులు
వరంగల్ రూరల్ : గ్యాస్ సిలిండర్‌పై రాయితీ వద్దనుకునే సంపన్నుల కోసం గతంలో కేంద్రప్రభుత్వం ‘గివ్ ఇట్ అప్’ సౌకర్యాన్ని కల్పించింది. దీని ద్వారా నమో దు చేసుకున్న సెల్ నంబర్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటే గ్యాస్ సిలిండర్‌ను ఉత్పత్తి ధరకే అందిస్తున్నారు. ఇదే రీతిలో దొడ్డు బియ్యం వద్దనుకునే రేషన్ కార్డుదారులకు కూడా ‘గివ్ ఇట్ అప్’ పథకాన్ని వర్తింపజేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.
దొడ్డు బియ్యం తినలేం..
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పలువురికి నూతన రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఈ కార్డులోని పేర్ల ఆధారంగా ఒక్కొక్కరికి రూ.1కి కిలో చొప్పున ఆరు కిలోల బియ్యం అందజేస్తున్నారు. దీనికి తోడు చక్కెర, గోధుమలు, నూనె ఇత్యాది సరుకులు అందజేస్తున్నారు. అయితే, పలువురు రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం తినలేక బయట అమ్ముకుంటుండగా.. మరికొందరు షాపుల నుంచే తీసుకోవడం లేదు. ఇలా మిగిలిపోయిన బియ్యాన్ని డీలర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీంతో బియ్యం పక్క దారి పడుతోందని గుర్తించిన ప్రభుత్వం ‘గివ్ ఇట్ అప్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా తమకు బియ్యం అవసరం లేదని తహసీల్దార్ లేఖ ఇస్తే ఆ లబ్ధిదారుడు సరుకులు తీసుకునే డీలర్ కోటా నుంచి మినహాయించి సరఫరా చేస్తారు. అయితే, రేషన్ కార్డుపై ఇచ్చే మిగతా సరుకులను మాత్రం యథావిధిగా తీసుకోవచ్చు. అంతేకాకుండా మిగతా అవసరాలకు కూడా కార్డు పనికొస్తుంది. కాగా, వరంగల్ రూరల్ జిల్లాలో 3,42,084 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 2,17,422 మందికి ఆహార భద్రత కార్డులు, 12,865 మందికి అంత్యోదయ కార్డులు ఉండగా, 15మంది అన్నపూర్ణ కార్డులు పొందారు.
ఖర్చు ఎక్కువ ఉపయోగం తక్కువ
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి రుపాయి కి కిలో బియ్యం అందించడానికి అధిక మొత్తంలో ప్రభుత్వాలు నిధులు వెచ్చిస్తున్నాయి. రూ.23 నుంచి రూ.24కు కేజీ చొప్పున ప్రభుత్వం రైసు మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసి, రూ.1కే కిలో చొప్పున లబ్ధిదారులకు అందజేస్తోంది. తద్వారా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున నిధులు వెచ్చించాల్సి వస్తోంది. అయితే, పలువురు దొడ్డు బియ్యం తినేందుకు ఆసక్తి చూపకపోవడంతో వివిధ మార్గాల ద్వారా పక్కదారి పడుతోంది.
తెల్ల కాగితంపై రాసి ఇవ్వాలి..
ఎస్‌డబ్ల్యూ.పీటర్, డీఎస్‌ఓ (07 డబ్ల్యూజీఎల్ 301 లేదా 302 – ఎస్‌డబ్ల్యూ.పీటర్, డీఎస్‌ఓ)కార్డుదారుల్లో రూ.1కి కిలో బియ్యం వద్దనుకునేవారు తహసీల్దార్‌కు ‘గివ్ ఇట్ అప్’ వర్తింపజేయాలని తెల్లకాగితంపై రాసి ఇవ్వాల్సి ఉంటుంది. అలా నెలనెలా ఎంత బియ్యం వద్దనుకుంటున్నారో లెక్క వేసి వారి రేషన్ షాపులకు ఇచ్చే నుంచి మినహాయిస్తాం. అయితే, బియ్యం వద్దని రాసిస్తే మిగతా సరుకులు కూడా ఇవ్వరని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిగతావన్నీ యథావిధిగా ఇస్తారు. దీనికి సంబంధించి మాకు కేంద్రప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా వచ్చాయి.